సర్టిఫికెట్లు ఇచ్చేందుకు తీరిక లేదా?
♦ బీఈడీ పాస్‌అవుట్ విద్యార్థులతో ఎంజీ వర్సిటీ చెలగాటం
♦ పరీక్షలు పూర్తయి మూడు నెలలైనా మెమోలు ఇవ్వని వైనం
♦ డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన
ఎంజీ యూనివర్సిటీ/ నల్లగొండ రూరల్: నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తీరు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. మూడు నెలల క్రితం బీఈడీ పరీక్షలు రాసిన విద్యార్థులకు నేటి వరకు మార్కుల మెమోలు రాలేదు. ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని, నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నా యూనివర్సిటీ అధికారులలో చలనం లేదు. యూనివర్సిటీ పరిధిలో 49 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో ఐదువేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నాలుగు వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015 అక్టోబరులో ఫలితాలు ప్రకటించిన యూనివర్సిటీ.. సర్టిఫికెట్ల జారీలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఈ విషయమై విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక కారణాల వల్ల ప్రింట్ చేయలేకపోతున్నామని ఓసారి, సరైన సిబ్బంది లేరని మరోసారి, బడ్జెట్ రాలేదని ఇంకోసారి చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. యూనివర్సిటీ అధికారులు తమకు సర్టిఫికెట్లు ఇచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయి డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే తాము అర్హత కోల్పోతామనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. గతంలో కూడా సకాలంలో మెమోలు జారీ చేయడం లేదని విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాల యం వద్ద ఆందోళనలు కూడా నిర్వహించారు. అధికారులు విద్యార్థుల పాలిట శాపంగా మారారని, సర్టిఫికెట్లు కోసం త్వర లోనే ఆందోళనలు చేపడతామని విద్యార్థిసంఘాలు హెచ్చరిస్తున్నాయి.
45 రోజుల్లో మెమోలు అందించాలి
ఫలితాలు వెల్లడించిన 45 రోజుల్లోగా యూని వర్సిటీ మెమోలు విద్యార్థులకు అందించాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కారణాలేవి చెప్పడం లేదు. ఇతర కోర్సులకు, ఉద్యోగాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మెమోలను గడువులోగా అందించాలి.
- కట్టా వినయ్, వర్సిటీ జేఏసీ చైర్మన్
వారం రోజుల్లోగా సర్టిఫికెట్లు జారీ చేస్తాం
సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికెట్ల జారీ చేయడంలో జాప్యం జరిగింది. వారం రోజుల్లో సర్టిఫికెట్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే బీఈడీ విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రింట్ అవుతున్నాయి. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- అంజిరెడ్డి, పరీక్షలనియంత్రణ అధికారి