గంజాయి రవాణా ముఠా అరెస్ట్
118కిలోల గంజాయి, కారు స్వాధీనం
సూర్యాపేట : ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువకుల ను సూర్యాపేట పోలీ సులు శనివారం స్థానిక అమ్మా గార్డెన్ వద్ద పట్టుకున్నారు. డీఎస్పీ ఎంఏ.రషీద్ నిందితుల వివరాలు వెల్లడించారు. చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు నుంచి గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. డిక్కీలో గంజాయి బ్యాగులు కనిపించాయి. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కరీంనగర్ జిల్లాలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన ముండ్ర కిరణ్‌కుమార్, కరీంనగర్‌కు చెందిన తొడేటి లోకేష్, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు. కిరణ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో నివాసముంటున్నాడు. ఇతను గతంలో కార్తీక్ అనే వ్యక్తితో కలిసి గంజాయి వ్యాపారం చేశాడని డీఎస్పీ తెలిపారు. ఒకరితో పొత్తు వద్దనుకుని సొంతంగా వ్యాపారం చేయాలనే నిర్ణయంతో కరీంనగర్ జిల్లాకు చెందిన తొడేటి లోకేశ్, మాచర్ల అఖిల్‌తో కలిసి అనకాపల్లి ప్రాంతానికి చెందిన కిరణ్‌కు పరిచయం ఉన్న అర్జున్‌తో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. కిరణ్ కొంత కాలంగా అనకాపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మల గ్రామానికి చెందిన సచిన్‌కు ఒక ప్యాకెట్ రూ.8 వేలకు అమ్మేవాడని వివరించారు కిరణ్‌కుమార్‌పై హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసుస్టేషన్‌లో కేసు కూడా ఉన్నట్టు చెప్పారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 118 కిలోల గంజాయిని తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేసినట్లు తెలిపారు. స్కొడాకారును సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు.