
బీటెక్ విద్యార్థి దారుణ హత్య
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. శనివారం రాంపురం పంచాయతీ పరిధిలో బీటెక్ విద్యార్థిని కిరాతకంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. గుర్తుపట్టడానికి వీలులేకుండా మృతదేహం కాలిపోయింది. సమీపంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా మృతుడ్ని కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన శివవెంకటేష్గా గుర్తించారు. బీటెక్ ఫైనలియర్ చదివేవాడు. శుక్రవారం అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివవెంకటేష్ హత్యకు గురైనట్టు తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
శివవెంకటేష్ హత్యకు గల కారణాలేంటి, ఎవరు చంపారు వంటి విషయాలు తెలియాల్సివుంది. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.