పింఛన్.. బాంచన్..
దరఖాస్తు అందజేతకు ఓ వికలాంగుడి యాతన
పల్లెల్లో..పట్టణాల్లో ఏ నోట విన్నా.. ఏ వీధిలోకి వెళ్ళినా..ఏ కార్యాలయాన్ని దర్శించినా..పింఛన్లు..ఆహార భద్రత కార్డుల గురించే వినిపిస్తుంది. అర్హులైన లబ్ధిదారులంతా తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనలతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చి బస్సు దాటిపోతుందని పరేషాన్‌లో దరఖాస్తు ఫారాల కవర్‌ను నోటితో పట్టుకొని రోడ్డుపై వేగంగా పాక్కుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యం అక్కడున్న వారిని కలిచి వేసింది.
పాపన్నపేట మండలం కొంపల్లి గ్రామానికి చెందిన కుర్మసాయిలు పుట్టుకతోనే వికలాంగుడు. కిష్టమ్మ, సంగయ్య దంపతులకు పెద్ద కుమారుడు. ఇంతకి అసలు విషయం ఏమిటంటే దరఖాస్తు చేసుకునేందుకు మండల కార్యాలయానికి వచ్చిన సాయిలు రోజంతా కార్యాలయం ముందు పడిగాపులు కాసి రాత్రి అధికారుల వద్దకు వెళ్తే..దరఖాస్తు చేసుకునేది ఇక్కడ కాదు..మీ ఊరిలోనేనంటూ.. చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో తిండి తిప్పలు లేని సాయిలు ఉన్న బస్సుపోతే రాత్రంతా శివరాత్రేనంటూ బస్సుకోసం ఇలా పరుగులు పెట్టాడు. గతంలో సాయిలుకు ట్రైసైకిల్ ఇచ్చినా..అది చెడిపోయింది. తిరిగి అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా..అతని మొర అరణ్యరోదనే అయ్యింది. - పాపన్నపేట