
గదిలో కూర్చున్న పాలక వర్గ సభ్యులు
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం నెలకొంది. సమావేశానికి తమ భర్తలను అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు చేసిన డిమాండ్‌ను కమిషనర్ అంగీకరించలేదు. దీంతో కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేములవాడలో 5 రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతోంది. దీని సమీక్షలో మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఇది అధికారిక సమావేశం.. కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోవాలి’అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. దీనికి చైర్‌పర్సన్ సహా మిగిలిన కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు.
అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి.. అసంతృప్తితో ఉన్న చైర్‌పర్సన్ సహా కౌన్సిలర్లందరినీ ఆహ్వానించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమాల్లో కేవలం కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావాలి కదా అని బదులిచ్చారు. రెండోసారి కమిషనర్ కౌన్సిలర్లను ఆహ్వానించినప్పుడు మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా హాజరయ్యారు. అనంతరం సమావేశం సజావుగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment