ఉమ్మితో మధుమేహ పరీక్ష | Diabetis Test with Spit | Sakshi
Sakshi News home page

ఉమ్మితో మధుమేహ పరీక్ష

Mar 4 2018 1:20 AM | Updated on Nov 9 2018 6:23 PM

Diabetis Test with Spit - Sakshi

మనోహరాబాద్‌(తూప్రాన్‌) : టీఆర్‌ఎస్‌ పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలో కొత్తగా నిర్మించిన డయాబెటోమిక్స్‌ పరిశ్రమను శనివారం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఐసీసీ డైరెక్టర్‌ వెంకటనర్సింహారెడ్డి, పారిశ్రామికవేత్త వరప్రసాద్‌రెడ్డి తదితరులతో కలసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలో డయాబెటిక్‌ పరీక్ష పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల ఖర్చులకు భయపడి గ్రామీణులు ఆస్పత్రులకు వెళ్లడం లేదన్నారు.

అలాంటి వారి కోసమే వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు రమేశ్, శ్రీనివాస్‌ బృందం ఏళ్లపాటు శ్రమించి ఆధునిక పరిజ్ఞానంతో డయాబెటిక్‌ పరికరాన్ని రూపొందించిందని, ఈ పరికరం ద్వారా ఇంటి వద్దనే ఒక డాలర్‌ ఖర్చుతో.. షుగర్‌ పరీక్ష చేసుకోవచ్చని అన్నారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఈ పరికరం ఓ వరమన్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి పరికరం లేదని, ఇందుకు డాక్టర్లు అభినందనీయులని కేటీఆర్‌ కొనియాడారు.

శాంతబయోటెక్‌ సంస్థవ్యవస్థాపకుడు, డయాబెటోమిక్స్‌ సంస్థ చైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 సంవత్సరాల కృషి ఫలితమే ఈ డయాబెటోమిక్స్‌ పరిశ్రమ అని చెప్పారు. తాము రూపొందించిన పరికరంతో రక్త సేకరణ లేకుండా.. ఇంటి వద్దే ఉమ్మితోనే మధుమేహ పరీక్ష చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, టెక్నికల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ బిందుదేవి, డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌ రామకృష్ణ, డాక్టర్‌ శ్రీనివాస్‌ నాగేళ్ల, పీవీఆర్, గాంధీ ఆస్పత్రి గైనకాలజిస్ట్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement