అతి ‘కీటో’ అనర్థమే..! | This diet is beneficial for those who want fast weight loss | Sakshi
Sakshi News home page

అతి ‘కీటో’ అనర్థమే..!

Published Sun, Sep 23 2018 4:11 AM | Last Updated on Sun, Sep 23 2018 11:45 AM

This diet is beneficial for those who want fast weight loss - Sakshi

ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుళ్లు... బోలెడన్ని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వు... పిడికెడు మాంసం.. కొన్ని పాలు... దీర్ఘాయుష్షు, ఆరోగ్యకర జీవనానికి మేలైన మార్గాలివే! ప్రపంచం మొత్తమ్మీద లక్షల మంది ఆహారపు అలవాట్లను విశ్లేషించి పరిశోధకులు చెబుతున్న విషయమిది! మరి బరువు తగ్గేందుకు, మధుమేహాన్ని దూరం పెట్టేందుకు చాలా మంది అనుసరిస్తున్న కీటోడైట్‌ మాటేమిటి? 

‘‘అతి సర్వత్ర వర్జయేత్‌’’అని ఓ సామెత ఉంది. ఏ విషయంలోనైనా అవసరానికి మించి వ్యవహరించడం సరికాదన్నది దీని అర్థం. ఆహారం కూడా దీనికి మినహాయింపు కాదంటున్నారు సారా సైడల్‌మ్యాన్‌. బ్రిగమ్‌ అండ్‌ బోస్టన్‌ విమన్స్‌ హాస్పిటల్‌ (అమెరికా)లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె ఇటీవల ఓ భారీ అధ్యయనాన్ని పూర్తి చేశారు. ప్రపంచం నలుమూలల్లోని దాదాపు 4.5 లక్షల మంది ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య వివరాలను విశ్లేషించి సారా చెప్పేదేమిటంటే ‘‘మన ఆరోగ్యానికి రోజూ తీసుకునే ఆహారం కంటే ముఖ్యమైనది ఇంకోటి లేనే లేదు’’అని! అంతేకాదు పిండి పదార్థాలను దాదాపుగా మానేసి కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న కీటోడైట్‌తో స్వల్పకాలంలో ప్రయోజనం చేకూరవచ్చునేమోగానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది మనల్ని తొందరగా కాటికి పంపేస్తుందని అంటారు ఆమె. ప్రపంచంలో ఏ చోట ఉన్న వారికైనా ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు.   
 – సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌

ఇదీ తర్కం... 
కీటోడైట్‌లో పిండి పదార్థాలు చాలా తక్కువగా.. వీలైతే అస్సలు తీసుకోరాదన్నది ప్రాథమిక నియమం. శరీరానికి కావాల్సిన శక్తి మొత్తం కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లతోనే అందేలా చేయాల్సి ఉంటుంది. వంద శాతం కార్బోహైడ్రేట్‌ అయిన చక్కెరకూ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా కీటోడైట్‌ పాటించే వారు వీలైనంత వరకూ మరపట్టిన అంటే ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారన్నదీ మనకు తెలుసు. చక్కెర తగ్గించడం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తీసుకోకపోవడం అనే రెండు అలవాట్లూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో వివాదం ఏమీ లేదు. కాకపోతే కీటోడైట్‌ పేరుతో మనకు మేలు చేసే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కూడా దూరంగా పెట్టడంతోనే వస్తుంది చిక్కంతా! పైగా కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. తాజా చిక్కుళ్లు, అరటిపండ్లు, ఓట్స్‌ వంటి వాటిల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. 

కీటోడైట్‌ పేరెలా వచ్చిందంటే... 
కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వు నుంచి శక్తి పొందే జీవ క్రియను కీటోసిస్‌ అంటారు. తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు లేకుండా కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి అవసరమైన శక్తిని పొందుతుంది. ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోన్స్‌ అనే రసాయనాలు వెలువడతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్స్‌ వెలువడటం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్నే ఈ డైట్‌లో ప్రధానంగా పాటించాల్సి ఉండటంతో దీనికి కీటోడైట్‌ అనే పేరు వచ్చింది. 

మరో రెండు అధ్యయనాలు ఏం చెప్పాయంటే... 
సారా సైడల్‌మ్యాన్‌ కీటోడైట్‌ దీర్ఘకాలిక దుష్ప్రభావాల గురించి ఇటీవల యూరప్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఇదే సదస్సులో మరో రెండు అధ్యయనాలు కూడా కీటోడైట్‌ ప్రభావశీలతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. పిండి పదార్థాలను పూర్తిగా పరిహరించడం కాకుండా మోస్తరుగా వాటిని ఆహారంగా తీసుకోవడం మేలని ఇవి చెబుతున్నాయి. దీర్ఘకాలపు కీటోడైట్‌తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత సమస్యలు, కేన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తమ అధ్యయనాల ద్వారా తెలిసిందని పోలండ్‌లోని మెడికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాసెచ్‌ బనాచ్‌ అంటున్నారు. యూరప్‌లోని దాదాపు 5 లక్షల మందిపై జరిగిన మరో అధ్యయనం ప్రకారం కూడా తినే తిండిలో పోషకాలు తక్కువగా ఉంటే కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. పిండి పదార్థాలను తక్కువ తీసుకొని వెన్న, మాంసాలను ఎక్కువ తీసుకుంటే రక్తపోటు, కేన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. పాల ఉత్పత్తులు, మాంసం శరీరంలో మంట/వాపులకు కారణమని, ఇది దీర్ఘకాలంలో కేన్సర్‌ కణతులు ఏర్పడేందుకు/పెరిగేందుకూ దారితీస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 

కీటోడైట్‌ అస్సలు పనికిరాదా...? 
కొన్ని అంశాల్లో కీటోడైట్‌ అద్భుతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొవ్వు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడే అంశమే. రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించుకోవాలనుకునే వారు కూడా దీన్ని వాడవచ్చు. అంతేకాదు అదుపు చేసేందుకు కూడా సాధ్యం కాని మూర్ఛ లక్షణాలున్న పిల్లలకూ కీటోడైట్‌తో ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. నిపుణుల మార్గదర్శకత్వంలో పాటించే కీటోడైట్‌తో ఈ రకమైన ఫలితాలు సాధించడం సాధ్యమే. అదే సమయంలో ఇది అందరికీ సమానంగా వర్తించే విషయం కాదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కొందరికి మధుమేహం వచ్చే అవకాశముందని కొన్ని పరిశోధనలు సూచిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. 

పీచు పదార్థాలతోనే దీర్ఘాయువు... 
కీటోడైట్‌ కానీ మరో కొత్త ఆహారపు అలవాటుగానీ చక్కటి ఆరోగ్యానికి దగ్గరి దారి ఏదీ లేదు. కడుపు మాడ్చుకున్న పరిస్థితుల్లో మినహా సాధారణ పరిస్థితుల్లో కొవ్వులుతోనే శక్తిని పొందడం మన శరీరానికి అలవాటు లేని పని. కీటోడైట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చిన వారూ చెప్పేది ఇదే. మీ ఆరోగ్య సమస్యకు అనుగుణంగా ఈ ఆహార అలవాటును కొన్ని నెలలే పాటించండి అని! కీటోడైట్‌ను పాటించకపోయినా పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్, మాంసాలను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే కాయగూరలు, ధాన్యాలు, నట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా సరే చిక్కుళ్లను తరచుగా తీసుకోవడం మేలని సారా సైడల్‌మ్యాన్‌ వంటి వారు సూచిస్తున్నారు. ఈ రకమైన ఆహారం తీసుకునే వారు మిగిలిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని తమ అధ్యయనంలో తేలిందని సారా చెబుతున్నారు. తెల్లగా తళతళలాడే బియ్యం బదులు ముతక బియ్యం వాడటం, పండ్లు, కాయగూరలను పానీయాల రూపంలో కాకుండా వీలైనంత వరకూ తాజాగా తినడం వల్ల వాటిల్లోని పీచు శరీరానికి చేరుతుందని సారా వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement