- ‘విమ్‌టా ల్యాబ్స్’పై ఆరోపణలు
- ‘స్టడీ’ కోసం వచ్చిన యువకుడికి అస్వస్థత..
- బయటపడ్డ పరిశోధన విషయం
- ల్యాబ్‌ను పరిశీలించిన పోలీసులు
ఉప్పల్: చర్లపల్లి పారిశ్రామికవాడలోని ‘విమ్‌టా ల్యాబ్స్’లో జరుగుతున్న పరిశోధనలపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థలో వివిధ మందులపై పరిశోధనలు చేస్తుంటారు. అయితే, ఈ పరిశోధనలను మనుషులపై గోప్యంగా నిర్వహిస్తున్నారు. 18-40 ఏళ్ల లోపు వారిపై ‘స్టడీ’ పేరిట ప్రయోగాలు చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి నల్గొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల అత్యధికులు ఈ పరిశోధనలకు సహకరించేందుకు అంగీకరిస్తున్నారు. వీరిలో నిరుద్యోగులు, ఆర్థికంగా చితికిన వారు ఎక్కువ మంది ఉంటున్నారు.
అంతా గోప్యమే..
పరిశోధనల వేళలకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర సమస్యలకు దారి తీసే పరిస్థితులపై అవగాహన కల్పించరని కొత్తగూడెంకు చెందిన శ్రీహరి అనే యువకుడు తెలిపాడు. ‘స్టడీ’ కోసం విమ్‌టా ల్యాబ్స్‌లో శుక్రవారం చేరిన ఈయనకు వాంతులు వచ్చినా సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో అతడు మీడియాను ఆశ్రయించాడు. శనివారం సాయంత్రం సంస్థ ఆవరణలో తనపై పరిశోధనలు జరిగిన విషయాన్ని, తాను ఎదుర్కొన్న సమస్యలను ఆదివారం ఇక్కడ బయట పెట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సంస్థను పరిశీలించిన పోలీసులు
విమ్‌టా ల్యాబ్స్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ జి.ప్రకాశరావు, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ వెంకట రమణ ల్యాబ్స్‌ను పరిశీలించారు. ఇందులో శ్రీహరి అనే యువకుడు సంతకం చేసిన పత్రాలను సిబ్బంది వారికి చూపించారు. సంస్థకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నట్లు సిబ్బంది పోలీసులకు వివరించారు. తమ సంస్థలో నిబంధనల మేరకే ప్రయోగాలు జరుగుతాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ లెనిన్‌బాబు స్పష్టం చేశారు.