భద్రాచలం: జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. స్వయం పాలిత వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఉన్న 10 ఎస్‌ఎం హాస్టళ్లలో ఒక్క కొత్తగూడెంలో మినహా మిగతా చోట్ల పక్కా భవనాలు లేవు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 స్వయం పాలిత వసతి గృహాలు (5 బాలురు, 5 బాలికలు) ఉండగా ఇందులో 750 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 23 ఉండగా, ఇందులో 1615 మంది ఉంటున్నారు. వసతి గృహాల్లో చాలా చోట్ల సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం బాలికల ‘ఏ’ హాస్టల్‌లోనే కళాశాలకు చెందిన ఎస్‌ఎం హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థినులకే సరిపడా వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతుంటే, కళాశాల విద్యార్థులను కూడా తీసుకొచ్చి ఇందులోనే పెట్టారు. దీంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది.
కింద ఆరు గదులు అందుబాటులో ఉండగా, నాలుగు గదులను విద్యార్థినుల వసతికి కేటాయించారు. ఒక గదిలో వంట చేస్తుండగా, మరో గదిని ఆ శాఖ అధికారులు స్టోర్ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. బాలికల హాస్టల్‌లో ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయ స్టోర్‌రూమ్ ఏంటని విద్యార్థిసంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో హెచ్‌డబ్ల్యూఓ ఉండాల్సిన గదిని కూడా విద్యార్థినుల కోసం కేటాయించారు. ఎస్‌ఎం హాస్టళ్లతోపాటు, జిల్లాలోని ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో పలుచోట్ల పరిశుభ్రమైన తాగునీరు అందటం లేదు. భద్రాచలం ఎస్‌ఎంహెచ్‌లో గోదావరి నీటిని నేరుగా అందిస్తున్న విషయాన్ని స్వయంగా ఆ శాఖ జిల్లా అభివృద్ధి అధికారి మహేశ్వర్ గుర్తించారు. శుభ్రమైన తాగునీరు అందకనే వ్యాధులు వస్తున్నందున వసతి గృహాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వసతిలేని చోట బంకర్ బెడ్స్..!
బాలికల వసతి గృహాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రస్తుతం బంకర్ బెడ్స్ మంజూరు చేశారు. భద్రాచలంతో పాటు మరికొన్ని వసతి గృహాలకు సరఫరా చేశారు. కానీ శాశ్వత భవన సదుపాయం లేక అరొకర వసతుల మధ్య ఉంటున్న ఎస్‌ఎం హాస్టళ్లకు బంకర్ బెడ్స్ మంజూరు చేసినా, ఉపయోగించే అవకాశం లేదు. భద్రాచలం ఎస్‌ఎం హాస్టల్‌కు వీటిని సరఫరా చేసినా, వసతి లేక ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది.
ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు మరమ్మతులు..
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్ల పరిధిలోనే ఎస్‌ఎం హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నందున, ఇక్కడ మౌలిక వసతులు పెంపొందిస్తే, ఇరువురికి బాగుంటుందని భావించి ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా జిల్లాలో గల ఏడు వసతి గృహాలకు మరమ్మతుల కోసం రూ.35.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో భద్రాచలం(ఏ,బీ), బూర్గంపాడు, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, కొత్తగూడెం హాస్టళ్లకు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధే లక్ష్యమనే కలెక్టర్ సూచనలతో సాంఘిక సంక్షేమ అభివృద్ధి జిల్లా అధి కారి మహేశ్వర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆ శాఖ అధి కారులు, వసతి గృహ ఇన్‌చార్జీలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధించే దిశగా ఏర్పాట్లు చేశారు. పదో తరగతిలో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం సబ్జెక్టు నిపుణులను నియమించారు.
పక్కా భవనాలు లేని ఎస్‌ఎం హాస్టళ్లు..
స్థాయి విద్యార్థులకు స్వయం పాలిత వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పటికీ, వీటికి పక్కా భవనాలు లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో æభద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచలో రెండు చొప్పున(బాలురు, బాలికలకు వేర్వేరుగా), అశ్వారావుపేట, ఇల్లెందులో బాలురకు ఎస్‌ఎం హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పది ఎస్‌ఎం హాస్టళ్లలో కొత్తగూడెంలో ఉన్న రెండు హాస్టళ్లకు మాత్రమే సొంతభవనాలు ఉన్నాయి. పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లోనే కళాశాల స్థాయి విద్యార్థులు కూడా ఉంటున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచనలతో క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థులకు మౌలిక వసతులు పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎస్‌ఎం హాస్టళ్లకు భవనాలు లేని మాట వాస్తవమే. భద్రాచలంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. స్థలం సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదు. ఎస్‌ఎం హాస్టల్‌లో తప్పనిసరిగా మినలర్ వాటర్‌నే అందించాలని ఆదేశించాం.
– మహేశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ
జిల్లా అభివృద్ధి అధికారి
Comments
Please login to add a commentAdd a comment