ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జనరంజకంగా పాలిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో బుధవారం పర్యటించిన ఆయన నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే శాంతిభద్రతల, విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని కొందరు దుష్ర్పచారం చేశారని, కానీ సమైక్య రాష్ట్రంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కలుగుతుందనే ఆలోచనతోనే చిన్న జిల్లాలు, చిన్న మండలాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.