ఎయిర్‌పోర్టులోని కార్టర్‌ఎక్స్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రయాణికుడే ప్రథమం’(ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్) అనే లక్ష్యంతో వివిధ రకాల సదుపాయాలను ప్రవేశపెట్టిన శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఇంటి నుంచి తిరిగి గమ్యస్థానం చేరేవరకు లగేజీ బరువు లేకుండా హాయిగా ప్రయాణం చేసే లా కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే డోమెస్టిక్ ప్యాసింజర్స్ మాత్రమే కాకుండా విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ లగేజీ పోర్టర్ సేవలను వినియోగించుకోవచ్చు.
ఇందుకోసం ప్రయాణికులు ‘కార్టర్‌ఎక్స్–ఇండియా’ఆన్‌లైన్ సర్వీసులో తమ ప్రయాణ వివరాలు, లగేజీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేయాలనే అంశాలను నమోదు చేసుకోవాలి. దీంతో పోర్టర్‌లు వచ్చి లగేజీ తీసుకెళ్లి.. ప్రయాణికులు కోరుకున్న చోటుకు చేరవేస్తారు. దక్షిణ భారతదేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ‘ఇది పూర్తిగా డిజిటలైజ్డ్ సర్వీసు. ప్రయాణికులకు నమ్మకమైన, పూర్తి భద్రతతో కూడిన సదుపాయాన్ని కార్టర్‌ఎక్స్ ఇండియా అందజేస్తుంది’అని కార్టర్‌ఎక్స్ ఇండియా వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సర్వీసులను ప్రారంభించిన వారంలోనే వందకుపైగా ఆర్డర్లు వచ్చాయని అన్నారు. ఈ సర్వీసులను భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు తెలిపారు.
కార్టర్‌ఎక్స్ సేవలు ఇలా..
ప్రయాణికులు ప్రయాణానికి ముందే ఆన్‌లైన్‌లో (www.carterx.in) లగేజీ వివరాలను నమోదు చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేయాలి.. ఎన్ని కిలోల బరువు అన్నదీ తెలియజేయాలి. ఆర్డర్ బుక్ చేసిన కార్టర్‌ఎక్స్ పోర్టర్లు ఎక్కడి నుంచి బుక్ చేసుకుంటే అక్కడికి వచ్చి లగేజీ తీసుకెళ్తారు. ప్రయాణికులు చెప్పిన గమ్యస్థానానికి చేరవేస్తారు. కార్టర్‌ఎక్స్ మొబైల్ యాప్ ద్వారా కూడా లగేజీ ఆర్డర్లు బుక్ చేయవచ్చు.
బరువు మేర చార్జీలు..: ఈ సేవలు లగేజీ బరువుకు అనుగుణంగా రూ.299 నుంచి రూ.599 వరకు చార్జీలు ఉంటాయి. సాధారణ క్యాబిన్ లగేజీ బ్యాగులకు రూ.299 వరకు చార్జీ ఉంటుంది. అంతర్జాతీయ విమానాల్లో 23 కిలోల నుంచి 32 కిలోల వరకు అనుమతిస్తుండగా, దేశీయ విమానాల్లో మాత్రం 15 కిలోల నుంచి 20 కిలోల వరకే అనుమతిస్తారు. ఈ అదనపు బరువు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి ప్రయాణికులు కార్టర్‌ఎక్స్ ద్వారా తమ లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోర్టులో కార్టర్‌ఎక్స్ ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేశారు.
బిర్యానీ కూడా ఆర్డర్ చేయొచ్చు..
కార్టర్‌ఎక్స్ సేవల్లో భాగంగా ప్రయాణికులు ఆన్‌లైన్‌లో డబ్చులు చెల్లించి నచ్చిన రెస్టారెంట్ లేదా స్వీట్ షాప్ నుంచి బిర్యానీ, స్వీట్లు ఇతర ఆహార పదార్థాలను బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న ఆర్డర్‌ను కార్టర్‌ఎక్స్ పోర్టర్లు తీసుకుని క్యాబిన్ లగేజీలో భాగంగా ప్రయాణికులకు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment