సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు | Progresses Comes With The Right System | Sakshi
Sakshi News home page

సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు

Published Sat, Oct 5 2019 9:40 AM | Last Updated on Sat, Oct 5 2019 9:40 AM

Progresses Comes With The Right System - Sakshi

స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందిస్తున్న సర్పంచ్, ఉపసర్పంచ్‌

సాక్షి, పరకాల: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి వ్యక్తులు ఉన్నా లేకున్నా సరైన సిస్టం (వ్యవస్థ)ఉండాలని అప్పుడే సమస్యలు దూరమవుతాయని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కమిటీల ద్వారా నిరంతరం సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని  మరియపురం సందర్శించి సర్పంచ్‌ అల్లం బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు, పలు కమిటీల సభ్యులతో ఆమె గ్రామంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మోరీలు శుభ్రంచేశారా.. లైట్లు వెలుగుతున్నాయా.. ఇంకా ఇతర పనులు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పనులు చేపట్టడానికి  కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. సర్పంచ్‌ బాలిరెడ్డితో పాటు  స్థానికుల కృషితో  గ్రామం చాలా నీట్‌గా పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు.  పండుగ వాతావరణం నెలకొందని, రాత్రి పూట సమావేశం ఏర్పాటు చేస్తే చీకటిలో కూర్చున్నా ఒక్క దోమ కూడా ఎవరినీ కుట్టకపోవడం విశేషం అని అభినందించారు. దీంతో గ్రామం ఎంత శుభ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

సీఎం కేసీఆర్‌ను గ్రామానికి తీసుకుని వస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని, ఎలాగైనా వచ్చేలా చూడాలని సర్పంచ్‌ బాలిరెడ్డి కోరగా గ్రామం సాధించిన ప్రగతి గురించి సీఎంకు వివరిస్తానని ఆమె తెలిపారు.  గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, బడ్జెట్‌ గురించి  సర్పంచ్‌ బాలిరెడ్డితో పాటు  కమిటీల సభ్యులు తిరుమల్‌రెడ్డి దిలీప్‌రెడ్డి, ఆడెపు రాంనాధం, అల్లం చిన్నపురెడ్డి, బిట్ల నాగరాజు, పులిశేరి మంజుల, అద్దాల లలిత, శేషు ఆమెకు తెలిపారు. సర్పంచ్‌ కృషి, పట్టుదల, అంకితభావంతోనే గ్రామం ప్రగతి వైపు పరుగులు తీస్తోందని గ్రామస్తులు స్మితా సబర్వాల్‌కు వివరించారు. వరంగల్‌ రూరల్, అర్బన్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ముండ్రాతి హరిత, ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అనితా రాంచంద్రన్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాజేశ్‌చౌహాన్, డీపీఓ నారాయణరావు, ఆర్‌డీవో మహేందర్‌జీ, డీఎల్‌పీవో స్వరూప, ఎంపీపీ బీమగాని సౌజన్య, జెడ్పీటీసీ పోలీస్‌ ధర్మారావు, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ శేషాంజన్‌స్వామి, ఏపీఓ మోహన్‌రావు, ఏపీఎం సురేశ్‌కుమార్, జిల్లా ట్రైనింగ్‌ మేనేజర్‌ కూసం రాజమౌళి,  ఎంపీటీసీ వీరారావు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పలు కమిటీల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

నిరంతరం ఇదేస్పూర్తిని కొనసాగించాలి
ధర్మసాగర్‌: 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమం పనుల ద్వారా గ్రామంలో మార్పు కనిపిస్తుందని నిరంతరం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని  స్మితా సబర్వాల్‌ అన్నారు. ధర్మసాగర్‌ మండల కేంద్రంలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఎర్రబెల్లి శరత్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.  గ్రామ సమస్యలపై  సర్పంచ్‌ ఎర్రబెల్లి శరత్, ఉపసర్పంచ్‌ బొడ్డు అరుణ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామపంచాయతీ వారు తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలను గ్రామస్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు సహకరిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ అనితా రామచంద్రన్, రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, జెడ్పీసీఈఓ ప్రసూనరాణి, ఎంపీడీఓ జి.జవహర్‌రెడ్డి, తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మి దేవి, ఎంపీపీ నిమ్మ కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల శ్రీలత, ఎంపీటీసీ సభ్యులు రొండి రాజు, జాలిగపు వనమాల, బొడ్డు శోభ, ఉపసర్పంచ్‌ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement