డిజైన్ మారితే విద్యుత్ పిడుగు | design has changed the electrical Thunderbolt | Sakshi
Sakshi News home page

డిజైన్ మారితే విద్యుత్ పిడుగు

Published Sun, Mar 22 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

design has changed the electrical Thunderbolt

ప్రాణహితపై ‘వ్యాప్‌కోస్’ హెచ్చరిక

హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాల్సి వస్తే విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశముందని సర్వే సంస్థ వ్యాప్‌కోస్ అంచనా వేసింది. ఇప్పటికే ఉన్న విద్యుత్ అవసరాలకు తోడు అదనంగా 400 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే అవకాశాలుంటాయని సంస్థ తేల్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతుందని సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. విద్యుత్ అవసరాలు ఎలా ఉన్నా డిజైన్ మార్పుపై ముందుకే వెళ్లాలని, కాళేశ్వరం దిగువ నుంచే నీటిని తీసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న సీఎం ఆ మేరకే ప్రాణహిత పేరును కాళేశ్వరంగా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
 ఇప్పటికే గణనీయం: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడంతో తమ భూభాగంలోని 4,500 ఎకరాల మేర ఆయకట్టు ముంపునకు గురవుతుందని, ఈ దృష్ట్యా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ఇటీవల రాష్ట్రాన్ని కోరింది. కానీ గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని తీసుకునే క్రమంలో బ్యారేజీ ఎత్తును ఒక్క మీటర్ మేర తగ్గించినా బ్యారేజీ సామర్ధ్యం తగ్గుతుందని, అదే జరిగితే నిర్ణీత నీటి మళ్లింపు సాధ్యం కాదని అధికారులు ఓ అంచనాకు వచ్చారు.

అయితే మహారాష్ట్ర విజ్ఞప్తి నేపథ్యంలో డిజైన్ మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం దీని బాధ్యతను వ్యాప్‌కోస్‌కు కట్టబెట్టింది. ప్రాథమిక సర్వే చేసిన ఆ సంస్థ ప్రస్తుతప్రణాళిక ప్రకారం కాకుండా కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుతో పోలిస్తే ఇక్కడ 50 మీటర్ల మేర ఎత్తు తక్కువగా ఉండటంతో విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రాజెక్టుకు 3,159 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ఇదివరకే ప్రభుత్వం అంచనా వేయగా అది మరో సుమారు 400 మెగావాట్ల మేర పెరిగే అవకాశముందని వ్యాప్‌కోస్ తేల్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రం ఈ స్థాయి విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తుందని కేంద్ర జల సంఘంతోపాటు రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement