Taj palace hotel
-
ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్ నేత డానిష్ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియోపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో టేబుల్ పంచుకున్న రాహుల్..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు. మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష మోదీ,బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు. -
13న రాహుల్ ఇఫ్తార్
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఇఫ్తార్ విందు ఉంటుందని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆతిథ్యమిస్తారని ఆ పార్టీ మైనారిటీ విభాగం నేత నదీమ్ జావెద్ చెప్పారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక ఆయన ఇస్తున్న తొలి ఇఫ్తార్ విందు ఇదే. కాంగ్రెస్ చివరిగా 2015లో ఇఫ్తార్ విందు ఇచ్చింది. 2016, 2017ల్లో ఆ కార్యక్రమ నిర్వహణకు దూరంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్ మళ్లీ ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కార్యక్రమానికి పలు పార్టీల్లోని అన్ని మతాలకు చెందిన నేతలు, పలువురు రాయబారులు హాజరవుతారు. -
డిజిటల్ తెలంగాణే లక్ష్యం: కేటీఆర్
♦ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందిస్తాం: కేటీఆర్ ♦ డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నాం ♦ ఫైబర్ గ్రిడ్‌తో సత్వర సేవలు ♦ సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తాం ♦ ఇండియా ఎకనమిక్ సమిట్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇంటింటికీ మంచి నీటిలాగా.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సీఐఐ ఆధ్వర్యంలో రెండు రోజుల ఇండియా ఎకనమిక్ సమిట్ గురువారం ప్రారంభమైంది. దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రసంగించారు. గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన డిజిటల్ లిటరసీ అంశంలో తెలంగాణ రాష్ట్రం సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా ఉండబోతోందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని... కనీసం ప్రతి ఇంటిలో ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలను, ఐటీ పరిజ్ఞాన ఫలాలను అందిస్తామన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తయితే ప్రభుత్వ సేవలు ప్రజలకు సత్వరం అందుతాయని చెప్పారు. సేవల వేగం పెరుగుతుందని, పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. డిజిటల్ పరిజ్ఞానాన్ని కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నామని.. అందుకే తాగునీటితోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే బృహత్తర కార్యక్రమమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. ఈ-గవ ర్నెన్స్ను దాటి ఎం(మొబైల్)-గవర్నెన్స్ దిశగా ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నామన్నారు. తాము ఇటీవల ప్రారంభించిన ఎం-వ్యాలెట్‌ను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఈ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పెంపు ‘దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, పెట్టుబడులు’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రాలు ముందుకు వెళ్తాయని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ప్రజల జీవన విధానంలో నాణ్యమైన, వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అయితే ప్రభుత్వాల దగ్గర మూలధనం కొరత ఉన్న నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు పారిశ్రామిక అనుకూల విధానాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఉన్న 1,800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను కేంద్ర సహకారంతో త్వరలోనే రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతమున్న 9 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచే కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్ ఫండ్స్ తెలంగాణ వంటి రాష్ట్రాలు చేపట్టే ప్రయత్నాలకు పెట్టుబడితో సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెక్టోరల్ పాలసీలు, వివాదాల పరిష్కార యంత్రాంగం, ఎగ్జిట్ పాలసీ వంటి అంశాలను కూడా తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై కేటీఆర్ చేసిన ప్రసంగాలను పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు.