గ్రామానికి రాకుంటే మండలానికే.. | Distribution of Passbooks in Villages as scheduled in Telangana | Sakshi
Sakshi News home page

గ్రామానికి రాకుంటే మండలానికే..

Published Sun, May 13 2018 1:19 AM | Last Updated on Sun, May 13 2018 1:19 AM

Distribution of Passbooks in Villages as scheduled in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రైతుల పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతోంది. గ్రామాలవారీగా రెవెన్యూ యంత్రాంగం రైతుల వద్దకు వెళ్లి పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తోంది. అయితే అవగాహన లేమితోపాటు ఎండలు, శుభకార్యాల వంటి కారణాల వల్ల స్థానికంగా నివాసం ఉండని దాదాపు 25 శాతం మంది పాస్‌పుస్తకాలు తీసుకునేందుకు రావడం లేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ నెల 10 నుంచి 19 వరకు ఆ మండలంలోని ఏయే గ్రామాల్లో ఎప్పుడు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలో రెవెన్యూ యంత్రాంగం షెడ్యూల్‌ రూపొందించింది.

ఉదాహరణకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ఈ నెల 10 నుంచి 19లోగా ఏదో ఒకరోజు మాత్రమే పాస్‌పుస్తకాల పంపిణీకి షెడ్యూల్‌ ఇచ్చింది. చాలా మంది అవగాహన లేక ఈ నెల 10 నుంచి 19 వరకు ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్లినా పాస్‌పుస్తకాలు ఇస్తారనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో షెడ్యూల్‌ ప్రకటించిన రోజును తేలికగా తీసుకుని వెళ్లడం లేదు. అయితే అలా షెడ్యూల్‌ రోజు గ్రామానికి వెళ్లి పాస్‌పుస్తకాలు తీసుకోని వారికి మళ్లీ ఆ గ్రామంలో పాస్‌పుస్తకాలు ఇవ్వబోమని రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. షెడ్యూల్‌ రోజు గ్రామానికి వెళ్లకపోతే నేరుగా మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాలని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు.

ఈ షెడ్యూల్‌ తర్వాతే...
ఈ నెల 10 నుంచి 19 వరకు సెలవు రోజుల్లో కూడా గ్రామాలవారీ షెడ్యూల్‌ ఉన్నందున ఏ గ్రామంలో షెడ్యూల్‌ ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన పాస్‌పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. ప్రతి రోజూ ఫలానా గ్రామంలో పంపిణీ చేసిన పాస్‌పుస్తకాల వివరాలను మొబైల్‌ యాప్‌ ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులకు పంపి మిగిలిపోయిన పాస్‌పుస్తకాలను ఎమ్మార్వో కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూంకు తరలిస్తారు. మొత్తం అన్ని గ్రామాల్లో పంపిణీ పూర్తయ్యాకే మళ్లీ వాటిని స్ట్రాంగ్‌ రూంల నుంచి బయటకు తీస్తారు. అంటే షెడ్యూల్‌ మేరకు పాస్‌పుస్తకం తీసుకోని రైతులు ఈ నెల 20 తర్వాతే తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం కోసం వెళ్లేటప్పుడు ఆధార్‌ కార్డు తీసుకుని వెళ్లి తమ ఖాతా నంబర్‌ చెప్పాలని, పాస్‌పుస్తకం, రైతు తీసుకెళ్లిన ఆధార్‌లోని ఫొటోలు సరిపోలితే అక్కడే సంతకం తీసుకుని పాస్‌పుస్తకం ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement