
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో డెంగీ కలకలం రేపుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టామని చెబుతున్నా.. ఆస్పత్రులు మాత్రం ఈ తరహా రోగులతో నిండిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో గడిచిన 20 రోజుల్లో 28 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మరో 35 కేసులు నమోదవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఇప్పటికే ఐదుగురు బాధితులు చనిపోగా, ఆ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు. వీటిలో అత్యధిక కేసులు నందనవనం, దానికి సమీప బస్తీల్లోనే నమోదు కావడం గమనార్హం. సాధారణంగా మురుగు ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు ఎక్కువ డెంగీ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ డెంగీ, మలేరియా దోమలుతమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దోమల నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ ఏటా రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా దోమల సంఖ్య తగ్గకపోగా, మరింత పెరుగుతోంది. ఎప్పటికప్పుడు బస్తీల్లో ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమలు విజృంభించి డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమవుతున్నాయి.
దోమలకు నిలయంగా వ్యర్థాలగోదాములు..
నగనంలోని చాలా ప్రాంతాల్లో నివాసాలకు దూరంగా ఉండాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములు ఇళ్ల మధ్యే ఉంటున్నాయి. కాచిగూడ, కాటేదాన్, సహా నందనవనంలో డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఆయా బస్తీ సమీపంలోని ఇళ్ల మధ్య ప్లాస్టిక్ వ్యర్థాల నిల్వ గోదాములే కారణమని అధికారులు గుర్తించారు. వర్షపు నీరు ఖాళీ బాటిళ్లలోకి చేరడం వల్ల అవి డెంగీ, మలేరియా దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటిని ఊరిచిరవకు తరలించాల్సిందిగా స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోగా, నిర్వహకులకు కొమ్ము కాస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నగరంలో కొత్త నిర్మాణాలు పెరిగాయి. ఫ్రూపింగ్ కోసం ప్రతి రోజూ వాటర్ కొడుతుండండం వల్ల ఆ నిల్వ నీరు దోమలకు ఆవాసంగా మారుతోంది. అంతేకాదు కంటోన్మెంట్, సహా ఉస్మానియా సహా పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రాకపోవడంతో ఆయా పరిసరాల్లో దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు.
వారి బలహీనతే.. వీరికి బలం
మరోపక్క నగరంలో విష జ్వరాల ప్రబలుతున్నాయన్న భయం ప్రజలను వెండుతోంది. దీంతో ఏ చిన్న నలతగా ఉన్నా.. నీరసం అనిపించినా ప్రజలు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. ఇదే అదనుగా పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వారికి కూడా మలేరియా, డెంగీ జ్వరారాల బూచీ చూపుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేసి ప్లేట్‌లెట్స్ కౌంట్స్ పడిపోయాయని భయపెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోగుల బలహీనతను ఆసరా చేసుకుని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అన్ని జ్వరాలు డెంగీ కాదు..
వాస్తవానికి అన్ని జ్వరాలు డెంగీ కాదు. ఈడిస్ ఈజిప్ట్(టైగర్) దోమ కుట్టడం వల్ల మాత్రమే డెంగీ వస్తుంది. నల్లని శరీరంపై తెల్లని చారలు ఉండే ఈ దోమ పగటి పూట మాత్రమే కుడుతుంది. ఇది కుట్టిన 7–8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు బయటపడతాయి. కళ్లమంట, కండరాల నొప్పులు, అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. వాధి తీవ్రమైనప్పుడు చర్మం చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. బ్లీడింగ్ వల్ల బీపీ పడిపోయి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్లేట్‌లెట్ కౌంట్స్ 20 వేల వరకు పడిపోయినా మళ్లీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంతకంటే కౌంట్ పడిపోతే మాత్రం ప్లేట్‌లెట్స్ విధిగా ఎక్కించాలి. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అందుకు భిన్నంగా 60 వేలకు పైగా కౌంట్స్ ఉన్నప్పటికీ రక్తకణాలను ఎక్కించి భారీగా దండుకుంటున్నాయి.
జాగ్రత్తలు అవసరం
ఇటీవల డెంగీ కేసులు బాగా పెరిగాయి. మా ఆస్పత్రి ఓపీకి సగటున 150 మంది పిల్లల్లో ఆరు డెంగీ కేసులు ఉంటున్నాయి. కొత్త నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న శివారు ప్రాంతాల్లోనే ఈ జ్వరాలు అధికంగా ఉన్నాయి. వ్యాధి బారిన పడుకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వ లేకుండా చూడాలి. నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు అస్సలు ఉంచకూడదు. పిల్లలకు విధిగా దోమ తెరలు వాడాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment