మరియపురం గ్రామపంచాయతీ కార్యాలయం
సాక్షి, గీసుకొండ(పరకాల): జిల్లాలోని గీసుకొండ మండలంలోని మరియపురం ఆదర్శంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అనతికాలంలోనే సర్పంచ్ బాలిరెడ్డి ప్రజల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని ఆదర్శాలకు నెలవుగా మారి గ్రామం మరింత పురోగమనం వైపు సాగుతోంది. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి తరహాలో మరియపురం సందర్శకులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తోంది.
ఈ గ్రామం హరితహారం కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు. పచ్చదనంతో హరితశోభను సంతరించుకుంది. గ్రామాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ఉద్యోగులు, ట్రెయినీ ఐఏఎస్‌లు సందర్శించారు. కలెక్టర్ హరితతో పాటు స్థానిక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. డీపీవో, డీఆర్‌డీవో లాంటి అధికారులు ఎంతో మంది వచ్చిపోతున్నారు.
30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో ముందంజ..
30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల అమలులో గ్రామం ముందుంది. చెత్తా చెదారం తొలగించడం, పాడుబడిన బావులను పూడ్చడం, శిథిలమైన ఇళ్లను తొలగించడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం చేశారు. మురుగు గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలను అరికట్టే చర్యలు చేపట్టారు. విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. సర్పంచ్ బాలిరెడ్డి వార్డు సభ్యులు, గ్రామస్తులు, పొదుపు సంఘాలతో కలిసి చేపడుతున్న పనులతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి.
నేడు గ్రామానికి మంత్రి దయాకర్‌రావు
మరియపురం గ్రామాన్ని గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 30 రోజుల ప్రణాళికలో భాగంగా సందర్శించడానికి వస్తున్నట్లు సర్పంచ్ బాలిరెడ్డి తెలిపారు. ఆయనతో కలెక్టర్ హరిత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అధికారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment