ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకం
నేడు సాయంత్రం తిరుమలకు వైఎస్ జగన్
రేపు ఉదయం స్వామివారి దర్శనం.. చంద్రబాబు లడ్డూ వ్యాఖ్యలపై పాప ప్రక్షాళన పూజ
జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భారీ భద్రత
జగన్ పర్యటనకు అవాంతరం కలిగించేందుకు ప్రయత్నాలు?
పాప ప్రక్షాళన కార్యక్రమానికి అనుమతులు లేవంటున్న పోలీసులు
పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు
తనిఖీలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు, భక్తులు
వైస్సార్‌సీపీ నేతలకు అర్ధరాత్రి నోటీసులు
తిరుపతి సహా చుట్టు పక్కల జిల్లాల వైస్సార్‌సీపీ నేతల హౌజ్ అరెస్టులు
తిరుపతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌజ్ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నేతలనూ వేధింపులకు గురి చేస్తోంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ఆరోపణలు.. తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన ఈ పాపానికి పరిహారంగా ప్రక్షాళన పూజలు చేయాలని వైఎస్సార్‌సీపీకి కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంతోనే ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే..
జగన్ ఇవాళ సాయంత్రమే తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం తాడేపల్లికి తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటన కావడం.. పైగా ఈ పర్యటనను ప్రత్యర్థి పార్టీలు రాద్ధాంతం చేసే అవకాశం ఉండడంతో ఎటువంటి హడావిడి చేయొద్దని, ప్రత్యర్థులు కవ్వింపులకు పాల్పడ్డా సంయమనం పాటించాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే ఆయన సూచించారు. అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అతి చేష్టలకు దిగింది.
ఇదీ చదవండి: వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి తిరుమలలో పోలీసు మోహరింపు కనిపిస్తోంది. సుమారు వెయ్యి మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. ఉన్నపళంగా పోలీస్ యాక్ట్ 30ను తెరపైకి తెచ్చారు. ఈ వంకతో గత రాత్రి నుంచి వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని పోలీసులు అంటున్నారు. అక్టోబర్ 24వ తేదీ దాకా.. సభలు, సమావేశాలు, ర్యాలీలకు, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయాని హెచ్చరికలు జారీ చేశారు. అయితే జగన్ తిరుమల దర్శన కార్యక్రమానికి అనుమతుల్లేవంటూ పోలీసులు ఆ నోటీసుల్లో ప్రస్తావించడం గమనార్హం!.
ఇక వైఎస్ జగన్ ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ఆహ్వానం పలికేందుకు వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అదే టైంలో అదే సోషల్ మీడియాలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తాము సెక్షన్ 30 అమలు చేస్తున్నామంటున్నారు. దీంతో..
ఎయిర్‌పోర్ట్ నుంచే జగన్ పర్యటనకు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వెంట నేతలెవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవచ్చని సమాచారం. మరోవైపు.. చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలి రావొచ్చనే సమాచారంతోనే తాము తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఈ హడావిడితో సాధారణ ప్రజలు, భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులతో పాటు భయాందోళనకు గురవుతున్నారు.
ఆధ్యాత్మిక సందర్శనకు రాజకీయ రంగు పులుముతున్నారని.. గతంలో ఎన్నడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన ఘటనలు లేవని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు.
నేతల గృహనిర్భంధాలు
జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో.. చుట్టుపక్కల జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్భందం చేస్తున్నారు. మరోవైపు.. తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్భంధం కొనసాగుతోంది. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని వేకువ ఝామునే చుట్టుముట్టిన పోలీసులు.. జగన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆకేపాటి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment