mariyapuram
-
మహిళపై విసిరిన పంచె.. 13 మందికి గాయాలు
సాక్షి, కడప అర్బన్: కడప నగరంలోని మరియాపురంలో ఈ నెల 1న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చెక్కభజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందోత్సాహాలతో ఓ వ్యక్తి చెక్కభజన చేస్తూనే, తన పంచెను గుంపులోకి విసిరేశాడు. ఆ పంచె కాస్త ఓ మహిళపై పడింది. ఈ క్రమంలో పరస్పరం వాగ్వివాదం జరిగింది. బాధిత మహిళ వైపు ఓ మహిళ.. పంచె విసిరేసిన వ్యక్తిని నిలదీసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి, వత్తాసుకు వచ్చావా? అంటూ చెంపచెళ్లుమనిపించాడు. దీంతో గొడవ జరిగింది. ఈ విషయమై శనివారం ఉదయం కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా వున్న వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. కానీ ఎవరిళ్లకు వారు రాగానే.. ఇరువైపులా వారు కత్తులు, గొడ్డళ్లు, కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకవైపు ఏడుగురు, మరోవైపు ఆరుగురు గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. (చదవండి: అయ్యో కొడుకా.. అమ్మ ఉరికి వేలాడుతోంది) ► ఒకవైపు మనోజ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. ఇంకా శ్రీకాంత్, పృధ్వీరాజ్, రమణ, పెంచలయ్య, శ్రీరాముడు, రెడ్డెయ్య గాయపడ్డారు. వీరిలో శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మంది, ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.నాగభూషణం తెలియజేశారు. ► మరోవైపు అగస్టీన్(30) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిలో ఇంకా బాలసౌరి, ఆనంద్, ప్ర శాంత్, ప్రసాద్, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరివైపు బాలసౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మంది, ఇంకా కొంత మందిపై హత్యాయత్నం కేసు నమో దుచేశారు. ఈ సంఘటన జరిగిన ప్ర దేశంలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. -
సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు
సాక్షి, పరకాల: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి వ్యక్తులు ఉన్నా లేకున్నా సరైన సిస్టం (వ్యవస్థ)ఉండాలని అప్పుడే సమస్యలు దూరమవుతాయని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ స్మితా సబర్వాల్ అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కమిటీల ద్వారా నిరంతరం సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం సందర్శించి సర్పంచ్ అల్లం బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు, పలు కమిటీల సభ్యులతో ఆమె గ్రామంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మోరీలు శుభ్రంచేశారా.. లైట్లు వెలుగుతున్నాయా.. ఇంకా ఇతర పనులు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పనులు చేపట్టడానికి కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్ బాలిరెడ్డితో పాటు స్థానికుల కృషితో గ్రామం చాలా నీట్‌గా పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. పండుగ వాతావరణం నెలకొందని, రాత్రి పూట సమావేశం ఏర్పాటు చేస్తే చీకటిలో కూర్చున్నా ఒక్క దోమ కూడా ఎవరినీ కుట్టకపోవడం విశేషం అని అభినందించారు. దీంతో గ్రామం ఎంత శుభ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. సీఎం కేసీఆర్‌ను గ్రామానికి తీసుకుని వస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని, ఎలాగైనా వచ్చేలా చూడాలని సర్పంచ్ బాలిరెడ్డి కోరగా గ్రామం సాధించిన ప్రగతి గురించి సీఎంకు వివరిస్తానని ఆమె తెలిపారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, బడ్జెట్ గురించి సర్పంచ్ బాలిరెడ్డితో పాటు కమిటీల సభ్యులు తిరుమల్‌రెడ్డి దిలీప్‌రెడ్డి, ఆడెపు రాంనాధం, అల్లం చిన్నపురెడ్డి, బిట్ల నాగరాజు, పులిశేరి మంజుల, అద్దాల లలిత, శేషు ఆమెకు తెలిపారు. సర్పంచ్ కృషి, పట్టుదల, అంకితభావంతోనే గ్రామం ప్రగతి వైపు పరుగులు తీస్తోందని గ్రామస్తులు స్మితా సబర్వాల్‌కు వివరించారు. వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ముండ్రాతి హరిత, ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అనితా రాంచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్ఈ రాజేశ్‌చౌహాన్, డీపీఓ నారాయణరావు, ఆర్డీవో మహేందర్‌జీ, డీఎల్పీవో స్వరూప, ఎంపీపీ బీమగాని సౌజన్య, జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ శేషాంజన్‌స్వామి, ఏపీఓ మోహన్‌రావు, ఏపీఎం సురేశ్‌కుమార్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, ఎంపీటీసీ వీరారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పలు కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిరంతరం ఇదేస్పూర్తిని కొనసాగించాలి ధర్మసాగర్: 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమం పనుల ద్వారా గ్రామంలో మార్పు కనిపిస్తుందని నిరంతరం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని స్మితా సబర్వాల్ అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సమస్యలపై సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, ఉపసర్పంచ్ బొడ్డు అరుణ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం స్మితా సబర్వాల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామపంచాయతీ వారు తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలను గ్రామస్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు సహకరిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, జెడ్పీసీఈఓ ప్రసూనరాణి, ఎంపీడీఓ జి.జవహర్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీపీ నిమ్మ కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల శ్రీలత, ఎంపీటీసీ సభ్యులు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అందరి చూపు మరియపురం వైపు..!
సాక్షి, గీసుకొండ(పరకాల): జిల్లాలోని గీసుకొండ మండలంలోని మరియపురం ఆదర్శంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అనతికాలంలోనే సర్పంచ్ బాలిరెడ్డి ప్రజల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని ఆదర్శాలకు నెలవుగా మారి గ్రామం మరింత పురోగమనం వైపు సాగుతోంది. మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి తరహాలో మరియపురం సందర్శకులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తోంది. ఈ గ్రామం హరితహారం కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు. పచ్చదనంతో హరితశోభను సంతరించుకుంది. గ్రామాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల ఉద్యోగులు, ట్రెయినీ ఐఏఎస్‌లు సందర్శించారు. కలెక్టర్ హరితతో పాటు స్థానిక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. డీపీవో, డీఆర్డీవో లాంటి అధికారులు ఎంతో మంది వచ్చిపోతున్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో ముందంజ.. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల అమలులో గ్రామం ముందుంది. చెత్తా చెదారం తొలగించడం, పాడుబడిన బావులను పూడ్చడం, శిథిలమైన ఇళ్లను తొలగించడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం చేశారు. మురుగు గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలను అరికట్టే చర్యలు చేపట్టారు. విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. సర్పంచ్ బాలిరెడ్డి వార్డు సభ్యులు, గ్రామస్తులు, పొదుపు సంఘాలతో కలిసి చేపడుతున్న పనులతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. నేడు గ్రామానికి మంత్రి దయాకర్‌రావు మరియపురం గ్రామాన్ని గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 30 రోజుల ప్రణాళికలో భాగంగా సందర్శించడానికి వస్తున్నట్లు సర్పంచ్ బాలిరెడ్డి తెలిపారు. ఆయనతో కలెక్టర్ హరిత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అధికారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
జాతీయ స్థాయికి ఇన్‌స్పైర్‌కు సాయిబాబా విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్: కడప నగరం అక్కాయపల్లెలోని సాయిబాబా పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికయ్యారు. మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌లో సాయిబాబా పాఠశాలకు చెందిన స్వాతి తయారు చేసిన ఇంటిలిజెంట్ వెహికిల్ నమూనా జాతీయస్థాయికి ఎంపికైయింది. ఈనెల 9వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌లో స్వాతి నమూనా ప్రదర్శించనున్నట్లు సాయిబాబా విద్యాసంస్థల అధినేత రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.