mg university
-
‘నవీన్ తల్లిదండ్రులకు మా క్షమాపణలు’
సాక్షి, వరంగల్: ఒకరేమో అనుమానంతో ఉన్మాదిగా మారిపోయి నమ్మిన స్నేహితుడినే కడతేర్చాడు. మరొకరేమో.. ఆ ఘాతుకంలో ప్రాణం పొగొట్టుకున్నాడు. హరిహరకృష్ణ-నవీన్‌లు ఇద్దరూ.. కన్నవాళ్లకూ పుట్టెడు దుఃఖం మిగిల్చారు. నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ హత్యోదంతం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడు హరిహరకృష్ణ తల్లిదండ్రులనూ పోలీసులు ప్రశ్నించగా.. మరోవైపు మీడియా వద్ద తండ్రి పేరాల ప్రభాకర్ తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్. తండ్రీ పేరాల ప్రభాకర్ ఆర్ఎంపీ డాక్టర్, తల్లి గృహిణి. ప్రభాకర్ స్థానికంగా ఓ క్లినిక్ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నవాడు హరిహరకృష్ణ. పెద్దకొడుకు ముఖేష్ కృష్ణ 2010లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే.. ముఖేష్ కృష్ణ 2011 జూన్ 15న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నోడు సక్రమంగా పెరగాలని ఆ తల్లిదండ్రులు భావించారు. అందుకే దూరంగా హైదరాబాద్‌లో చదివిస్తున్నారు. సుమారు 14 ఏళ్ళ నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు హరిహరకృష్ణ. ఈ క్రమంలోనే నవీన్‌తో స్నేహం ఏర్పడి.. ఇద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు. అలాంటి స్నేహితుల మధ్య అమ్మాయి కోసం వైరం ఏర్పడి.. చంపేంత దాకా వెళ్లింది!. అయితే తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని అంగీకరించిన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్.. నవీన్ తల్లిదండ్రులను క్షమించమని వేడుకుంటున్నాడు. ‘‘ఐదు నెలల క్రితమే ఐదారుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకున్నారు. అక్క ఇల్లు.. ఉండగా రూమ్ ఎందుకు తీసుకున్నావని అడిగితే అందరం కలిసి చదువుకుంటున్నామని చెప్పాడు. మహాశివరాత్రి రోజున వరంగల్ కు వచ్చాడు. ఆరోజు ఫోన్లు బాగా రావడంతో ఆందోళనకరంగా కనిపించాడు. ఏమైందని అడిగితే.. ఏమీ లేదంటూ వరంగల్ నుండి హైదరాబాద్‌కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదు. అప్పటికే నవీన్ కనపడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. అందుకే మా అబ్బాయి కూడా కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాం. చివరికి.. ఈ నెల 23వ తేదీన వరంగల్ వచ్చాడు. ఏం జరిగిందని నిలదీస్తే అప్పుడు చెప్పాడు. నవీన్‌కు తనకు మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పాడు. తీవ్రంగా మందలించి.. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సూచించాను. స్థానికంగా మిల్స్ కాలనీ పోలీసుల దగ్గరకు వెళ్దామంటే.. లేదు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అలాగే చేశాడు. ఈ హత్య మా అబ్బాయి ఒక్కడే చేసినట్లు అనిపించడం లేదు. ఇంకా ఇంకొందరు ఉండవచ్చు. అమ్మాయి కోసం హత్య అంటున్నారు. కాబట్టి, ఆమెను కూడా విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మా అబ్బాయికి నేర చరిత్ర లేదు. గంజాయి తీసుకోడు. మద్యం తాగే అలవాటు ఉంది. ఆ మత్తులో హత్య చేశాడని భావిస్తున్నాను. చదువులో క్లెవర్ స్టూడెంట్. ఏదో జరిగి ఉంటుందనే అనుమానం ఉంది. పెద్ద కొడుకు ఆత్మహత్య.. చిన్న కొడుకు హత్య కేసులో జైలు పాలుకావడంతో హరిహరకృష్ణ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. -
నల్లగొండ ఎంజీ వర్సిటీ విద్యార్థి నవీన్ హత్య కేసు
-
స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..
అబ్దుల్లాపూర్‌మెట్/కల్వకుర్తి టౌన్/ చారకొండ/ ఎంజీయూ (నల్లగొండ రూరల్)/ నార్కట్‌పల్లి: అతను స్నేహితుడు.. కానీ తాను ప్రేమించిన యువతికి దగ్గర అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.. తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన ఇది. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది. ఇంటర్ నుంచీ స్నేహితులు.. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని వంకరాయి తండాకు చెందిన నేనావత్ శంకర్ కుమారుడు నేనావత్ నవీన్ (20), వరంగల్‌కు చెందిన పేరాల ప్రభాకర్ కుమారుడు పేరాల హరిహరకృష్ణ (21) ఇద్దరూ స్నేహితులు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడీఎల్ కాలేజీలో కలిసి ఇంటర్ చదివారు. తర్వాత హరిహరకృష్ణ పీర్జాదిగూడలోని అరోరా కళాశాలలో.. నవీన్ నార్కట్‌పల్లిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బీటెక్‌లో చేరారు. అయినా తమ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే హరిహరకృష్ణ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. నవీన్ కూడా అదే యువతిని ఇష్టపడ్డాడు. సదరు యువతి కూడా కొంతకాలం నుంచి తనను దూరం పెడుతూ నవీన్‌తో చనువుగా ఉండటాన్ని హరిహరకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. నవీన్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ముందుగానే ప్లాన్ చేసుకుని.. నవీన్‌ను అంతమొందించాలని రెండు నెలల నుంచే ప్లాన్ చేసుకున్న హరిహరకృష్ణ.. ఈ నెల 17న ఇంటర్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ ఉందని, రావాలని నవీన్‌కు ఫోన్ చేశాడు. ఇది నమ్మిన నవీన్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి హరిహరకృష్ణను కలిశాడు. కాసేపు ఇద్దరూ బైక్‌పై కలిసి తిరిగారు. సాయంత్రం మద్యం తీసుకుని బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ప్రేమించిన యువతి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే ప్లాన్ ప్రకారం పదునైన కత్తి తెచ్చుకున్న హరిహరకృష్ణ దానితో దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న నవీన్ దీనిని ప్రతిఘటించలేకపోయాడు. తీవ్ర ఆవేశంలో ఉన్న హరిహరకృష్ణ కత్తితో నవీన్ తలను, కాళ్లు, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌ను కోసి ముక్కలు చేశాడు. ఛాతీ భాగాన్ని చీల్చి గుండెను బయటికి తీశాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో స్నేహితుడి ఇంటికి వెళ్లి.. స్నానం చేసి.. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ నేరుగా హాసన్ అనే మరో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. కాస్త టెన్షన్‌గా కనిపించడంతో ఏం జరిగిందని హాసన్ ప్రశ్నించినా ఏమీ లేదంటూ.. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసిన వచ్చాడు. తర్వాత హత్య గురించి హాసన్‌కు చెప్పాడు. దీనితో భయపడిన హాసన్ వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని సూచించగా.. తెల్లారాక వెళ్తానని చెప్పి, అక్కడే నిద్రపోయాడు. మరునాడు మూసారాంబాగ్‌లోని తన సోదరి మమత ఇంటికి వెళ్లాడు. నాలుగైదు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఏమీ తెలియనట్టు నటిస్తూ.. ఈ నెల 16న యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చి నప్పటి నుంచీ నవీన్ ఆచూకీ తెలియకపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. హరిహరకృష్ణను కలిసి ఏం జరిగిందని నిలదీశారు. అయితే ఓ యువతి విషయంలో తమ మధ్య గొడవ జరిగినది నిజమేనని, కానీ తర్వాత ఇద్దరం కలుసుకున్నామని హరిహరకృష్ణ చెప్పాడు. నవీన్ నార్కట్‌పల్లికి వెళ్తానంటే విజయవాడ జాతీయ రహదారిపై దింపేసి తాను హైదరాబాద్‌కు వెళ్లిపోయానని వివరించాడు. నవీన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాకుండా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నప్పుడువారి వెంటే ఉంటూ నమ్మించాడు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు కూడా వచ్చాడని నవీన్ స్నేహితులు తెలిపారు. అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో.. నాలుగైదు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్న హరిహరకృష్ణ తర్వాత విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో తిరిగాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ప్రియురాలికి ఫోన్ చేసి పిలిపించుకుని మాట్లాడాడు. నవీన్‌ను హత్య, ఇతర అంశాలను ఆమెకు వివరించగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినట్టు తెలిసింది. మరోవైపు హరిహరకృష్ణను కలవడానికి వెళ్లిన నవీన్ ఆచూకీ లేకపోవడం, హరిహరకృష్ణ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుండటంతో.. నవీన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహరకృష్ణ కుటుంబ సభ్యులనూ ప్రశ్నించారు. ఇలా అన్నివైపులా ఒత్తిడి రావడంతో హరిహరకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు అతడిని శనివారం రాత్రి హయత్‌నగర్ మెజి స్ట్రేట్ ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది. కాగా.. నవీన్ హత్యకు హరిహరకృష్ణ ఒక్కడే పాల్పడ్డాడా, మరెవరైనా ఉన్నారా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ హత్యకు గురైన రోజు హరిహరకృష్ణతోపాటు మరో స్నేహితుడైన జీవన్ కూడా తన బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వచ్చినట్టు తెలిసింది. అతను వెళ్లిపోయాక హత్య జరిగిందా? కలిసే హత్య చేశారా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నవీన్ కుటుంబ సభ్యుల ఆందోళన నిందితుడు హరిహరకృష్ణను కఠినంగా శిక్షించాలంటూ నవీన్ కుటుంబ సభ్యులు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ అక్కడికి చేరుకుని.. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దొరకకుండా జాగ్రత్తపడి.. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహంపై డ్రెస్‌ను తొలగించి దూరంగా పడేశాడని.. హత్యచేసి, శరీర భాగాలను కోసిన సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకున్నాడని వివరించారు. అలాగే ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తనకు చెందిన రెండు ఫోన్లలోని డేటా మొత్తాన్ని తొలగించినట్టు సమాచారం. విషాదంలో వంకరాయి తండా నవీన్ హత్య విషయం తెలియడంతో అతడి స్వగ్రామం వంకరాయితండాలో విషాదం అలుముకుంది. నవీన్ తండ్రి శంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి వసంత కూలిపనులకు వెళ్తుంది. గ్రామం నుంచి కల్వకుర్తికి వలస వచ్చిన వారిద్దరూ.. కష్టపడి పనిచేస్తూ కుమారుడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు దారుణంగా హత్యకు గురికావడంతో కన్నీటిలో మునిగిపోయారు. పోలీసులు శనివారం సాయంత్రం నవీన్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రికి వంకరాయితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. 20 మీటర్లకు ఓ ముక్క.. యువతికి వాట్సాప్‌లో ఫొటోలు! పోలీసులు లొంగిపోయిన హరిహరకృష్ణను ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. మద్యం మత్తులోనే నవీన్‌ను హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నవీన్ శరీరాన్ని ముక్కలుగా చేశాక.. 20 మీటర్లకో భాగాన్ని దూరదూరంగా పారేసినట్టు తేల్చారు. ఆ భాగాలను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇక నవీన్‌ను కిరాతకంగా చంపిన హరిహరకృష్ణ.. అతడి శరీర భాగాలను ఫొటోలు తీసి ప్రేమించిన యువతికి, పలువురు ఇంటర్ స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారమే హత్య నవీన్ హత్య పథకం ప్రకారమే జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితుడు తన వెంట పదునైన కత్తిని తీసుకుని వచ్చాడంటే అది క్షణికావేశంలో జరిగిన హత్యగా కనిపించడం లేదు. కొంతకాలంగా నవీన్‌పై హరిహరకృష్ణ పెంచుకున్న పగే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తాం. – సాయిశ్రీ, డీసీపీ ఎల్బీనగర్ చదవండి: వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్.. -
ఎంజీ యూనివర్శిటీ కీచక వైస్ ప్రిన్సిపల్!
సాక్షి, నల్గొండ: మహత్మగాంధీ యూనివర్శిటీ.. దేవాలయంలాంటి ఈ విద్యాలయంలో బాధ్యతగా పర్యవేక్షణ చేయాల్సిన కళాశాల వైస్ ప్రిన్సిపల్.. స్థాయి మరచి ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. అతగాడి వేధింపులు భరించలేని విద్యార్థినులు ఎస్పీకి ఫిర్యాధు చేయడంతో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ వై. పునీత్‌కుమార్.. విద్యార్థినులకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని మూడు రోజుల క్రితం బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని యూనివర్శిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకేళ్లారు. దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు వైస్ ప్రిన్సిపాల్ మళ్లీ విద్యార్థినులకు అసభ్యకర మెసెజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. దీంతో భరించలేక విద్యార్థులు స్థానిక ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో బాధితు విద్యార్థినులు వైస్ ప్రిన్సిపల్‌ను విచారణ జరిపి విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. ఫోన్‌డేటా, మెసెజ్‌ల పరిశీలన విద్యార్థినుల ఫిర్యాధు మేరకు ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్‌డేటా, అతను పంపిన మెసెజ్‌లను పరిశీలించడంతో రుజువైంది. ఇక అప్పటికే నిందితుడు పరారీ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందంతో రెండు రోజుల క్రితం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కవలలపై కీచక తండ్రి, మేనమామ అఘాయిత్యం కమిటీ ఏర్పాటు ఇంజనీరింగ్ వైఎస్ ప్రిన్సిపాల్ పునీత్ కుమార్ విద్యార్థినులను వేధిస్తున్న విషయమై యూనివర్శిటీలో ఓ కమిటీని నియమించినట్లు ఏస్పీ రంగానాథ్ తెలిపారు. కమిటీ సభ్యుల విచారణలో తనకు అనుకూలంగా చెప్పాలని పలువురు విద్యార్థులకు ఫోన్ చేయడంతో పాటు మెసెజ్‌లు పంపినట్లు కమిటీ వెల్లడించింది. దీంతో కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయమై యూనివర్శిటీ రిజీస్టార్ యాదగిరిని ఫోన్లో విచారణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందిచలేదని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఓ అధ్యాపకుడికి దేహశుద్ధి యూనివర్శిటీలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, గతంలో కూడా ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సదరు కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి చేసినట్లు వెల్లడించారు. పిల్లల బంగారు భవిష్యత్తుపై కలలు కంటున్న తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం యూనివర్శిటీలకు పంపిస్తే.. మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యాపకులు అనుసరిస్తున్న తీరు బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సదరు నిందితుడు కీచక వైస్ ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నానాటికీ ... తీసికట్టు!
మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)పరిధిలోని డిగ్రీ కాలేజీలపై విద్యార్థులు విశ్వాసం కోల్పోతున్నారా..? ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మిగిలిపోయే ముప్పు ఏర్పడిందా..? కారణాలు అన్వేషించి పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు..? అన్న ప్రశ్నలు ఇప్పుడు విద్యార్థిలోకంలో హాట్ టాపిక్‌గా మారాయి. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అన్నీ ఎంజీయూ పరిధిలోకే వస్తాయి. గత కొన్ని విద్యా సంవత్సరాల్లో జరిగిన డిగ్రీ ప్రవేశాలను గమనిస్తే.. ఏటికేడు డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ గణనీయంగా పడిపోతోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన నల్లగొండ ఎన్జీ కళాశాల, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరిల్లోని కాలేజీలూ ఉసూరుమంటున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిన ఫలితంగా కొన్ని కోర్సులకూ మంగళం పాడారు. ఇక, ప్రైవేటు కాలేజీల్లో చేరే విద్యార్థులే లేకుండా పోతున్నారు. అసలు డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు కన్నెత్తి చూడడం లేదా అంటే అదే కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే, రాష్ట్రవ్యాప్తంగా ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో జరుగుతున్న ప్రవేశాలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయని అంటున్నారు. ఎటొచ్చీ ఎంజీయూ పరిధిలోనే ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏటేటా పడిపోతున్న ప్రవేశాలు అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు.. 2012–13 విద్యాసంవత్సరంలో 45వేల సీట్లు భర్తీ అయ్యాయి. 2015–16లో 38 వేలు, 2016–17లో 28వేలకు పడిపోయింది. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన సీట్లు 33,600 కాగా, ఫేజ్ –1లో ఇప్పటి వరకు కేవలం 5,416 సీట్లు మాత్రమే నిండాయి. యూనివర్సిటీల వారీగా చూసినా, దోస్త్ ద్వారా ఫేజ్–1లో ఉస్మానియా యూనివర్సిటీలో 44,726, కాకతీయ యూనివర్సిటీలో 27,010, శాతవాహన యూనివర్సిటీలో 12355, తెలంగాణ యూనివర్సిటీలో 8,855, పాలమూరు యూనివర్సిటీలో 7,221 సీట్లు భర్తీ కాగా, మహాత్మ గాంధీ యూనిర్సిటీ పరిధిలో మాత్రం కేవలం 5,416 సీట్లలో మాత్రమే ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులకు అనుకూలంగా లేని అకడమిక్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణ తదితర కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలను ఎంచుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు, ఆధునిక కోర్సులకూ డిమాండ్ ఉందని, కానీ, ఎంజీయూ పరిధిలో మాత్రం ప్రవేశాలు గణనీ యంగా తగ్గి పోతుండడం ఆందోళన కలిగి స్తోందన్న అభిప్రా యం వ్యక్తం అవుతోంది. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో సైతం సీట్లు మిగిలిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతోందని పేర్కొంటున్నారు. యూ నివర్సిటీ అధికారులు ఇప్పటికైనా.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగిలే, విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు. -
ఆ..32మంది అవుట్
ఎంతోకాలంగా నానుతున్న మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా నియామకమైన అధ్యాపకుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. విచారణ కమిటీల నివేదికలు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని పాలకమండలి సమావేశం నిర్ణయించింది. నిబంధనలను తుంగలోతొక్కి అధ్యాపకులను నియమించారని ‘సాక్షి’ పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. అటు నివేదికలు, ఇటు పత్రికల కథనాలను పరిగణనలోకి తీసుకుని అక్రమాలు వాస్తవమని తేలడంతో అధ్యాపకులకు ఉద్వాసన పలికింది. ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా నియామకమైన ఆ.. 32 మంది అధ్యాపకులకు ఉద్వాసన పలికారు. ఈ మేరకు వారిని విధులనుంచి తొలగించాలని యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 26మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీసులు ఇచ్చి తొలగించాలని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. అభ్యర్థుల అర్హత పరిశీలించకుండా, రిజర్వేషన్ విధానం పాటించకుండా అధ్యాపకుల నియామకం చేపట్టారు. గత పాలక మండలిలలో ఆయా అధ్యాపకుల ప్రొబేషనరీ కాలాన్ని డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. పెద్దఎత్తున దుమారానికి తెరలేపింది. దీనిపై కొందరు అభ్యర్థులు సీఎంఓ, గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై విచారణ కమిటీ నియమించడంతోపాటు నిఘా వర్గాలనుంచి సమాచారం సేకరించారు. ఈ అక్రమ నియామకాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. అన్నింటి ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో యూనివర్సిటీ పాలకమండలి వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో ఆ.. 32 మంది అధ్యాపకులకు నోటీసులు ఇవ్వనున్నారు. అయితే ఈ అధ్యాపకుల నియామకాలపై మొదటినుంచీ వివాదాలే ఉన్నాయి. 2011లో నోటిఫికేషన్ ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాతిపదికన 2011లో నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. 2012 ఫిబ్రవరిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 32 మందిని నియమించారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరు వివాదాస్పదమైంది. ఏ ఒక్క నిబంధన పాటించకుండా, యూజీసీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి నియామకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కరినుంచి రూ.లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరికి ఈ నియామకానికి సంబంధించి సదరు అధ్యాపకులకు చెల్లించిన వేతనాలను రికవరీ చేయాలని ఆడిట్ బృందం కూడా స్పష్టం చేసింది. పోస్టుల మంజూరులో మార్పు జీఓ ఎం.ఎస్ 11 ద్వారా ఒక కోర్సుకు మంజూరైన పోస్టును ఎలాంటి అనుమతీ లేకుండా మరో కోర్సుకు మార్చారు. 2008 వరకు ప్రారంభమైన కోర్సులకు మాత్రమే బోధన సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. కెమిస్ట్రీ కోర్సు 2009లో, 5 ఏళ్ల ఫార్మాస్యూటికల్ కోర్సు 2008లో వచ్చింది. కానీ కెమిస్ట్రీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లను వారికి అనుగుణంగా మార్చుకున్నారు. అదే విధంగా ఎంబీఏ టీటీఎం, జనరల్ ఎంబీఏలకు కూడా అదే తరహాలో రోస్టర్ నిర్వహించారు. ఇంటర్వ్యూలంతా గందరగోళం కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలకు 2012 ఫిబ్రవరి 4న ఒకేరోజు 289 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ రోజు వచ్చింది 174 మంది వచ్చారు. వచ్చిన వారిని అడిగింది అభ్యర్థి పేరు మాత్రమే. ఎటువంటి వివరాలను అడగకుండానే ఇంటర్వ్యూలు ముగించారు. ఈ విభాగంలో 174 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 164 మంది వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇక్కడ రెండు రికార్డులు మెయింటెన్ చేశారు. ఎంపికైన అభ్యర్థికి ఏపీఐ (అకడమిక్ ఫర్ఫామెన్స్ ఇండికేటర్) స్కోర్ 300 ఉండాలి. కానీ వీరు ఎంపిక చేసిన 32మందిలో ఏ ఒక్క అభ్యర్థికి 30 స్కోర్ మించలేదు. ఇంటర్వ్యూ వీడియో రికార్డు చేస్తామని రూ.85వేల బిల్లు పొందారు. 170 వరకు డీవీడీలు ఉన్నట్లు బిల్లు సృష్టించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆడిట్ బృందానికి ఏవీ చూపించకపోవడంతో అక్రమాలు జరిగాయని తేలిపోయింది. ఏమైందని అడిగితే నియామకాలకు సంబంధించిన ఫైల్ లేదని దాటవేస్తూ వచ్చారు. వెలుగులోకి ఇలా... యూనివర్సిటీలో అక్రమ నియామకాలు భారీగా జరిగాయని అప్పటి ఇన్చార్జ్ వీసీ శైలజారామయ్య.. ప్రిన్సిపాల్ సెక్రటరీకి లేఖ రాశారు. కీలకమైన నియామకాలకు సంబంధించిన ఫైల్ లేదని, 289 మంది అభ్యర్థులకు ఒకే రోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని, ఇంటర్వ్యూలకు వచ్చినా రానట్లుగా రికార్డులు మెయింట్‌నెన్స్ చేశారని, దీనిపై విచారణకు కమిటీ నియమించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం 2016 అక్టోబర్ 20న ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ సులేమాన్ సిద్ధిక్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్‌లో కూడిన త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణ జరిపి 2017లో నివేదిక ఇచ్చింది. అందులో అక్రమాలు జరిగాయని స్పష్టంగా పేర్కొంది. అదే విధంగా ఇటీవల గవర్నర్ నరసింమన్ యూనివర్సిటీ వీసీలతో సమావేశాలు నిర్వహించి కమిటీ నివేదికపై చర్చించారు. అక్రమాలపై ఫిర్యాదు సీఎంఓలో కూడా ఉండడంతో సర్కార్ సీరియస్‌గా పరిగణించింది. అప్పటికప్పుడు ఆమోదం... ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఎంజీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరిగింది. అధ్యాపకుల నియామక అంశం ఎజెం డాలో కూడా లేదు. దీనిపై స్పందించిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన వారిని వెంటనే తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంతోకాలంగా నానుతున్న ఈ అంశాన్ని కాలయాపన చేసేందుకే ఎజెండాలో పెట్టలేదని తెలిసింది. అయితే యూనివర్సిటీకి పాలకమండలి సమావేశమే సుప్రీం. ఇక్కడ చేసిన నిర్ణయాలే అమలులోకి వస్తాయి. యూనివర్సిటీలో ఎలాంటి నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్నా, అభివృద్ధి పనులు, కొత్త కోర్సులు, చివరికి గుండుపిన్ను కొనాలన్నా ఈసీ మీటింగ్ ఆమోదం పొందాల్సిందే. దీంతో అధ్యాపకుల తొలగింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆ..32మంది ఇంటిబాట పట్టాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సర్టిఫికెట్లు ఇచ్చేందుకు తీరిక లేదా?
♦ బీఈడీ పాస్అవుట్ విద్యార్థులతో ఎంజీ వర్సిటీ చెలగాటం ♦ పరీక్షలు పూర్తయి మూడు నెలలైనా మెమోలు ఇవ్వని వైనం ♦ డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన ఎంజీ యూనివర్సిటీ/ నల్లగొండ రూరల్: నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తీరు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. మూడు నెలల క్రితం బీఈడీ పరీక్షలు రాసిన విద్యార్థులకు నేటి వరకు మార్కుల మెమోలు రాలేదు. ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని, నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నా యూనివర్సిటీ అధికారులలో చలనం లేదు. యూనివర్సిటీ పరిధిలో 49 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో ఐదువేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నాలుగు వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015 అక్టోబరులో ఫలితాలు ప్రకటించిన యూనివర్సిటీ.. సర్టిఫికెట్ల జారీలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విషయమై విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక కారణాల వల్ల ప్రింట్ చేయలేకపోతున్నామని ఓసారి, సరైన సిబ్బంది లేరని మరోసారి, బడ్జెట్ రాలేదని ఇంకోసారి చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. యూనివర్సిటీ అధికారులు తమకు సర్టిఫికెట్లు ఇచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయి డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే తాము అర్హత కోల్పోతామనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. గతంలో కూడా సకాలంలో మెమోలు జారీ చేయడం లేదని విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాల యం వద్ద ఆందోళనలు కూడా నిర్వహించారు. అధికారులు విద్యార్థుల పాలిట శాపంగా మారారని, సర్టిఫికెట్లు కోసం త్వర లోనే ఆందోళనలు చేపడతామని విద్యార్థిసంఘాలు హెచ్చరిస్తున్నాయి. 45 రోజుల్లో మెమోలు అందించాలి ఫలితాలు వెల్లడించిన 45 రోజుల్లోగా యూని వర్సిటీ మెమోలు విద్యార్థులకు అందించాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కారణాలేవి చెప్పడం లేదు. ఇతర కోర్సులకు, ఉద్యోగాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మెమోలను గడువులోగా అందించాలి. - కట్టా వినయ్, వర్సిటీ జేఏసీ చైర్మన్ వారం రోజుల్లోగా సర్టిఫికెట్లు జారీ చేస్తాం సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికెట్ల జారీ చేయడంలో జాప్యం జరిగింది. వారం రోజుల్లో సర్టిఫికెట్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే బీఈడీ విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రింట్ అవుతున్నాయి. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - అంజిరెడ్డి, పరీక్షలనియంత్రణ అధికారి -
ఈ రోజు జరగాల్సిన పరీక్షలు రద్దు
నల్లగొండ : నల్గొండలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో బుధవారం జరగాల్సిన అన్నీ పరీక్షలు రద్దు చేస్తూ.. యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్త సమ్మె కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. యూనివర్సిటీ పరిధిలో ఎంఏ, ఎంకాం, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా.. బీఈడీ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. రద్దు అయిన పరీక్షలు ఏ రోజు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.