స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..

Nalgonda MG University Student Killed By Friend Over Love Dispute - Sakshi

తాను ప్రేమించిన యువతికి దగ్గరవుతున్నాడన్న కక్షతో యువకుడి దుర్మార్గం 

పథకం ప్రకారం పిలిపించి.. హత్యచేసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి 

అబ్దుల్లాపూర్‌మెట్‌/కల్వకుర్తి టౌన్‌/ చారకొండ/ ఎంజీయూ (నల్లగొండ రూరల్‌)/ నార్కట్‌పల్లి: అతను స్నేహితుడు.. కానీ తాను ప్రేమించిన యువతికి దగ్గర అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్‌ టుగెదర్‌ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.. తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్‌ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన ఇది. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది. 

ఇంటర్‌ నుంచీ స్నేహితులు.. 
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని వంకరాయి తండాకు చెందిన నేనావత్‌ శంకర్‌ కుమారుడు నేనావత్‌ నవీన్‌ (20), వరంగల్‌కు చెందిన పేరాల ప్రభాకర్‌ కుమారుడు పేరాల హరిహరకృష్ణ (21) ఇద్దరూ స్నేహితులు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడీఎల్‌ కాలేజీలో కలిసి ఇంటర్‌ చదివారు.

తర్వాత హరిహరకృష్ణ పీర్జాదిగూడలోని అరోరా కళాశాలలో.. నవీన్‌ నార్కట్‌పల్లిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ బీటెక్‌లో చేరారు. అయినా తమ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడే హరిహరకృష్ణ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. నవీన్‌ కూడా అదే యువతిని ఇష్టపడ్డాడు. సదరు యువతి కూడా కొంతకాలం నుంచి తనను దూరం పెడుతూ నవీన్‌తో చనువుగా ఉండటాన్ని హరిహరకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. నవీన్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. 

ముందుగానే ప్లాన్‌ చేసుకుని.. 
నవీన్‌ను అంతమొందించాలని రెండు నెలల నుంచే ప్లాన్‌ చేసుకున్న హరిహరకృష్ణ.. ఈ నెల 17న ఇంటర్‌ ఫ్రెండ్స్‌ గెట్‌ టు గెదర్‌ ఉందని, రావాలని నవీన్‌కు ఫోన్‌ చేశాడు. ఇది నమ్మిన నవీన్‌ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి హరిహరకృష్ణను కలిశాడు. కాసేపు ఇద్దరూ బైక్‌పై కలిసి తిరిగారు. సాయంత్రం మద్యం తీసుకుని బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు.

మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ప్రేమించిన యువతి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే ప్లాన్‌ ప్రకారం పదునైన కత్తి తెచ్చుకున్న హరిహరకృష్ణ దానితో దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న నవీన్‌ దీనిని ప్రతిఘటించలేకపోయాడు. తీవ్ర ఆవేశంలో ఉన్న హరిహరకృష్ణ కత్తితో నవీన్‌ తలను, కాళ్లు, చేతులు, ప్రైవేట్‌ పార్ట్స్‌ను కోసి ముక్కలు చేశాడు. ఛాతీ భాగాన్ని చీల్చి గుండెను బయటికి తీశాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

మరో స్నేహితుడి ఇంటికి వెళ్లి.. స్నానం చేసి.. 
నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ నేరుగా హాసన్‌ అనే మరో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. కాస్త టెన్షన్‌గా కనిపించడంతో ఏం జరిగిందని హాసన్‌ ప్రశ్నించినా ఏమీ లేదంటూ.. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసిన వచ్చాడు. తర్వాత హత్య గురించి హాసన్‌కు చెప్పాడు. దీనితో భయపడిన హాసన్‌ వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని సూచించగా.. తెల్లారాక వెళ్తానని చెప్పి, అక్కడే నిద్రపోయాడు. మరునాడు మూసారాంబాగ్‌లోని తన సోదరి మమత ఇంటికి వెళ్లాడు. నాలుగైదు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. 

ఏమీ తెలియనట్టు నటిస్తూ.. 
ఈ నెల 16న యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చి నప్పటి నుంచీ నవీన్‌ ఆచూకీ తెలియకపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. హరిహరకృష్ణను కలిసి ఏం జరిగిందని నిలదీశారు. అయితే ఓ యువతి విషయంలో తమ మధ్య గొడవ జరిగినది నిజమేనని, కానీ తర్వాత ఇద్దరం కలుసుకున్నామని హరిహరకృష్ణ చెప్పాడు.

నవీన్‌ నార్కట్‌పల్లికి వెళ్తానంటే విజయవాడ జాతీయ రహదారిపై దింపేసి తాను హైదరాబాద్‌కు వెళ్లిపోయానని వివరించాడు. నవీన్‌ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాకుండా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నప్పుడువారి వెంటే ఉంటూ నమ్మించాడు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు కూడా వచ్చాడని నవీన్‌ స్నేహితులు తెలిపారు. 

అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో.. 
నాలుగైదు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్న హరిహరకృష్ణ తర్వాత విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో తిరిగాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ప్రియురాలికి ఫోన్‌ చేసి పిలిపించుకుని మాట్లాడాడు. నవీన్‌ను హత్య, ఇతర అంశాలను ఆమెకు వివరించగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినట్టు తెలిసింది. మరోవైపు హరిహరకృష్ణను కలవడానికి వెళ్లిన నవీన్‌ ఆచూకీ లేకపోవడం, హరిహరకృష్ణ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ వస్తుండటంతో.. నవీన్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హరిహరకృష్ణ కుటుంబ సభ్యులనూ ప్రశ్నించారు. ఇలా అన్నివైపులా ఒత్తిడి రావడంతో హరిహరకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు అతడిని శనివారం రాత్రి హయత్‌నగర్‌ మెజి స్ట్రేట్‌ ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది. కాగా.. నవీన్‌ హత్యకు హరిహరకృష్ణ ఒక్కడే పాల్పడ్డాడా, మరెవరైనా ఉన్నారా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవీన్‌ హత్యకు గురైన రోజు హరిహరకృష్ణతోపాటు మరో స్నేహితుడైన జీవన్‌ కూడా తన బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు వచ్చినట్టు తెలిసింది. అతను వెళ్లిపోయాక హత్య జరిగిందా? కలిసే హత్య చేశారా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. 

నవీన్‌ కుటుంబ సభ్యుల ఆందోళన 
నిందితుడు హరిహరకృష్ణను కఠినంగా శిక్షించాలంటూ నవీన్‌ కుటుంబ సభ్యులు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాచకొండ జాయింట్‌ సీపీ సత్యనారాయణ అక్కడికి చేరుకుని.. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

దొరకకుండా జాగ్రత్తపడి.. 
నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహంపై డ్రెస్‌ను తొలగించి దూరంగా పడేశాడని.. హత్యచేసి, శరీర భాగాలను కోసిన సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకున్నాడని వివరించారు. అలాగే ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తనకు చెందిన రెండు ఫోన్లలోని డేటా మొత్తాన్ని తొలగించినట్టు సమాచారం. 

విషాదంలో వంకరాయి తండా 
నవీన్‌ హత్య విషయం తెలియడంతో అతడి స్వగ్రామం వంకరాయితండాలో విషాదం అలుముకుంది. నవీన్‌ తండ్రి శంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి వసంత కూలిపనులకు వెళ్తుంది. గ్రామం నుంచి కల్వకుర్తికి వలస వచ్చిన వారిద్దరూ.. కష్టపడి పనిచేస్తూ కుమారుడిని ఇంజనీరింగ్‌ చదివిస్తున్నారు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు దారుణంగా హత్యకు గురికావడంతో కన్నీటిలో మునిగిపోయారు. పోలీసులు శనివారం సాయంత్రం నవీన్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రికి వంకరాయితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. 

20 మీటర్లకు ఓ ముక్క.. యువతికి వాట్సాప్‌లో ఫొటోలు! 
పోలీసులు లొంగిపోయిన హరిహరకృష్ణను ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. మద్యం మత్తులోనే నవీన్‌ను హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నవీన్‌ శరీరాన్ని ముక్కలుగా చేశాక.. 20 మీటర్లకో భాగాన్ని దూరదూరంగా పారేసినట్టు తేల్చారు. ఆ భాగాలను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపించారు. ఇక నవీన్‌ను కిరాతకంగా చంపిన హరిహరకృష్ణ.. అతడి శరీర భాగాలను ఫొటోలు తీసి ప్రేమించిన యువతికి, పలువురు ఇంటర్‌ స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా పంపినట్టు తెలిసింది.  

పథకం ప్రకారమే హత్య 
నవీన్‌ హత్య పథకం ప్రకారమే జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితుడు తన వెంట పదునైన కత్తిని తీసుకుని వచ్చాడంటే అది క్షణికావేశంలో జరిగిన హత్యగా కనిపించడం లేదు. కొంతకాలంగా నవీన్‌పై హరిహరకృష్ణ పెంచుకున్న పగే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తాం. 
– సాయిశ్రీ, డీసీపీ ఎల్బీనగర్‌  

చదవండి: వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్‌..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top