
డ్రంకన్ డ్రైవ్‌కు యువతి బలి
- బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వస్తూ మృత్యువాత పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థిని
- మద్యం తాగి కారు నడిపిన స్నేహితుడు
హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్, మితిమీరిన వేగం ఓ యువతి ప్రాణాన్ని బలిగొంది. బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఆమె.. కారులో స్నేహితులతో తిరిగి వస్తూ ప్రమాదంలో కన్నుమూసింది. కరీంనగర్‌కు చెందిన రామ్మోహన్ కుమార్తె లక్ష్మిహాస్య(20) నారాయణమ్మ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఆదివారం గీతం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన తన స్నేహితుడు విశాల్ పుట్టిన రోజు కావడంతో ఫ్రెండ్స్‌తో కలసి బయల్దేరింది. సంతోషి, రోహిత్, నిధి, విశాల్‌లతో కలిసి నెక్లెస్‌రోడ్‌లోని ఓహ్రీస్ రెస్టారెంట్‌కు వచ్చారు.
విశాల్, రోహిత్ మద్యం సేవించగా సంతోషి, లక్ష్మి హాస్య, నిధి భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు విశాల్ కారు (ఫోక్స్‌వ్యాగన్ టీఎస్ 11ఈసీ 2324)లో ఓహ్రీస్ నుంచి రాణిగంజ్ వైపు వెళ్తున్నారు. విశాల్ కారు నడుపుతున్నాడు. జలవిహార్ దాటిన తర్వాత బతుకమ్మ కుంట వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న లక్ష్మిహాస్య ఎగిరి బయట పడింది.
ఆమెను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాల్ తండ్రి కరీంనగర్‌లో పేరున్న న్యాయవాది. 21 ఏళ్లు నిండినవారికే మద్యం సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా రెస్టారెంట్ నిర్వాహకులు పట్టించుకోలేదు. 20 ఏళ్లున్న విశాల్‌కు మద్యం ఇచ్చారు. గతంలో పంజగుట్టలో మైనర్లు మద్యం సేవించి కారు నడపడం వల్లే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.