ఎల్లలు దాటిన ఔషధ ప్రయోగం!
- అస్వస్థతకు గురైన మరో 19 మంది...
- నాగరాజు మృతితో సర్వత్రా ఆందోళన
సాక్షి, కరీంనగర్: బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ‘ఔషధ ప్రయోగం’ఎల్లలు దాటింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ పరిధి నాగంపేటలో వంగర నాగరాజు మృతితో జౌషధ ప్రయోగ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వంగర నాగరాజు చనిపోయిన తర్వాత కాగితాలు సర్దుతుండగా.. దొరి కిన పత్రాల ఆధారంగా ఆయన ఔషధ ప్రయోగం వల్లే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఇంట్లో లభించిన పత్రాలపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. సదరు డాక్యుమెంట్లు పంపాలని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దీంతో వాటిని తీసుకొని నాగరాజు కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు.
తీరా అక్కడికి వెళ్లిన తర్వాత స్టడీ (అగ్రిమెంట్) మేరకు రూ.19,500లతోపాటు ట్రావెలింగ్ ఖర్చుల కింద మరో రూ.3 వేలు అదనంగా ఇస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారని నాగరాజు కుటుంబ సభ్యులు వివరించారు. ఇందుకు ఒప్పుకోని వారు తమకు జరి గిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. బౌన్సర్లతో బయటకు గెంటి వేయించడంతో వెను దిరిగారు. శుక్రవారం కరీం నగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ పరిధి నాగంపేట గ్రామానికి చేరుకున్న బాధితులు మీడియా ప్రతినిధులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన తాము ఏమి చేయాలో పాలుపోవడం లేదని వాపోయారు. పేదరికం ఆసరాగా ఔషధ ప్రయోగాలకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న కంపెనీపై చర్యలు తీసుకొని ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరో 19 మంది పరిస్థితి సీరియస్
నాగరాజుతోపాటు మరో 60 మందికి ఔషధ ప్రయోగం జరగగా, ఇందులో నాగరాజు మృత్యువాత పడ్డాడు. మరో 19 మంది అనారోగ్యానికి గురైనట్లు బెంగళూరు కంపెనీ వద్ద వలంటీర్లు చెప్పారని బాధితులు వివరించారు. ఇందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లు చెబు తున్నారు. ఈ 19 మందిని ఆస్పత్రిలో చేర్పిస్తే తప్ప వారు బతికి బయట పడే అవకాశాలు లేవని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై ఫార్మా కంపెనీపై జమ్మికుంట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు 19 మంది వివరాలు చెప్పలేకపోతున్నారు. ఇదిలా వుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2 లక్షల మంది వలంటీర్లు సదరు ఫార్మా కంపెనీకి ఉంటారని తెలిసింది. దేశ వ్యాప్తంగా 84 ల్యాబ్‌లు ఉండగా మహా రాష్ట్రలో 24, గుజరాత్‌లో 18, తెలంగాణలో 9 ఉన్నా యి. 96 వేల ఫార్మసీ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. మానవ ఔషధ ప్రయోగాలకు గురై మృతి చెందిన వ్యక్తుల కోసం పూణేకు చెందిన డాక్టర్ ఆనంద్‌రాయ్ అనే స్వచ్ఛ అధికార సంస్థ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఒక్కో బాధితునికి రూ.76 లక్షల 40 వేలు పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా అది కాగితాలకే పరిమితం అవుతున్నాయని వలంటీర్లు చెబుతున్నారు.
ఇంటెలిజెన్స్ ‘ఆరా’..
బెంగళూరుకు చెందిన ఓ ఫార్మా కంపెనీ దురాగతం నాగరాజు మృతితో బయటకి రాగా, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, నాగంపేటలో విచారణ జరిపారు. నాగరాజు కుటుంబ సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించారు.