ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి శివైక్యం
వరంగల్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి (87) ఇకలేరు. వరంగల్ జిల్లా ములుగురోడ్డులోని గురుధామ్ ఆశ్రమంలో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. వడదెబ్బకు గురైన ఆయన గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సద్గురు శివానందమూర్తి 1928 డిసెంబర్ 21న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. ఆయన శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రామ్యూజిక్ అకాడమీ స్థాపించారు. శివానందమూర్తి ఆశ్రమం విశాఖ జిల్లా భీమిలీలో ఉంది. ఆయన కొన్నిరోజుల క్రితం వరంగల్ జిల్లాకు వచ్చారు. ఆ తర్వాతే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. శివానందమూర్తి ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆయన కుమారుడికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా రెండు రోజుల క్రితం ఫోన్ చేసి కనుక్కున్నారు.
సద్గురు మృతి పట్ల విశాఖ శారదా పీఠం సంతాపం తెలిపింది. శివానందమూర్తి శివైక్యం పొందారని స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవలకు ఆయన చేసిన సేవలు ప్రస్తుత తరాలకు మార్గదర్శకమని స్వరూపానందేంద్ర అన్నారు. శివానందమూర్తి సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో ఆయన శిష్యగణం కొనసాగాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. శివానందమూర్తి కుటుంబసభ్యులకు, భక్త కోటికి మోహన్ భాగవత్, భయ్యాజీ జోషి, వి.భాగయ్య, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.