నానాటికీ ... తీసికట్టు! | Degree Admissions Decreased In MG university Nalgonda | Sakshi
Sakshi News home page

నానాటికీ ... తీసికట్టు!

Published Sat, Jun 15 2019 10:27 AM | Last Updated on Sat, Jun 15 2019 10:27 AM

Degree Admissions Decreased In MG university Nalgonda - Sakshi

మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)పరిధిలోని డిగ్రీ కాలేజీలపై విద్యార్థులు విశ్వాసం కోల్పోతున్నారా..? ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మిగిలిపోయే ముప్పు ఏర్పడిందా..? కారణాలు అన్వేషించి పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు..? అన్న ప్రశ్నలు ఇప్పుడు విద్యార్థిలోకంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అన్నీ ఎంజీయూ పరిధిలోకే వస్తాయి. గత కొన్ని విద్యా సంవత్సరాల్లో జరిగిన డిగ్రీ ప్రవేశాలను గమనిస్తే.. ఏటికేడు డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ గణనీయంగా పడిపోతోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన నల్లగొండ ఎన్జీ కళాశాల, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరిల్లోని కాలేజీలూ ఉసూరుమంటున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిన ఫలితంగా కొన్ని కోర్సులకూ మంగళం పాడారు. ఇక, ప్రైవేటు కాలేజీల్లో చేరే విద్యార్థులే లేకుండా పోతున్నారు. అసలు డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు కన్నెత్తి చూడడం లేదా అంటే అదే కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే,  రాష్ట్రవ్యాప్తంగా ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో జరుగుతున్న  ప్రవేశాలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయని అంటున్నారు. ఎటొచ్చీ ఎంజీయూ పరిధిలోనే ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఏటేటా పడిపోతున్న ప్రవేశాలు
అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు.. 2012–13 విద్యాసంవత్సరంలో 45వేల సీట్లు భర్తీ అయ్యాయి. 2015–16లో 38 వేలు, 2016–17లో 28వేలకు పడిపోయింది. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన సీట్లు 33,600 కాగా, ఫేజ్‌ –1లో ఇప్పటి వరకు కేవలం 5,416 సీట్లు మాత్రమే నిండాయి. యూనివర్సిటీల వారీగా చూసినా, దోస్త్‌ ద్వారా ఫేజ్‌–1లో ఉస్మానియా యూనివర్సిటీలో 44,726, కాకతీయ యూనివర్సిటీలో 27,010, శాతవాహన యూనివర్సిటీలో 12355, తెలంగాణ యూనివర్సిటీలో 8,855, పాలమూరు యూనివర్సిటీలో 7,221 సీట్లు భర్తీ కాగా, మహాత్మ గాంధీ యూనిర్సిటీ పరిధిలో మాత్రం కేవలం 5,416 సీట్లలో మాత్రమే ప్రవేశాలు జరిగాయి.

విద్యార్థులకు అనుకూలంగా లేని అకడమిక్‌ క్యాలెండర్, పరీక్షల నిర్వహణ తదితర కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలను ఎంచుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు, ఆధునిక కోర్సులకూ డిమాండ్‌ ఉందని, కానీ, ఎంజీయూ పరిధిలో మాత్రం  ప్రవేశాలు గణనీ యంగా తగ్గి పోతుండడం ఆందోళన కలిగి స్తోందన్న అభిప్రా యం వ్యక్తం అవుతోంది. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో సైతం సీట్లు మిగిలిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతోందని పేర్కొంటున్నారు. యూ నివర్సిటీ అధికారులు ఇప్పటికైనా.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగిలే, విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement