engineering student killed
-
నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసులో ఫోన్ కాల్ రికార్డ్ కలకలం రేపుతోంది. నవీన్‌ను హత్యచేసిన అనంతరం హరిహర తన ఫ్రెండ్‌తో ఫోన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. నవీన్‌ను హత్య చేసి ఏమి తెలియనట్లుగా హరి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తన ప్రేయసి విషయంలో తగాదా వచ్చిందని డ్రగ్స్ తాగుతానని నవీన్ అన్నట్లు.. నవీన్ ఫ్రెండ్‌తో హరిహర సంభాషించాడు. నవీన్‌పై మిస్సింగ్ కేసు పెడతామంటూ నవీన్ ఫ్రెండ్‌కు హరిహర సలహా కూడా ఇచ్చాడు. కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం దారుణ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన యువతికి స్నేహితుడు దగ్గర అవడాన్ని హరిహర జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.. తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
నవీన్ హత్యకు ముందు జరిగింది ఇదే.. పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్?
సాక్షి, హైదరాబాద్: ఎంజీ కాలేజీ విద్యార్థి నవీన్ దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేశారు. అనంతరం, నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో, కోర్టు హరిహరకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక, హయత్‌నగర్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. హత్యకు తర్వాత జరిగింది ఇదే.. హత్య తర్వాత హరిహరరావు వరంగల్‌కు పరారీ అయ్యాడు. హత్య జరిగిన రెండు రోజులు నవీన్ స్నేహితులకు నిందితుడు ఫోన్ చేశాడు. తర్వాత.. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.. నవీన్ మిస్ అయ్యాడంటూ కట్టుకథ అల్లాడు. దీంతో, వారు హరిహరకృష్ణ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే తనకు తానుగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్టేషన్లో హత్యకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలను వెల్లడించాడు. కాగా, విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. కాగా, నవీన్ హత్య కోసం హరహరకృష్ణ మూడు నెలల క్రితమే ప్లాన్ చేశాడు. రెండు నెలల క్రితం కత్తిని కొనుగోలు చేశాడు. హత్యకు ముందు క్రైమ్ వెబ్ సిరీస్, సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. హత్య తర్వత శరీర భాగాలను పాశవికంగా వేరు చేశాడు. మృతదేహంపై దుస్తులను తొలగించినట్టు తెలిపాడు. అయితే, ఈ హత్యపై పోలీసులు ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. -
ఆమె కేవలం ఫ్రెండ్ అంతే!: నవీన్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాను ప్రేమించిన అమ్మాయితో.. చనువుగా ఉండటం భరించలేకే స్నేహితుడిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు హరిహర కృష్ణ. అయితే స్నేహితుడే తన కొడుకుపై ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని నవీన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీతో మృతుడు నవీన్ తండ్రి శంకర్ నాయక్ పోలీసులతో మాట్లాడుతూ.. గెట్ టు గెదర్ పేరుతో నా కొడుకుని పిలిచి హత్య చేశాడు. కాకపోతే.. హరిహర కృష్ణ పద్ధతి నచ్చక ఆ అమ్మాయి దూరం అయిందని అంతా చెప్తున్నారు. మా అబ్బాయి నవీన్ ఆ అమ్మాయితో ప్రేమలో లేడు. వాళ్లిద్దరూ కేవలం స్నేహితులే. నవీన్‌కు ఆ అమ్మాయి దగ్గర అవుతుందేమో అనే అనుమానంతోనే హత్య చేశాడు. ఈ హత్యలో ఆ అమ్మాయి ప్రేమేయం ఉందో, లేదో కూడా మాకు తెలియదు అని చెప్పారాయన. ఏది ఏమైనా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వాడిని కఠినంగా శిక్షించాలి అని కోరుతోంది బాధిత కుటుంబం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో పూర్తి సమాచారం పొందుపరిచారు. నిందితుడు పేరాల హరిహర కృష్ణ, మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌కు చెందినవాడు. నిందితుడు తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించే సమయంలో అతనిచ్చిన స్టేట్మెంట్ ఇలా ఉంది. నవీన్ , నేను దిల్షుక్ నగర్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఆ సమయంలో నేను ఒక స్నేహితురాలిని ప్రేమించా. కొన్ని కారణాల వల్ల ఆమె నాకు దూరం అయ్యింది. కానీ, నవీన్ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమెను ప్రేమించాడు!. ఆ అమ్మాయి కూడా నవీన్‌తో సన్నిహితంగా మెలిగింది. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక.. మూడు నెలల కిందట నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నా. కొద్దీ రోజుల్లోనే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి నవీన్ కోచింగ్ రాబోతున్నట్లు తెలుసుకున్నా. హైదరాబాద్ వస్తే నా లవర్‌కు మరింత దగ్గర అవుతాడేమో అనిపించింది. అందుకే టైం కోసం ఎదురు చూశా. ఫిబ్రవరి 17వ తేదీన.. నేనూ, నవీన్ ఎల్బీ నగర్లో కలుసుకున్నాం. కాసేపు అలా తిరిగాం. ఆ తర్వాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి వెళ్లాం. రాత్రి కాగానే.. తాను హాస్టల్ వెళ్తానని చెప్పాడు. దీంతో బైక్‌పై ఇద్దరం బయల్దేరాం. పెద్ద అంబర్‌పేటకు చేరుకోగానే మా ఇద్దరి మధ్య ఆ యువతి విషయమై గొడవ మొదలైంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కత్తితో దాడి చేశా. నవీన్‌ను చంపేసి ప్రైవేట్ భాగం, గుండె, తన, చేతి వేళ్లు, చేతులు.. అన్నింటిని కత్తితో వేరు చేసి.. అక్కడి నుంచి పరారయ్యాను. విజయవాడ హైవే పక్కన పడేశాను.. ఇది ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్న విషయాలు. ఈ మేరకు విషయాలన్ని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు స్నేహితులు. నిందితుడు హరిహర కృష్ణ పై సెక్షన్ 302, 201 ఐపీసీ , 5(2) (V) , SC ,St, POA act 2015 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇక.. తన మీదకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఘటన తర్వాత నవీన్ స్నేహితులకు కాల్ చేశాడు హరి. నవీన్ మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని డ్రామాలాడాడు. అమ్మాయి పాత్రపై విచారణ చేపట్టాం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై సాక్షీ టీవీ తో ఎల్బీనగర్ డీసీపి సాయి శ్రీ మాట్లాడారు. నల్గొండ ఎంజీ యూనివర్సిటీ కి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణ ను అరెస్ట్ చేశాము. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నాము . హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉంది. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య గా స్పష్టమైంది. నవీన్ ను అతి కిరాతకంగా పొడిచి చంపిన నిందితుడు హరిహరకృష్ణ. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో తేల్చాల్సి ఉంది. నవీన్ , హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులు అని తెలిపారాయన. ఒత్తిడి తట్టుకోలేకే.. నేనావత్ నవీన్‌ది నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్ల గ్రామం. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో ఏడాది చదువుతున్నాడు. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న తండ్రి శంకర్ నాయక్ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నార్కట్‌పల్లి ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు. అయితే.. అదేరోజు సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు హరిహర కృష్ణ. -
స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..
అబ్దుల్లాపూర్‌మెట్/కల్వకుర్తి టౌన్/ చారకొండ/ ఎంజీయూ (నల్లగొండ రూరల్)/ నార్కట్‌పల్లి: అతను స్నేహితుడు.. కానీ తాను ప్రేమించిన యువతికి దగ్గర అవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. మనసులో కక్ష పెంచుకున్నాడు.. ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ ఉంది రమ్మని పిలిచాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు.. తర్వాత గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరుచేసి.. వాటి ఫొటోలను వాట్సాప్ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన ఇది. హతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం, ప్రేమ విషయం హత్యకు దారితీయడం కలకలం రేపింది. ఇంటర్ నుంచీ స్నేహితులు.. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని వంకరాయి తండాకు చెందిన నేనావత్ శంకర్ కుమారుడు నేనావత్ నవీన్ (20), వరంగల్‌కు చెందిన పేరాల ప్రభాకర్ కుమారుడు పేరాల హరిహరకృష్ణ (21) ఇద్దరూ స్నేహితులు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడీఎల్ కాలేజీలో కలిసి ఇంటర్ చదివారు. తర్వాత హరిహరకృష్ణ పీర్జాదిగూడలోని అరోరా కళాశాలలో.. నవీన్ నార్కట్‌పల్లిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బీటెక్‌లో చేరారు. అయినా తమ స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే హరిహరకృష్ణ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. నవీన్ కూడా అదే యువతిని ఇష్టపడ్డాడు. సదరు యువతి కూడా కొంతకాలం నుంచి తనను దూరం పెడుతూ నవీన్‌తో చనువుగా ఉండటాన్ని హరిహరకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. నవీన్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ముందుగానే ప్లాన్ చేసుకుని.. నవీన్‌ను అంతమొందించాలని రెండు నెలల నుంచే ప్లాన్ చేసుకున్న హరిహరకృష్ణ.. ఈ నెల 17న ఇంటర్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ ఉందని, రావాలని నవీన్‌కు ఫోన్ చేశాడు. ఇది నమ్మిన నవీన్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి హరిహరకృష్ణను కలిశాడు. కాసేపు ఇద్దరూ బైక్‌పై కలిసి తిరిగారు. సాయంత్రం మద్యం తీసుకుని బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ప్రేమించిన యువతి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే ప్లాన్ ప్రకారం పదునైన కత్తి తెచ్చుకున్న హరిహరకృష్ణ దానితో దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న నవీన్ దీనిని ప్రతిఘటించలేకపోయాడు. తీవ్ర ఆవేశంలో ఉన్న హరిహరకృష్ణ కత్తితో నవీన్ తలను, కాళ్లు, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌ను కోసి ముక్కలు చేశాడు. ఛాతీ భాగాన్ని చీల్చి గుండెను బయటికి తీశాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో స్నేహితుడి ఇంటికి వెళ్లి.. స్నానం చేసి.. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ నేరుగా హాసన్ అనే మరో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. కాస్త టెన్షన్‌గా కనిపించడంతో ఏం జరిగిందని హాసన్ ప్రశ్నించినా ఏమీ లేదంటూ.. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసిన వచ్చాడు. తర్వాత హత్య గురించి హాసన్‌కు చెప్పాడు. దీనితో భయపడిన హాసన్ వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని సూచించగా.. తెల్లారాక వెళ్తానని చెప్పి, అక్కడే నిద్రపోయాడు. మరునాడు మూసారాంబాగ్‌లోని తన సోదరి మమత ఇంటికి వెళ్లాడు. నాలుగైదు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఏమీ తెలియనట్టు నటిస్తూ.. ఈ నెల 16న యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చి నప్పటి నుంచీ నవీన్ ఆచూకీ తెలియకపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. హరిహరకృష్ణను కలిసి ఏం జరిగిందని నిలదీశారు. అయితే ఓ యువతి విషయంలో తమ మధ్య గొడవ జరిగినది నిజమేనని, కానీ తర్వాత ఇద్దరం కలుసుకున్నామని హరిహరకృష్ణ చెప్పాడు. నవీన్ నార్కట్‌పల్లికి వెళ్తానంటే విజయవాడ జాతీయ రహదారిపై దింపేసి తాను హైదరాబాద్‌కు వెళ్లిపోయానని వివరించాడు. నవీన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం రాకుండా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నప్పుడువారి వెంటే ఉంటూ నమ్మించాడు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు కూడా వచ్చాడని నవీన్ స్నేహితులు తెలిపారు. అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో.. నాలుగైదు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్న హరిహరకృష్ణ తర్వాత విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో తిరిగాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ప్రియురాలికి ఫోన్ చేసి పిలిపించుకుని మాట్లాడాడు. నవీన్‌ను హత్య, ఇతర అంశాలను ఆమెకు వివరించగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినట్టు తెలిసింది. మరోవైపు హరిహరకృష్ణను కలవడానికి వెళ్లిన నవీన్ ఆచూకీ లేకపోవడం, హరిహరకృష్ణ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుండటంతో.. నవీన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహరకృష్ణ కుటుంబ సభ్యులనూ ప్రశ్నించారు. ఇలా అన్నివైపులా ఒత్తిడి రావడంతో హరిహరకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు అతడిని శనివారం రాత్రి హయత్‌నగర్ మెజి స్ట్రేట్ ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది. కాగా.. నవీన్ హత్యకు హరిహరకృష్ణ ఒక్కడే పాల్పడ్డాడా, మరెవరైనా ఉన్నారా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ హత్యకు గురైన రోజు హరిహరకృష్ణతోపాటు మరో స్నేహితుడైన జీవన్ కూడా తన బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ వరకు వచ్చినట్టు తెలిసింది. అతను వెళ్లిపోయాక హత్య జరిగిందా? కలిసే హత్య చేశారా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నవీన్ కుటుంబ సభ్యుల ఆందోళన నిందితుడు హరిహరకృష్ణను కఠినంగా శిక్షించాలంటూ నవీన్ కుటుంబ సభ్యులు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ అక్కడికి చేరుకుని.. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దొరకకుండా జాగ్రత్తపడి.. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహంపై డ్రెస్‌ను తొలగించి దూరంగా పడేశాడని.. హత్యచేసి, శరీర భాగాలను కోసిన సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకున్నాడని వివరించారు. అలాగే ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తనకు చెందిన రెండు ఫోన్లలోని డేటా మొత్తాన్ని తొలగించినట్టు సమాచారం. విషాదంలో వంకరాయి తండా నవీన్ హత్య విషయం తెలియడంతో అతడి స్వగ్రామం వంకరాయితండాలో విషాదం అలుముకుంది. నవీన్ తండ్రి శంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి వసంత కూలిపనులకు వెళ్తుంది. గ్రామం నుంచి కల్వకుర్తికి వలస వచ్చిన వారిద్దరూ.. కష్టపడి పనిచేస్తూ కుమారుడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు దారుణంగా హత్యకు గురికావడంతో కన్నీటిలో మునిగిపోయారు. పోలీసులు శనివారం సాయంత్రం నవీన్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రికి వంకరాయితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. 20 మీటర్లకు ఓ ముక్క.. యువతికి వాట్సాప్‌లో ఫొటోలు! పోలీసులు లొంగిపోయిన హరిహరకృష్ణను ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. మద్యం మత్తులోనే నవీన్‌ను హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నవీన్ శరీరాన్ని ముక్కలుగా చేశాక.. 20 మీటర్లకో భాగాన్ని దూరదూరంగా పారేసినట్టు తేల్చారు. ఆ భాగాలను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇక నవీన్‌ను కిరాతకంగా చంపిన హరిహరకృష్ణ.. అతడి శరీర భాగాలను ఫొటోలు తీసి ప్రేమించిన యువతికి, పలువురు ఇంటర్ స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారమే హత్య నవీన్ హత్య పథకం ప్రకారమే జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితుడు తన వెంట పదునైన కత్తిని తీసుకుని వచ్చాడంటే అది క్షణికావేశంలో జరిగిన హత్యగా కనిపించడం లేదు. కొంతకాలంగా నవీన్‌పై హరిహరకృష్ణ పెంచుకున్న పగే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తాం. – సాయిశ్రీ, డీసీపీ ఎల్బీనగర్ చదవండి: వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్.. -
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : రోడ్డు ప్రమాదంలో మండలంలోని దేశ్ముఖిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. వనస్థలిపురానికి చెందిన వైష్ణవి(20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కాగా కళాశాలలో నిర్వహిస్తున్న విజ్ఞాన్ తరంగ్–2018 సాంస్కృతిక కార్యక్రమాలకు ఈమె ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే బస్సులో హయాత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్ వదకు వచ్చి అక్కడ నుంచి కళాశాలకు వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఇదే కళా శాలలో బీ ఫార్మసీ చదువుతున్న కవాడిపల్లి గ్రామానికి చెందిన లోకేశ్‌గౌడ్(19) బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా, లిఫ్ట్ అడిగి ఎక్కింది. ఈ క్రమంలో కవాడిపల్లి రామాలయం సమీపంలో టిప్పర్‌ను ఓవర్టేక్ చేయబోగ, ఎదురుగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో బైక్ నడుపుతున్న లోకేశ్ అక్కడక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలైన వైష్ణవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కళాశాలలో పెనువిషాదం అలుముకుంది. వెంటనే విజ్ఞాన్ తరంగ్ సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి కళాశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల మృతికి పట్ల కళాశాల యాజ మాన్యం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్‌కు యువతి బలి
-
డ్రంకన్ డ్రైవ్‌కు యువతి బలి
- బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వస్తూ మృత్యువాత పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థిని - మద్యం తాగి కారు నడిపిన స్నేహితుడు హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్, మితిమీరిన వేగం ఓ యువతి ప్రాణాన్ని బలిగొంది. బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఆమె.. కారులో స్నేహితులతో తిరిగి వస్తూ ప్రమాదంలో కన్నుమూసింది. కరీంనగర్‌కు చెందిన రామ్మోహన్ కుమార్తె లక్ష్మిహాస్య(20) నారాయణమ్మ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఆదివారం గీతం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తన స్నేహితుడు విశాల్ పుట్టిన రోజు కావడంతో ఫ్రెండ్స్‌తో కలసి బయల్దేరింది. సంతోషి, రోహిత్, నిధి, విశాల్‌లతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని ఓహ్రీస్ రెస్టారెంట్‌కు వచ్చారు. విశాల్, రోహిత్ మద్యం సేవించగా సంతోషి, లక్ష్మి హాస్య, నిధి భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు విశాల్ కారు (ఫోక్స్‌వ్యాగన్ టీఎస్ 11ఈసీ 2324)లో ఓహ్రీస్ నుంచి రాణిగంజ్ వైపు వెళ్తున్నారు. విశాల్ కారు నడుపుతున్నాడు. జలవిహార్ దాటిన తర్వాత బతుకమ్మ కుంట వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న లక్ష్మిహాస్య ఎగిరి బయట పడింది. ఆమెను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాల్ తండ్రి కరీంనగర్లో పేరున్న న్యాయవాది. 21 ఏళ్లు నిండినవారికే మద్యం సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా రెస్టారెంట్ నిర్వాహకులు పట్టించుకోలేదు. 20 ఏళ్లున్న విశాల్‌కు మద్యం ఇచ్చారు. గతంలో పంజగుట్టలో మైనర్లు మద్యం సేవించి కారు నడపడం వల్లే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. -
బీటెక్ విద్యార్థి దారుణ హత్య
-
బీటెక్ విద్యార్థి దారుణ హత్య
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. శనివారం రాంపురం పంచాయతీ పరిధిలో బీటెక్ విద్యార్థిని కిరాతకంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. గుర్తుపట్టడానికి వీలులేకుండా మృతదేహం కాలిపోయింది. సమీపంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా మృతుడ్ని కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన శివవెంకటేష్గా గుర్తించారు. బీటెక్ ఫైనలియర్ చదివేవాడు. శుక్రవారం అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివవెంకటేష్ హత్యకు గురైనట్టు తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. శివవెంకటేష్ హత్యకు గల కారణాలేంటి, ఎవరు చంపారు వంటి విషయాలు తెలియాల్సివుంది. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.