స్వామీజీ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం గురుధామం తీసుకెళ్తున్న భక్తులు
- శోకసముద్రంలో మునిగిపోయిన భక్తులు
- వరంగల్ గురుధామంలో స్వామీజీ మహా సమాధి
సాక్షి, హన్మకొండ: మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, తన బోధనలతో లక్షలాది శిష్యకోటికి భారతీయ దర్శనం కలిగించిన సద్గురు కందుకూరి శ్రీశివానందమూర్తి బుధవారం తెల్లవారుజామున (మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.55 గంటలకు) వరంగల్‌లోని గురుధామం ఆశ్రమంలో శివైక్యమయ్యారు. ఆయన పార్ధివదేహాన్ని బుధవారం ఉదయం 9గంటల నుంచి సందర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు.
అనంతరం మూర్తి పార్థివదేహాన్ని పుష్పక విమానంలో ఊరేగింపుగా సప్తధామంలోకి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం 4:30 గంటల వరకు భక్తులు సందర్శించుకున్నారు. ఆ తర్వాత గురుధామంలో నిర్మించిన గురుమందిరంలోకి తీసుకువెళ్లి సాయంత్రం 6:30 గంటల వరకు శాస్త్రోక్తంగా రుద్రపారాయణం, లింగైక్య పద్ధతిలో సమాధి పూజా కార్యక్రమాలు కొనసాగించారు. మహా సమాధిలో నవధాన్యాలు, పవిత్ర జలాలు, బిల్వ పత్రాలు గంధం, అన్నిరకాల పుష్పాలను వేశారు. శ్రీశైవ పీఠాధిపతి, ఉప పీఠాధిపతి మృత్యుంజయశర్మ బృందం ఆధ్వర్యంలో యాగాలు, హోమాలు నిర్వహించారు.
తపోభూమి వరంగల్..
ఉద్యోగరీత్యా1964లో వరంగల్ డీఐజీ కార్యాలయానికి శ్రీ శివానందమూర్తి బదిలీ అయ్యారు. అప్పటినుంచి వరంగల్ అంటే ఎనలేని ప్రేమ చూపించేవారు. ఆ తర్వాత 1984లో భీమిలిలో ఆనందవనం ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1988లో వరంగల్‌లో గురుధామం నిర్మించారు. తనకు ఇష్టమైన గురుధామంలోనే సమాధి పొందాలని శ్రీశివానందమూర్తి చివరి కోరిక. ఆ మేరకు 16నెలల ముందే ఆయన తన సమాధిని ఏర్పాటు చేసుకున్నారు. 2015 మే 17న విశాఖపట్నం సమీపంలోని భీమిలి ఆశ్రమంలో ఆస్వస్థతకు గురయ్యారు. అదేరోజు రాత్రి అక్కడినుంచి బయల్దేరి మే 18న గురుధామం చేరుకున్నారు. అప్పటి నుంచి 24 రోజులపాటు సమాధిస్థితిలో ఉంటూ జూన్ 10 తెల్లవారు జామున 1:55 గంటలకు శివైక్యం చెందారు.
ఆధ్యాత్మిక శిఖరం
శ్రీశివానందమూర్తి 1928 డిసెంబర్ 21న రాజమండ్రిలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు గొప్ప శివభక్తులు. వీరిది జమీందారీ కుటుంబం. యోగశాస్త్రం పట్ల శివానందమూర్తికి బాల్యం నుంచే ఎనలేని ఆసక్తి ఉండేది. విజయనగరంలోని మహారాజ కళాశాలలో 1947 నుంచి 49 వరకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. పోలీసుశాఖలో పనిచేసిన శివానందమూర్తి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఆధ్యాత్మికరంగంలో సేవచేశారు. ప్రజలను మేలుకొల్పే దిశగా పత్రికల్లో 500పైగా వ్యాసాలు రాశారు.
భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2005లో డాక్టరేట్‌తో సత్కరించింది. 2009లో గంగిరెడ్డి స్మారక అంతర్జాతీయ ఆధ్యాత్మిక పురస్కారం అందుకున్నారు. 2010లో గీతం యూనివర్సిటీ వారు గౌరవడాక్టరేట్‌తోనూ, తిరుపతిలోని రాష్ట్రీయ విద్యాపీఠ్ వారు మహోపాధ్యాయ బిరుదుతోనూ, 2011లో కంచికామకోటి పీఠం వారు దేశికోత్తమ బిరుదుతో సత్కరించారు.
శోక సముద్రంలో భక్తులు
శ్రీశివానందమూర్తి శివైక్యం విషయం తెలియగానే ఆయన భక్తులు శోకసముద్రంలో ముగినిపోయారు. సమాధి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఆయన శిష్యులు వచ్చారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.
మోదీతో మాటామంతీ
అనారోగ్యంతో ఉన్న శ్రీశివానందమూర్తితో మే 30న ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘స్వామీజీ మీ ఆరోగ్యం ఎలా ఉంది?’ అని మోదీ పలకరించారు. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. జూలైలో తాను స్వయంగా వచ్చి దర్శించుకుంటానని మోదీ స్వామీజీకి తెలిపారు. మీ పరిపాలన బాగుందని స్వామి ప్రధానిని అభినందించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైవ పీఠాధీశ్వరులు శ్రీ సద్గురు కందుకూరి శివానందమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.