చెట్టు కింద పెళ్లి..!
- నేడు పోలీసు ఆంక్షల మధ్య ఒకటవనున్న జంట
- ఇంటి స్థలం విషయంలో వివాదం
సాక్షి, పెద్దపల్లి: ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తన కూతురి వివాహాన్ని చెట్టు కింద చేయాల్సిన పరిస్థితిని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్‌వాసి వడ్లకొండ రామలక్ష్మయ్య ఎదుర్కొంటున్నాడు. రామలక్ష్మ య్య గీత కార్మికుడు. సొంతిల్లు కూడా లేదు. భార్య రాజేశ్వరి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది. ఇద్దరు కూతుళ్లు సుమలత, సుస్మిత. పెద్ద కూతు రు కుట్టుమిషన్‌పై పని చేస్తూ కుటుంబానికి చేదో డువాదోడుగా ఉంటోంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. తండ్రి ఇబ్బంది పడతాడని భావించిన సుమలత.. ఇంటర్ చదువుతున్న సుస్మిత పెళ్లి ముందుగా చేసేందుకు తండ్రిని ఒప్పించింది. దీంతో కరీంనగర్ జిల్లా చింతకుంట వాసి శ్రావణ్ తో సుస్మిత వివాహం నిశ్చయమైంది.
4 గుంటల స్థలంలో గుడిసె వేసుకొని 17 ఏళ్లుగా అక్కడే ఉం టున్నాడు. కూతురి పెళ్లి కావడంతో ఆ స్థానంలో రేకుల షెడ్డు వేసుకుందామనుకుని గుంతలు తీయడం ప్రారంభించాడు. గ్రామానికి చెందిన కొందరు వచ్చి.. రామలక్ష్మయ్య స్థలం అసైన్డ్ భూమి అని.. ఈ స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కడుతున్నామని అడ్డుకున్నారు. దీంతో ఇటుకలను అడ్డుగోడగా మార్చుకొని.. అక్కడే ఉంటున్నారు. సుస్మిత నిశ్చితార్థమూ చెట్టు కిందే జరిపించారు. విషయం అధికారులకు చేరడంతో తహసీల్దార్ నాగరాజమ్మ అధికారులతో సర్వే చేయించారు. అది పట్టా భూమి అని తేలింది.
అయినా.. గ్రామస్తులు వినకుండా వివాదానికి తెరలేపడంతో చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల ను సర్వే చేయించాలని నిర్ణయించా రు. ఆ స్థలం కింద స్టేటస్‌కో మెయిం టైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుస్మిత వివాహం జరగాల్సి ఉండగా, సోమవారం తహసీల్దార్, సుల్తానాబాద్ సీఐ వచ్చి రామలక్ష్మయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్థలంలో వివాహం చేస్తే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నందున అక్కడే ఉన్న చెట్టు కింద పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో చెట్టు కిందే సుస్మిత వివాహం చేయనున్నారు.