కుక్క దాడిలో గాయపడిన చిన్నారి, (ఇన్‌సెట్‌లో) కాలికి అయిన గాయం
సాక్షి, పటాన్‌చెరు : అమీన్‌పూర్‌లోని నవ్యనగర్‌లో బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారిపై కుక్క దాడి చేసి గాయపర్చింది. అమీన్‌పూర్ పట్టణం, మండల పరిధిలో ప్రతి రోజూ ఏదో ఒక చోట కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కిష్టారెడ్డిపేట, బీఎస్‌ఆర్ కాలనీలో, అమీన్‌ఫNర్ పట్టణంలోని బీరంగూడ ఇతర ప్రాంతాల్లో జరిగిన కుక్క కాట్ల సంఘటనలు మరువక ముందే అమీన్‌పూర్ నవ్యనగర్‌లో బుధవారం చక్రధర్ కూతురు అద్వైత అనే చిన్నారిపై దాడి చేసింది. తల్లితో కలిసి గేటు వద్ద స్కూల్ బస్సు కోసం ఎదరు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన కుక్క ఆ చిన్నారికాలిపై గాయం చేసింది. అంతలోనే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఆ కుక్కను తరిమేశారు.
మొరపెట్టుకున్నా..
కాలనీలో కుక్కల దాడులు పెరిగాయని స్థానికులు అమీన్‌పూర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని నవ్యనగర్ కాలనీవాసులు తెలిపారు. ఈ విషయమై స్థానిక కమిషనర్ సుజాత వివరణ కోరగా కుక్కలను పట్టుకునే వ్యక్తులకు ఆ పని అప్పగించామని, గురువారం సాయంత్రానికి కుక్కలను అక్కడ నుంచి తరలిస్తామన్నారు. అయితే అమీన్‌పూర్‌లో కుక్కల దాడుల సంఘటనలు పెరుగుతున్నాయని వాట్సప్ గ్రూపుల్లో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. శునకాల దాడుల సంఘటనలకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను పరస్పరం షేర్ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment