‘కేసు పెట్టినందుకు ధన్యవాదాలు’
సాక్షి, న్యూఢిల్లీ: తనపై నమోదైన కేసును ఎదుర్కొంటానని, కేసు నమోదు చేసినందుకు ధన్యవాదాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ఏడాది కాలంగా ముస్లిం యువతను ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం యువతపై పోలీసులు వల పన్నితే మజ్లిస్ పార్టీ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
ఈ విషయంలో అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని విమర్శించారు. ముస్లింల సంక్షేమంపై వారికి శ్రద్ధ లేదని, కేవలం వారి వ్యాపారాలు, బ్యాంకులు, విద్యాసంస్థల నిర్వహణపైనే శ్రద్ధ ఉందని ఆరోపించారు. కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్ పెంపు పేరుతో చేస్తున్న ప్రయత్నం కేవలం బీజేపీకి మేలు చేయడానికేనని, హిందూ, ముస్లింల ఓట్లను విభజించడానికేనని వ్యాఖ్యానించారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు.