సంతోష్, స్వప్న
‘వివాహం వ్యాపారం కాదు.. కట్నం దురాచారం’... శతాబ్దాలుగా మనం వింటున్న మాటలివి. కానీ కట్నం రాకాసి నానాటికీ పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. సమాజంలో నాటుకుపోయిన ఈ విషబీజాన్ని పెకిలించేందుకు ఆలోచన తీరులో మార్పు అవసరం. దీనికి తోడ్పాటుగా దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైంది ‘ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్‌కామ్’ వెబ్‌సైట్. సామాజిక మార్పు కోసం సాంకేతిక అస్త్రంగా దీనిని రూపొందించారు నగరానికి చెందిన సత్యనరేశ్.
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ‘కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారికోసం 2006లో ఈ వెబ్‌సైట్ ప్రారంభమైంది. ఒక్కో కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా మ్యాట్రిమోనీలు ఉన్నాయి. కానీ కట్నం వద్దనుకునే వారికోసం మ్యారేజ్ సర్వీస్ లేకపోవడం గమనించి దీనిని ప్రారంభించాన’ని చెప్పారు సత్యనరేశ్. ‘మా దగ్గరికి వచ్చే వారు కట్నం అవసరం లేదని చెప్పినా... కులం విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. కులాంతర వివాహాలపై వ్యతిరేకత నేపథ్యంలో ఇంటర్‌కాస్ట్ వెబ్‌పోర్టల్‌ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని విరమించుకున్నాను. మా వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు 10వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 43 మందికి వివాహాలు జరిగాయి. ఇందుకు ప్రతి ఏటా స్వయంవరం నిర్వహిస్తున్నామ’ని పేర్కొన్నారు.
మేమే ఉదాహరణ..
2014 జూన్‌లో మా వివాహం జరిగింది. కట్నం తీసుకోవడమంటే నా దృష్టిలో అమ్ముడుపోవడమే. అలా నేను కాకూడదనే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకొని స్వప్నను పెళ్లి చేసుకున్నాను. కట్నం ఇస్తేనే పెళ్లిళ్లు సజావుగా జరగుతాయని, కాపురం చక్కగా ఉంటుందనుకోవడం మూర్ఖత్వం. మేం మూడేళ్లుగా ఆనందంగా ఉన్నాం. కట్నం లేకున్నా దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుందనడానికి మేమే ఉదాహరణ.
– సంతోష్
ఎందుకివ్వాలి?
నేను చదువుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు సమానమే అయినప్పుడు కట్నం ఎందుకివ్వాలి? ఈ ఆలోచనతోనే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకొని సంతోష్‌ని పెళ్లాడాను. ఎలాంటి కలతలు లేకుండా హ్యాపీగా సాగుతోంది మా జీవితం.
– స్వప్న
ఉద్యమం రావాలి..
ఈ దురాచారాన్ని రూపుమాపాలంలే ఉద్యమం రావాలి. అలాంటి ఉద్యమానికి ఈ వెబ్‌సైట్ ఒక ఉదాహరణ. సోషల్ మీడియా సహాయంతో సామాజిక మార్పు తీసుకొస్తామనే ఆలోచనతో ఈ సంస్థ ముందుకురావడం అభినందనీయం. సామాజిక మార్పులకు చాలా సమయం పడుతుంది. అయినా ప్రయత్నం మానకూడదు. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.
– రవిచంద్ర, సీనియర్ కౌన్సిల్ (హైకోర్ట్), ఐ డోంట్ వాంట్ డౌరీ (మెంటర్)
15న స్వయంవరం
కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారికోసం ఈనెల 15న బీఎం బిర్లా సెంటర్‌లో స్వయంవరం నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకొని పాల్గొనొచ్చు.
సమయం : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2
వేదిక : భాస్కరా ఆడిటోరియం, బిర్లా సైన్స్ సెంటర్
ఫోన్ : 9885810100
వెబ్‌సైట్: www.idontwantdowry.com
Comments
Please login to add a commentAdd a comment