ములుగు : ప్రభుత్వ వైద్యులకు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య క్లాస్ తీసుకున్నారు. ములుగు మండల పర్యటనలో భాగంగా ఆదివారం వివిధ కార్యక్రమాల ప్రారంభం అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజులగా విషజ్వరాలతో ఏజెన్సీలో సంభవిస్తున్న మరణాల గురించి సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే.
సమావేశంలో సాక్షి కథనాలపై వైద్యాధికారులను ఆయన వివరణ కోరారు. విషజ్వరాలతో మరణాలు, పీహెచ్‌సీల్లో ఖాళీల విషయమై అడుగగా వైద్యులు ఈ విషయాలు తమకు తెయవని సమాధానమిచ్చారు. గోవిందరావుపేట పీహెచ్‌సీ వైద్యుడు పోరిక రవీందర్ సాక్షి కథనాల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా వైద్యసేవలు నిర్వహించాలని సూచించారు.
ఓ పత్రికలో ప్రచురితమైన విషజ్వరాల వివరాలను చూసి ఈ సమీక్ష సమావేశం నిర్వహించానని అన్నారు. జిల్లాలో డెంగీ మరణాలు లేవని ఆయన పున రుద్ఘాటించారు. రక్తకణాలు తక్కువై చనిపోయినంత మాత్రాన అవి డెంగీ మరణాలు కావని, జిల్లాలో రాయినిగూడెం, పస్రా గ్రామాల్లో మాత్రమే ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం బాధితులు ఆరోగ్యంగానే ఉన్నారని ఆన్నారు.
జిల్లాలో వైద్య శిబిరాల్లో 24, 584 మంది జ్వర పీడితుల నుంచి రక్తపూతలు సేకరించి పరీక్షించగా ఒక్కటి డెంగీ కేసుగా నిర్ధారణ కాలేదన్నారు. డెంగీ ఎలీసా టెస్ట్ ద్వారా మరణాలు సంభవించినట్లు ఎవరి దగ్గరైనా సాక్ష్యాలుంటే వాటిని డెంగీ మరణంగా ప్రకటించి, వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.
ఇందులో ఇప్పటికే గత నెలలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఒక్కో ప్లేట్‌లేట్ మిషన్లను అందిచామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, ఆర్డీఓ సపావట్ మోతీలాల్, సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
వైద్యులకు డిప్యూటీ సీఎం క్లాస్
Published Mon, Nov 3 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement