ఏజెన్సీలో తగ్గని ఉద్రిక్తత! | Dissatisfied tension in the agency! | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో తగ్గని ఉద్రిక్తత!

Published Sun, Dec 17 2017 2:44 AM | Last Updated on Sun, Dec 17 2017 9:36 AM

Dissatisfied tension in the agency! - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఉట్నూర్‌: పాత ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారీగా పోలీసుల మోహరింపు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నేరుగా పర్యవేక్షిస్తుండడంతో పరిస్థితి కొంతమేర అదుపులో ఉంది. పోలీసులు ఏజెన్సీలో 144 సెక్షన్‌ను విధించడంతోపాటు వదంతులు వ్యాపించకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయించారు. అయితే శుక్రవారం నాటి ఘటనలపై ఇరువర్గాలు ఆగ్రహంగా ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పటిష్టంగా భద్రతా చర్యలు
ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం, ప్రతిగా లంబాడీలు ఆదివాసీల జెండాలను ధ్వంసం చేయడంతో ఏజెన్సీ ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఉదయం నుంచే ఏజెన్సీ గ్రామాలు, తండాల్లో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మీడియా ద్వారా ఈ విషయం విపరీతంగా ప్రచారమై ఉద్రిక్తతలను పెంచింది.

శుక్రవారం రాత్రి వరకు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. భారీగా పోలీసు బలగాలను మోహరించి, తగిన చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డీఐజీ రవివర్మ స్వయంగా శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌)తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని పోలీసులను రంగంలోకి దింపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఆదిలాబాద్‌ ఎస్పీగా పనిచేసిన తరుణ్‌జోషి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు, పలువురు ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు ఏజెన్సీ మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఏజెన్సీవ్యాప్తంగా బంద్‌
ఆదివాసీలు శనివారం ఏజెన్సీ బంద్‌కు పిలుపు నివ్వడంతో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు ఆదిలాబాద్‌ పట్టణంలో ఆదివాసీలు ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది.

నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూరు, సిర్పూర్‌ (యూ), లింగాపూర్‌ మండలాల పరిధిలోని గ్రామాలతోపాటు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. శనివారం మధ్యాహ్నం గాజిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం రావడంతో పోలీసు బృందాలు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపు చేశాయి. ఇక జైనూరు, సిర్పూరు (యూ), లింగాపూర్, నార్నూర్‌ మండలాల పరిధిలో రాత్రిపూట దాడులు జరగవచ్చన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

144 సెక్షన్‌.. ఇంటర్నెట్‌ నిలిపివేత
ఏజెన్సీలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయించారు. ఏజెన్సీ ప్రభావం లేని మంచిర్యాల పట్టణంలోనూ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు అందలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో 2జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ పనిచేసినట్లు తెలిసింది. కాగా శుక్రవారం ఉద్రిక్తతల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించినట్లుగా భావిస్తున్న జితేందర్, ఎస్‌కే ఫారుఖ్‌ల మృతదేహాలకు ఉట్నూర్‌ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం వారి స్వగ్రామం హస్నాపూర్‌కు తరలించారు.

భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీల ఆందోళన
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ఆదివాసీల ఆందోళన ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. పస్రా–తాడ్వాయి రహదారి మధ్యలో చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి.. రాస్తారోకో చేశారు. ఏటూరునాగారంలో బంద్‌ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వెంకటాపురం(కే), వాజేడు మండలాల్లో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్‌ చేపట్టి.. బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కాగా లంబాడీలు, ఆదివాసీల మధ్య గొడవల నేపథ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆదివారం నుంచి వారం పాటు 144 సెక్షన్‌ అమలు చేయనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ప్రకటించారు.


8 కేసులు నమోదు
ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు ఇరువర్గాలపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను, 14 టెక్నికల్‌ బృందాలను ఏర్పాటు చేశారు. 16 చెక్‌పోస్టులు, 23 పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వదంతులు నమ్మద్దు
ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఆదివాసీలు, లంబాడీలు సమన్వయం పాటించాలి. వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. వివాదాలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగాక జిల్లా కలెక్టర్, ఎస్పీల సమక్షంలో శాంతి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తాం..      – వై.నాగిరెడ్డి, ఐజీ


ఉట్నూరు అల్లర్లపై సర్కారు సీరియస్‌
♦ కరీంనగర్‌ డీఐజీ, ఆదిలాబాద్,
♦ఆసిఫాబాద్‌ కలెక్టర్లు, ఎస్పీలపై వేటు
♦తక్షణం వర్తించేలా ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌ :  ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఆదివాసీలు, లంబాడీల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ రవివర్మతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్, ఎస్పీ ఎం.శ్రీనివాసులు.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌లపై బదిలీ వేటు వేసింది. ఉట్నూరులో శుక్రవారం జరిగిన గొడవలను ముందుగా పసిగట్టలేకపోవడం, పరిస్థితులను త్వరగా అదుపు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై వీరందరినీ మూకుమ్మడిగా బదిలీ చేసింది.

ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులతో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమావేశమైన అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివాసీలు, లంబాడీల మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్తత నెలకొన్నా స్థానిక అధికారులు సరైన విధంగా స్పందించలేదని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాగా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్పీగా పని చేస్తున్న పి.ప్రమోద్‌ కుమార్‌ను కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన అధికారులకు ఇంకా కొత్త పోస్టింగులు కేటాయించలేదు.  

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement