సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే దివ్యాంగులు సంక్షేమం అగమ్యగోచరంగా మారింది. పాలకుల చిన్న చూపు కారణంగా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న అరకొర నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. సామాజిక, ఆర్థిక చేయూత కింద కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందుతున్నా నిధులు లేమి కారణంగా ఆయా పథకాలు అమలుకు నోచడం లేదు. దీంతో దరఖాస్తులు మెజార్టీ శాతం పెండింగ్‌లో పడిపోతున్నాయి. దరఖాస్తుల డిమాండ్‌ను బట్టి ఉన్నత స్థాయికి నిధుల ప్రతిపాదనలు వెళ్తున్నా... తిరిగి అరకొరగానే నిధులు మంజూరు అవుతుండటం దివ్యాంగులను విస్మయానికి గురిచేస్తోంది.
ఇదీ పరిస్థితి...
జిల్లా వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖకు నిధుల కేటాయింపు మొక్కుబడిగా మారింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 31.45 లక్షలు మంజూరు కాగా, అందులో రూ. 16.11 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. మరో రూ. 13.83 లక్షల నిధులకు సంబంధించి బిల్లులకు ట్రెజరీలో ఆమోదం లభించలేదు. వాస్తవంగా గత ఆర్థిక సంవత్సరం దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిధులు కొరతను బట్టి సీనియారిటీ, బ్యాంక్ కన్సెంట్ ప్రాతిపదికన ఎనిమిది మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి సబ్సిడీ కింద రూ. 10.28 లక్షలు మంజూరు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆంక్షలు తదితర కారణాలతో ట్రెజరీలో సంబంధిత బిల్లులకు ఆమోదం లభించలేదు. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 480 మంది విద్యార్థులకు రూ. 3.55 లక్షలు మంజూరైనా బిల్లులు ట్రెజరీ నుంచి విడుదల కాలేదు.
ప్రతిపాదనలకు దిక్కేదీ...
వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సామాజిక, ఆర్థిక చేయూత అంతంత మాత్రంగా మారింది. దివ్యాంగుల ఆర్థిక చేయూత దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిధుల ప్రతిపాదనలు వెళ్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. వాస్తవంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో అందిన దరఖాస్తుల్లో 74 పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో సంబంధిత శాఖ విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ గత ఆర్థిక సంవత్సరం చివర్లో పెండింగ్ దరఖాస్తులకు ఆర్థిక చేయూత కోసం రూ. 1.43 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కనీసం 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనైనా నిధుల విడుదల పెరుగుతుందని ఆశించినా ఫలితం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం కింద మొక్కుబడిగా నిధులు కేటాయింపు జరగడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment