డిజిటల్ తెలంగాణే లక్ష్యం: కేటీఆర్ | Digital Telangana Our target, says Ktr | Sakshi
Sakshi News home page

డిజిటల్ తెలంగాణే లక్ష్యం: కేటీఆర్

Published Fri, Oct 7 2016 4:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

డిజిటల్ తెలంగాణే లక్ష్యం: కేటీఆర్

డిజిటల్ తెలంగాణే లక్ష్యం: కేటీఆర్

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందిస్తాం: కేటీఆర్
డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నాం
ఫైబర్ గ్రిడ్‌తో సత్వర సేవలు
సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తాం
ఇండియా ఎకనమిక్ సమిట్‌లో  మంత్రి కేటీఆర్ ప్రసంగం

 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇంటింటికీ మంచి నీటిలాగా.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సీఐఐ ఆధ్వర్యంలో రెండు రోజుల ఇండియా ఎకనమిక్ సమిట్ గురువారం ప్రారంభమైంది. దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రసంగించారు.
 
 గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన డిజిటల్ లిటరసీ అంశంలో తెలంగాణ రాష్ట్రం సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా ఉండబోతోందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని... కనీసం ప్రతి ఇంటిలో ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలను, ఐటీ పరిజ్ఞాన ఫలాలను అందిస్తామన్నారు.
 
 ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తయితే ప్రభుత్వ సేవలు ప్రజలకు సత్వరం అందుతాయని చెప్పారు. సేవల వేగం పెరుగుతుందని, పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. డిజిటల్ పరిజ్ఞానాన్ని కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నామని.. అందుకే తాగునీటితోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే బృహత్తర కార్యక్రమమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. ఈ-గవ ర్నెన్స్‌ను దాటి ఎం(మొబైల్)-గవర్నెన్స్ దిశగా ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నామన్నారు. తాము ఇటీవల ప్రారంభించిన ఎం-వ్యాలెట్‌ను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఈ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు.
 
 ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పెంపు
 ‘దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, పెట్టుబడులు’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రాలు ముందుకు వెళ్తాయని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ప్రజల జీవన విధానంలో నాణ్యమైన, వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అయితే ప్రభుత్వాల దగ్గర మూలధనం కొరత ఉన్న నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు పారిశ్రామిక అనుకూల విధానాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఉన్న 1,800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను కేంద్ర సహకారంతో త్వరలోనే రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు.
 
 విద్యుత్ రంగంలో ప్రస్తుతమున్న 9 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచే కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్ ఫండ్స్ తెలంగాణ వంటి రాష్ట్రాలు చేపట్టే ప్రయత్నాలకు పెట్టుబడితో సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెక్టోరల్ పాలసీలు, వివాదాల పరిష్కార యంత్రాంగం, ఎగ్జిట్ పాలసీ వంటి అంశాలను కూడా తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై కేటీఆర్ చేసిన ప్రసంగాలను పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement