‘పీఠ’ముడి! | District presidential seat on focus! | Sakshi
Sakshi News home page

‘పీఠ’ముడి!

Published Sun, Feb 21 2016 1:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘పీఠ’ముడి! - Sakshi

‘పీఠ’ముడి!

సాక్షి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా అధ్యక్ష పీఠంపై కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం జరుగుతోంది. అధిష్టానం అండదండలతో పార్టీ పగ్గాలు చేజిక్కించుకునే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడడంతో నైతిక బాధ్యత వహిస్తూ డీసీసీ అధ్యక్ష పదవికి క్యామ మల్లేశ్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఆమోదం విషయంలో సస్పెన్స్ వీడకముందే.. కుర్చీ కోసం కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు తెరలేచింది. కేవలం 18 నెలల పాటు అధ్యక్షుడిగా పనిచేసిందున మల్లేశ్‌నే తిరిగి కొనసాగించాలని మెజార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండగా, స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నందున తమకు చాన్స్ ఇవ్వాలని మరోవర్గం పట్టుబడుతోంది.
 
మల్లేశ్‌కు మద్దతుగా సంతకాల సేకరణ
సారథి ఖరారు జిల్లా కాంగ్రెస్‌లో సరికొత్త చర్చకు తెరలేపింది. మల్లేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ముఖ్యనేతలంతా ఏకతాటి మీద నిలిచారు. ఎడముఖం.. పెడముఖంగా ఉండే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ కూడా ఆయనకు అండగా నిలిచారు. ఈ మేరకు మల్లేశ్‌ను కొనసాగించాలని కోరుతూ అధిష్టానానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు.

మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పార్టీ నేతలు కేఎల్లార్, సుధీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్, నారాయణరావు, బండారి రాజిరెడ్డి, భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలంగౌడ్ కూడా మల్లేశ్ మద్దతుగా లేఖ రాశారు. జిల్లాలో పార్టీ సమన్వయంతో పనిచేస్తోందని, ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసిందని గుర్తు చేశారు. కేవలం జీహెచ్‌ఎంసీలో ఓటమికి మల్లేశ్‌ను బలి చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని తేల్చిచెప్పారు.

ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ముందు కుండబద్దలు కొట్టారు. ఓటమిని సాకుగా చూపి మల్లేశ్‌ను తప్పించాలని చూస్తే వరంగల్, గ్రేటర్, నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేతలందరికీ ఉద్వాసన పలకాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మల్లేశ్ రాజీనామా ఆమోదించే అంశంపై అధిష్టానం డైల మాలో పడినట్లు తెలుస్తోంది. మెజార్టీ సీనియర్లు మల్లేశ్‌కు మద్దతు ఇస్తున్నందున.. రాజీనామా అంశంపై అచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  
 
మాకు ఛాన్సివ్వండి
ఓటమిని అంగీకరిస్తూ మల్లేశే రాజీనామా చేసినందున.. ఆయనకు మళ్లీ అవకాశం కల్పించాలనే వాదన అర్థరహితమని మరో వర్గం అంటోంది. మల్లేశ్‌ను తప్పించడం ఖాయమైనందున సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పేరను పరిశీలించాలని ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది. సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుని అనుభవ జ్ఞుడైన చంద్రశేఖర్‌కు పగ్గాలు అప్పగించడం సముచితమని ఇటీవల దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టం చేశారు.

కాగా, చంద్రశేఖర్ నాయకత్వాన్ని మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్‌కుమార్‌లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి కూడా డీసీసీ పీఠంపై కన్నేశారు. తన మనసులోని మాటను డిగ్గీ చెవిన వేశారు. దిగ్విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు తనకు కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులోపు కొత్త సారథులను ఖరారు చేస్తామని డి గ్గీరాజా స్పష్టం చేసినందున ఆశావహులు ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు.. సొంతపార్టీలో వ్యతిరేకవర్గాన్ని  బలహీన పరిచే దిశగా వ్యూహారచన చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement