ఎంతోకాలంగా నానుతున్న మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా నియామకమైన అధ్యాపకుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. విచారణ కమిటీల నివేదికలు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని పాలకమండలి సమావేశం నిర్ణయించింది. నిబంధనలను తుంగలోతొక్కి అధ్యాపకులను నియమించారని ‘సాక్షి’ పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. అటు నివేదికలు, ఇటు పత్రికల కథనాలను పరిగణనలోకి తీసుకుని అక్రమాలు వాస్తవమని తేలడంతో అధ్యాపకులకు ఉద్వాసన పలికింది.
ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా నియామకమైన ఆ.. 32 మంది అధ్యాపకులకు ఉద్వాసన పలికారు. ఈ మేరకు వారిని విధులనుంచి తొలగించాలని యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 26మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీసులు ఇచ్చి తొలగించాలని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. అభ్యర్థుల అర్హత పరిశీలించకుండా, రిజర్వేషన్ విధానం పాటించకుండా అధ్యాపకుల నియామకం చేపట్టారు. గత పాలక మండలిలలో ఆయా అధ్యాపకుల ప్రొబేషనరీ కాలాన్ని డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. పెద్దఎత్తున దుమారానికి తెరలేపింది.
దీనిపై కొందరు అభ్యర్థులు సీఎంఓ, గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై విచారణ కమిటీ నియమించడంతోపాటు నిఘా వర్గాలనుంచి సమాచారం సేకరించారు. ఈ అక్రమ నియామకాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. అన్నింటి ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో యూనివర్సిటీ పాలకమండలి వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో ఆ.. 32 మంది అధ్యాపకులకు నోటీసులు ఇవ్వనున్నారు. అయితే ఈ అధ్యాపకుల నియామకాలపై మొదటినుంచీ వివాదాలే ఉన్నాయి.
2011లో నోటిఫికేషన్
ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాతిపదికన 2011లో నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. 2012 ఫిబ్రవరిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 32 మందిని నియమించారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరు వివాదాస్పదమైంది. ఏ ఒక్క నిబంధన పాటించకుండా, యూజీసీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి నియామకాలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కరినుంచి రూ.లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరికి ఈ నియామకానికి సంబంధించి సదరు అధ్యాపకులకు చెల్లించిన వేతనాలను రికవరీ చేయాలని ఆడిట్ బృందం కూడా స్పష్టం చేసింది.
పోస్టుల మంజూరులో మార్పు
జీఓ ఎం.ఎస్ 11 ద్వారా ఒక కోర్సుకు మంజూరైన పోస్టును ఎలాంటి అనుమతీ లేకుండా మరో కోర్సుకు మార్చారు. 2008 వరకు ప్రారంభమైన కోర్సులకు మాత్రమే బోధన సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. కెమిస్ట్రీ కోర్సు 2009లో, 5 ఏళ్ల ఫార్మాస్యూటికల్ కోర్సు 2008లో వచ్చింది. కానీ కెమిస్ట్రీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లను వారికి అనుగుణంగా మార్చుకున్నారు. అదే విధంగా ఎంబీఏ టీటీఎం, జనరల్ ఎంబీఏలకు కూడా అదే తరహాలో రోస్టర్ నిర్వహించారు.
ఇంటర్వ్యూలంతా గందరగోళం
కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌ల నియామకాలకు 2012 ఫిబ్రవరి 4న ఒకేరోజు 289 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ రోజు వచ్చింది 174 మంది వచ్చారు. వచ్చిన వారిని అడిగింది అభ్యర్థి పేరు మాత్రమే. ఎటువంటి వివరాలను అడగకుండానే ఇంటర్వ్యూలు ముగించారు. ఈ విభాగంలో 174 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 164 మంది వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇక్కడ రెండు రికార్డులు మెయింటెన్ చేశారు. ఎంపికైన అభ్యర్థికి ఏపీఐ (అకడమిక్ ఫర్ఫామెన్స్ ఇండికేటర్) స్కోర్ 300 ఉండాలి. కానీ వీరు ఎంపిక చేసిన 32మందిలో ఏ ఒక్క అభ్యర్థికి 30 స్కోర్ మించలేదు. ఇంటర్వ్యూ వీడియో రికార్డు చేస్తామని రూ.85వేల బిల్లు పొందారు. 170 వరకు డీవీడీలు ఉన్నట్లు బిల్లు సృష్టించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆడిట్ బృందానికి ఏవీ చూపించకపోవడంతో అక్రమాలు జరిగాయని తేలిపోయింది. ఏమైందని అడిగితే నియామకాలకు సంబంధించిన ఫైల్ లేదని దాటవేస్తూ వచ్చారు.
వెలుగులోకి ఇలా...
యూనివర్సిటీలో అక్రమ నియామకాలు భారీగా జరిగాయని అప్పటి ఇన్‌చార్జ్ వీసీ శైలజారామయ్య.. ప్రిన్సిపాల్ సెక్రటరీకి లేఖ రాశారు. కీలకమైన నియామకాలకు సంబంధించిన ఫైల్ లేదని, 289 మంది అభ్యర్థులకు ఒకే రోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని, ఇంటర్వ్యూలకు వచ్చినా రానట్లుగా రికార్డులు మెయింట్‌నెన్స్ చేశారని, దీనిపై విచారణకు కమిటీ నియమించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం 2016 అక్టోబర్ 20న ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ సులేమాన్ సిద్ధిక్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్‌లో కూడిన త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణ జరిపి 2017లో నివేదిక ఇచ్చింది. అందులో అక్రమాలు జరిగాయని స్పష్టంగా పేర్కొంది. అదే విధంగా ఇటీవల గవర్నర్ నరసింమన్ యూనివర్సిటీ వీసీలతో సమావేశాలు నిర్వహించి కమిటీ నివేదికపై చర్చించారు. అక్రమాలపై ఫిర్యాదు సీఎంఓలో కూడా ఉండడంతో సర్కార్ సీరియస్‌గా పరిగణించింది.
అప్పటికప్పుడు ఆమోదం...
ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఎంజీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరిగింది. అధ్యాపకుల నియామక అంశం ఎజెం డాలో కూడా లేదు. దీనిపై స్పందించిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన వారిని వెంటనే తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంతోకాలంగా నానుతున్న ఈ అంశాన్ని కాలయాపన చేసేందుకే ఎజెండాలో పెట్టలేదని తెలిసింది. అయితే యూనివర్సిటీకి పాలకమండలి సమావేశమే సుప్రీం. ఇక్కడ చేసిన నిర్ణయాలే అమలులోకి వస్తాయి. యూనివర్సిటీలో ఎలాంటి నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్నా, అభివృద్ధి పనులు, కొత్త కోర్సులు, చివరికి గుండుపిన్ను కొనాలన్నా ఈసీ మీటింగ్ ఆమోదం పొందాల్సిందే. దీంతో అధ్యాపకుల తొలగింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆ..32మంది ఇంటిబాట పట్టాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment