ఎర్తింగ్ లోపంతోనే విద్యుదాఘాతం! | Earthing error with the electric shock! | Sakshi
Sakshi News home page

ఎర్తింగ్ లోపంతోనే విద్యుదాఘాతం!

Published Thu, Jun 26 2014 12:23 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Earthing error with the electric shock!

- ‘సెల్ చార్జింగ్’ పెడుతూ మదన్‌పల్లి కొత్తతండాలో వ్యక్తి మృతి
- అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకుల ఆందోళన

శంషాబాద్ రూరల్: చార్జింగ్ పెట్టిన సెల్‌తో మాట్లాడే ప్రయత్నంచేసి విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందడం బుధవారం శంషాబాద్ మండలంలో కలకలం రేపింది. ఎర్తింగ్‌లోపం కారణంగానే విద్యుదాఘాతం ఏర్పడిందని మృతుడి బంధువులు, గ్రామస్తులు పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.

చివరకు పోలీసులు, ట్రాన్స్‌కో అధికారుల జోక్యంతో విషయం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలం మదన్‌పల్లి కొత్తతండాకు చెందిన మునావత్ రెడ్యా(35) ట్రాక్టర్ డ్రైవర్. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచిన రెడ్యా చార్జింగ్ అవుతున్న సెల్‌ను తీసి మాట్లాడబోయాడు. దానికి విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెడ్యాకు భార్య మంగ్లీ, కుమారులు గురు(8), వినోద్(4), కూతురు దేవి(6) ఉన్నారు. రెడ్యా మృతితో తండాలో విషాదం అలుముకుంది. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.
 
సబ్‌స్టేషన్ వద్ద ధర్నా

తండాలో ఎర్తింగ్ లోపంతో ఇళ్లలో కరెంటు షాక్ వస్తోందని, దీంతోనే రెడ్యా మృతి చెందాడని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. ట్రాన్స్‌కో అధికారులలే బాధ్యత వహించాలంటూ తండావాసులు రెడ్యా మృతదేహంతో పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్ ముందు ఉన్న బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాన్స్‌కో ఏడీఈ రాంసింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడి కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి రూ. లక్ష నష్టపరిహారంగా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఏడీఈ హామీ ఇచ్చారు. తండాలోని విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం పోలీసులు స్థానిక క్లష్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement