
సాక్షి, హైదరాబాద్: దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ‘డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్’నిర్మాణం దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అడుగులు వేస్తోంది. బాలానగర్‌లోని శోభన థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవునా ఆరు లైన్ల ఫ్లైఓవర్ స్థానంలోనే నాలుగు లైన్ల ఫ్లైఓవర్ ఒకటి, దానిపైనా మరో నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై సంస్థ ఇంజనీరింగ్ విభాగ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తైవాన్‌లో ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మాదిరిగా ఈ నిర్మాణం చేపడితే ట్రాఫిక్ జామ్‌కు చెక్ చెప్పొచ్చని ఓ అంచనాకు వచ్చారు. కూకట్‌పల్లి వై–జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి వరకు రాకపోకలు సాగించే వాహనాలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్ధారణకు వచ్చారు. కొన్ని నెలల క్రితం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించిన ఆరు లైన్ల ఫ్లైఓవర్‌కు ఆస్తుల సేకరణ గుదిబండగా మారింది.దీంతో 8 లైన్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మంచిదని హెచ్‌ఎండీఏ ప్రతిపాదించడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పటికే భూపరీక్షలు చేసిన అధికారులు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌లకు పునాదిగా ఉండే పిల్లర్ల సామర్థ్యం ఎంత ఉండాలనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో అన్ని పరీక్షలు పూర్తిచేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిసింది.
ఆస్తుల సేకరణ తగ్గింపు.. నిర్మాణ వ్యయం రెట్టింపు...
ఆరు లైన్ల ఫ్లైఓవర్ కోసం ఆస్తుల సేకరణకు రూ.237 కోట్లుగా నిర్ణయించిన హెచ్‌ఎండీఏ నిర్మాణ వ్యయం రూ.69.10 కోట్లుగా అంచనా వేసి బీఎస్‌సీపీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి టెండర్ ఇచ్చింది. అయితే ఆస్తుల సేకరణ ఇబ్బందిగా మారడం, ఫ్లైఓవర్ పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఆలోచన చేసింది. దీనివల్ల ఆరు లైన్ల ఫ్లైఓవర్‌కు 45 మీటర్ల స్థలం అవసరమైతే, డబుల్ డెక్కర్ వల్ల అది 20 మీటర్లకు చేరింది.
ఆరు లైన్ల ఫ్లైఓవర్ స్థానంలో నాలుగు లేన్ల ఫ్లైఓవర్, దానిపై మరో నాలుగు లేన్ల ఫ్లైఓవర్ తీసుకురావాలని నిర్ణయించారు. శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ కంపెనీ ఇండస్ట్రియల్ గేట్ రాకముందే తొలి ఫ్లైఓవర్ ముగియనుండగా, ర్యాంప్ పొజిషన్ వల్ల పై ఫ్లైఓవర్ ఐడీపీఎల్ కంపెనీ ఇండస్ట్రియల్ గేట్ వద్ద ముగియనుంది. ప్రతిపాదిత ఫ్లైఓవర్‌కు అనుకున్నట్టుగానే 24 పిల్లర్లు ఉంటాయి.
పిల్లర్ కుడి, ఎడమవైపు 4 లైన్ల రోడ్డు ఉండనుంది. పై ఫ్లైఓవర్‌కు అడ్డంకులు లేకుండా నగరంలోని మిగతా ఫ్లైఓవర్‌ల మాదిరిగానే ఉండనుంది. ఈ రెండు ఫ్లైఓవర్‌లు ప్రవేశ, ముగింపు ద్వారాల వద్ద కొంచెం దూరం ఉండటంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వల్ల ఆస్తుల సేకరణకు అయ్యే వ్యయం తగ్గి, నిర్మాణ వ్యయం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment