ప్రతి గ్రామం.. ఆదర్శ గ్రామం కావాలి
ఎంపీ కవిత
హాసాకొత్తూర్ (కమ్మర్‌పల్లి) : ఎందరో త్యాగధనుల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం కావాలన్నదే తన ఆశయమని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌లో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న 33/11 కె.వీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు అవుతున్నప్పటికీ, ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనకబడ్డామన్నారు.
గ్రామీణ ఆవాస్ యోజన కింద ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. తన పరిధిలో 30 మండలాలున్నాయని, మండలంలో ఏడాదికి ఒక్క గ్రామం తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాల్లోని అన్ని చెరువులను ఇరిగేషన్ ప్రాజెక్ట్ కిందకు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సమస్య ఇప్పటిది కాదని, గత పాలకుల తప్పిదాల వల్లే సంక్షోభం నెలకొందన్నారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో విద్యుత్ సమస్య ఉండేదని, అదే వారసత్వంగా కొనసాగుతోందన్నారు. హాసాకొత్తూర్ నుంచి మెట్ల చిట్టాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
మాయ మాటలు నమ్మొద్దు....
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు, చేపడుతున్న సంస్కరణలతో కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నాయని, వాటి మాటలను నమ్మొద్దని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అప్పట్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినా అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. అప్పటి డిమాండ్ మేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 478 కోట్లు చెల్లించిందన్నారు. హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం నీటి పంపకాల విషయమై కొనసాగుతున్న వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. గట్టుపొడిచిన వాగు కాలువల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, జడ్పీటీసీ సభ్యులు దాసరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.