cell charging
-
గొర్రెల కాపరి సెల్ చార్జింగ్ ఐడియా అదిరింది..!
సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఓ గొర్రెల కాపరి వినూత్నంగా ఆలోచించాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేనప్ప తన గొర్రెలను మేత కోసం నల్లమల అటవీప్రాంతానికి తీసుకెళ్తుంటాడు. అయితే అడవిలో విద్యుత్ సౌకర్యం ఉండదు కాబట్టి సెల్‌ఫోన్ చార్జింగ్ సమస్యగా మారింది. దీనికితోడు రాత్రిపూట గొర్రెల మందకు లైటింగ్ కూడా ఉండటం లేదు. దీనిపై ఆలోచించిన హుస్సేనప్ప పరిష్కారమార్గం కనుగొన్నాడు. ఓ సోలార్ ప్లేటు, బ్యాటరీని కొనుగోలు చేసి, గొర్రెల మంద వెంట బియ్యం, ఇతర వంట సామగ్రి తీసుకెళ్లే గాడిదపై ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో సెల్‌ఫోన్ చార్జింగ్‌తో పాటు మందకు లైటింగ్ ఏర్పాటు చేశాడు. హుస్సేనప్ప గురువారం మందతో పాటు జడ్చర్ల మీదుగా వెళుతుండగా.. గాడిదపైనున్న సోలార్‌ప్లేట్లు ఆకర్షించాయి. – జడ్చర్ల -
రైల్వేశాఖ కీలక నిర్ణయం: రైళ్లలో సెల్ ఛార్జింగ్ బంద్
న్యూఢిల్లీ: రైళ్లలో ఉండే మొబైల్ ఛార్జింగ్ పరికరాలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలు గతంలో వచ్చినవేననీ, తాజాగా మరో సారి రైల్వే బోర్డు వీటిని జారీ చేసిందని దక్షిణ రైల్వే సీపీఆర్వో చెప్పారు. రైలు బోగీల్లో ఉండే చార్జింగ్ స్టేషన్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో స్విచ్ఛాఫ్ చేసి ఉంచాలని గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రతిపాదించారు. ఆ సమయంలోనే బెంగళూరు–నాందేడ్ రైలులో అగ్నిప్రమాదం సంభవించడంతో అన్ని జోన్లలోనూ సెల్ ఛార్జింగ్ స్టేషన్లను రాత్రి వేళల్లో ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (ప్రమాదంలో యావత్ దేశం.. కరోనా తీవ్రతతో పరిస్థితి విషమం) -
నాయకులకు సెల్ ఛార్జింగ్ ఆగట్లేదు..!
సాక్షి, తొర్రూరు రూరల్(స్టోరీ): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభ్యర్థులు నిత్యం ఫోన్లు చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దీంతో చాలామందికి క్షణం తీరిక ఉండటం లేదు. నాయకులు, అధికారులౖకైతే ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బందిగా మారింది. సెల్ఫోన్లలో మాట్లాడటం నిత్యకృత్యంగా మారింది. తాజా సమాచారం తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలు తీరిక లేకుండా గమనిస్తున్నారు. అధికారులేమో ఆ సమాచారం ఈ సమాచారం అంటూ జిల్లా కేంద్రం నుంచి డివిజన్, మండల స్థాయి వరకు దాదాపు గంటకు ఇరవైకి తగ్గకుండా కాల్స్ చేస్తున్నారు. అన్ని వివరాలు సెల్‌ఫోన్ ద్వారానే చెప్పాలంటే మధ్యాహ్నానికే ఛార్జింగ్ అయిపోతుందని నాయకులు వాపోతున్నారు. ఛార్జింగ్ లేకపోవడంతో సమాచార సేకరణ ఇబ్బందిగా మారుతుందని అటు నాయకులు, ఇటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అధికారులను నీరసంగా కనిపిస్తున్నారని అడిగితే ‘ రాత్రంతా కార్యాలయంలోనే ఉన్నాం..పెట్రోలింగ్ తిరుగుతున్నాం’ అని సమాధానం చెప్తున్నారు. రాత్రింబవళ్లు తీరిక లేకుండా కాల్స్ రావడంతో నరాలు లాగేస్తున్నాయి అంటూ తమ పని ఒత్తిడిని వ్యక్తపరుస్తున్నారు. ఇదండీ సంగతి. -
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
రాపూరు (నెల్లూరు): సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ రాపూరు మండలంలోని గిలకపాడు ఎస్టీకాలనీకి చెందిన చలంచర్ల మణి(36) మంగళవారం రాత్రి మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు గిలకపాడు ఎస్టీకాలనీకి చెందిన చలంచర్ల మణి మంగళవారం రాత్రి తన సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు చార్జర్‌ను తీసుకున్నాడు. చార్జర్‌ను విద్యుత్ బోర్డులో పెట్టి పిన్ను సెల్‌ఫోన్‌కు పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మణి కింద పడిపోయాడు. వెంటనే అతని భార్య చార్జర్ వైరును తొలగించి చుట్టుపక్కల వారిని పిలిచి మణిని రాపూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్‌ను, చార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గిలకపాడు ఎస్టీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మణికి భార్య భవాని, పిల్లలు అఖిల్, సురేంద్ర ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన పాటల మోజు
పుల్కల్(అందోల్) : చార్జింగ్ అవుతున్న సెల్‌కు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయిన యువకుడు షార్ట్ సర్క్యూట్‌తో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం సింగూర్ గ్రామానికి చెందిన పోతగోని శ్రీనివాస్ (30) మంగళవారం రాత్రి తన సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ అవుతున్న సెల్‌కు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయాడు. ఈ క్రమంలో చార్జింగ్ అవుతున్న సెల్ ద్వారా షార్ట్ సర్క్యూటై ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్న శ్రీనివాస్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. -
సెల్ చార్జర్‌ను తీస్తుండగా.
చిన్నశంకరంపేట(మెదక్): సెల్‌పోన్ చార్జర్‌ను ప్లగ్ నుంచి తొలగిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మెంతం గారి నర్సింలు కుమారుడు శ్రీకాంత్(20) ఆదివారం ఉదయం ఇంట్లో సెల్‌పోన్‌కు చార్జింగ్ పెట్టాడు. అనంతరం ప్లగ్ నుంచి చార్జింగ్ తీస్తుండగా షాక్‌కి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ని తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.∙ -
నిర్లక్ష్యం ఖరీదు నలుగురి ప్రాణాలు
గిద్దలూరు: డ్రైవర్ నిర్లక్ష్యంగా తన సెల్‌కు రీచార్జి పెట్టుకుంటుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడంతో పాటు 41 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో తంబళ్లపల్లె క్రాస్ రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాకు చెందిన సాథిలి, దేవగానిపల్లి, ఉప్పకుంటహల్లి గ్రామాల భక్తులు శివరాత్రి సందర్భంగా పలు ఆలయాలు దర్శించుకునేందుకు ఈ నెల 11వ తేదీన ఓ ట్రావెల్స్ నిర్వాహకుడి లారీలో బయల్దేరారు. కదిరి, తుమ్మలకొండ కోన, బ్రహ్మంగారి మఠం ఆలయాలు దర్శించుకుని శ్రీశైలం వెళ్తున్నారు. మార్గమధ్యంలో నల్లగుంట్ల సమీప మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ రాళ్లను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. 61 మంది ఉండటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా 41 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలో 10 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. మృతుల్లో సాథిలి గ్రామానికి చెందిన నల్లవోలు నారాయణమ్మ (48), తలారి నారాయణప్ప ఆదెమ్మ (58), దేవగానిపల్లెకు చెందిన వెంకట నరసయ్యప్ప (50), ఉప్పుకుంటహల్లికి చెందిన జూలెపల్లి మారప్ప (60) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో నరహల్ల మనిరత్నమ్మ, బి.జయమ్మ, పాపన్న అనసూయమ్మ, నాగరాజప్ప, తిప్పన్న, బాబన్నగారి మునికృష్ణ, కదిరపు రఘు ఉన్నారు. పోలీసుల సేవలు భేష్ అర్ధరాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు. కొమరోలు ఎస్ఐ అబ్దుల్ రహమాన్ తక్షణమే సీఐ శ్రీరామ్‌కు విషయం చేరవేశాడు. ఆయన గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలతో పాటు సిబ్బందిని పిలిపించి సంఘటన స్థలంలోని క్షతగాత్రులను తమ వాహనాల్లోనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందింపజేశారు. అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు మినహా గాయపడిన అందరనీ సకాలంలో ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్లో ఇరుక్కున్న భక్తులను చాకచక్యంగా బయటకు తీసి వారికి ఎలాంటి గాయాలు కాకుండా కాపాడటంతో స్థానికులు పోలీసులను అభినందించారు. స్వగ్రామాలకు క్షతగాత్రులు నల్లగుంట్ల వద్ద జరిగిన రోడు ప్రమాదంలో గాయాలపాలైన వారికి చికిత్స అందించిన అనంతం స్వగ్రామాలకు చేర్చేందుకు పోలీసులు చొరవ తీసుకున్నారు. ఎస్పీ సత్యేసుబాబు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి స్వల్పగాయాలైన వారిని, వారి బంధువులను ఎక్కించారు. మృతులకు ప్రత్యేకంగా అంబులెన్స్, తీవ్రంగా గాయపడిన వారిలో కొందరికి ఒక అంబులెన్స్ చొప్పున కేటాయించి వారి వారి గ్రామాలకు చేర్చేలా పోలీసు సిబ్బందిని పంపించారు. కేసు నమోదు డ్రైవర్, లారీ యజమానికిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీ అనంతపురం జిల్లా లేపాక్షికి చెందినదిగా గుర్తిం చామని చెప్పారు. టూరిస్టు నిర్వాహకుడు సహదేవప్పపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరంతా సహదేవప్పకు రూ.1,500 చొప్పున చెల్లించి దైవ దర్శనం కోసం వచ్చారని తెలిపారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిఫిన్, భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. ఆయనతో పాటు సీఐ వి.శ్రీరామ్, ఎస్ఐలు కె.మల్లికార్జున, షేక్ అబ్ధుల్రహమాన్, శశికుమార్, నాగశ్రీను ఉన్నారు. జిల్లా అధికారులకు కృతజ్ఞతలు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో సపర్యలు చేసి ఓదార్చి ధైర్యం చెప్పిన జిల్లా అధికారులను కర్ణాటకలోని గుడిబండ తాలూకా పంచాయతీ అధ్యక్షుడు రామాంజి అభినందించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆదెమ్మ తన అత్త అని, సమాచారం తెలియగానే తాను గిద్దలూరు వచ్చానని, ఇక్కడ తమ ప్రాంతానికి చెందిన క్షతగాత్రులకు పోలీసులు, వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. -
సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యార్థి మృతి
పెద్దఅడిశర్లపల్లి : సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామపంచాయతీ మాదాపూర్‌తండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... రమావత్ హన్మంతు మాదాపూర్‌తండాలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హన్మంతుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు రమావత్ సంజీవ్ (16) కోదాడ పట్టణంలో ఉంటూ పదోతరగతి చదువుతున్నాడు. వరుసగా రెండవ శనివారం, ఆదివారం, ఆగస్టు 15 సెలవు దినాలు ఉండడంతో పుష్కరాల కోసమని తన స్వ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సెల్‌చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై సంజీవ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి
తాడ్వాయి: విందు కోసం బంధువుల ఇంటికి రాగా, సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దోమకొండ మండలం యాడారం గ్రామానికి చెందిన వడ్ల నరసింహులు (22) నందివాడలో బంధువుల ఇంటికి సోమవారం వచ్చాడు. అదే రోజు అర్ధరాత్రి సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో షాక్‌కు గురయ్యాడు. కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. -
సెల్‌చార్జింగ్ పెడుతూ యువతి మృతి
తలమడుగు (ఆదిలాబాద్) : తలమడుగు మండలం బరంపూర్ గ్రామపంచాయతీ పరిధి కోలాంగూడకు చెందిన సీడాం కల్పన(20) బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతంతో మృతిచెందింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి కల్పన ఇంట్లో తన సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ బాలుడు మృత్యువాత
వికారాబాద్ రూరల్(రంగారెడ్డి జిల్లా): సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీలారం గ్రామానికి చెందిన మైనొద్దీన్, ఫాతిమా దంపతుల రెండో కుమారుడు అబ్బాస్(17) వ్యవసాయ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అదే గ్రామంలోని తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. తన సెల్‌కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే అబ్బాస్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. -
సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం
అనంతపురం జిల్లా: సెల్‌ఫోన్ చార్జీంగ్ పెట్టి తీస్తుండగా ఒక యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఉమేష్ (20) తన సెల్‌ఫోన్‌కీ చార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఆదివారం అదే గ్రామంలో పలు ఇళ్లలో కొంత మందికి కరెంట్ షాక్ కొట్టినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, విద్యుదాఘూతానికి గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. (రాయదుర్గం) -
సెల్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా! జాగ్రత్త!!
పెద్దకుడుబూరు(కర్నూలు): కర్నూలు జిల్లా పెద్దకుడుబూరు మండలం మేకదోన గ్రామంలో సెల్ ఛార్జింగ్ పెడుతూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన ఖలీల్(28) గురువారం రాత్రి తన ఇంట్లో సెల్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఖలీల్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. సెల్‌కు ఛార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవడం, షాక్ కొట్టడం వంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. సెల్‌కు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. -
సెల్‌చార్జింగ్ పెడుతూ షాక్‌తో ఒకరి మృతి
వరంగల్ (గూడూరు) : వరంగల్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు శివారు పడమటి తండాలో శుక్రవారం సెల్‌చార్జింగ్ పెడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. తేజావత్ షేట్యా, బుజ్జి మూడో కుమారుడు విజయ్(16) అయోధ్యపురం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో సెల్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయూడు. కుటుంబ సభ్యులు గూడూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి
నల్లగొండ(తిరుమలగిరి): సెల్ చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురైన ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో విషాదం నింపింది. బి. సోమనర్సమ్మ(55) ఉదయాన్నే సెల్‌కు చార్జింగ్ పెడుతుండగా షాక్‌కు గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
గంభీరావుపేట: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్‌షాక్‌తో ఓ కూలీ మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన సూర్యవంశ రాందాస్(35) కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఫారంలోనే సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. -
సెల్‌చార్జింగ్ పెడుతూ.. మహిళ మృతి
శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లిలో రేణుకుంట్ల లక్ష్మి(40) శుక్రవారం సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై మరణించింది. రేగొండ మండలం పోచంపల్లికి చెందిన లక్ష్మి నేరడుపల్లిలోని ఆడపడుచు ఐలమ్మ ఇంటికి రెండు రోజుల కిందట వచ్చింది. గురువారం రాత్రి ఇంట్లో చార్జింగ్ పెడుతుండగా షాక్‌కు గురై పడిపోయింది. ఎంజీఎంకు తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మరణించింది. -
ఎర్తింగ్ లోపంతోనే విద్యుదాఘాతం!
- ‘సెల్ చార్జింగ్’ పెడుతూ మదన్‌పల్లి కొత్తతండాలో వ్యక్తి మృతి - అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకుల ఆందోళన శంషాబాద్ రూరల్: చార్జింగ్ పెట్టిన సెల్‌తో మాట్లాడే ప్రయత్నంచేసి విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందడం బుధవారం శంషాబాద్ మండలంలో కలకలం రేపింది. ఎర్తింగ్లోపం కారణంగానే విద్యుదాఘాతం ఏర్పడిందని మృతుడి బంధువులు, గ్రామస్తులు పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు, ట్రాన్స్‌కో అధికారుల జోక్యంతో విషయం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలం మదన్‌పల్లి కొత్తతండాకు చెందిన మునావత్ రెడ్యా(35) ట్రాక్టర్ డ్రైవర్. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచిన రెడ్యా చార్జింగ్ అవుతున్న సెల్‌ను తీసి మాట్లాడబోయాడు. దానికి విద్యుత్ ప్రసారం జరిగి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెడ్యాకు భార్య మంగ్లీ, కుమారులు గురు(8), వినోద్(4), కూతురు దేవి(6) ఉన్నారు. రెడ్యా మృతితో తండాలో విషాదం అలుముకుంది. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. సబ్‌స్టేషన్ వద్ద ధర్నా తండాలో ఎర్తింగ్ లోపంతో ఇళ్లలో కరెంటు షాక్ వస్తోందని, దీంతోనే రెడ్యా మృతి చెందాడని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. ట్రాన్స్‌కో అధికారులలే బాధ్యత వహించాలంటూ తండావాసులు రెడ్యా మృతదేహంతో పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్ ముందు ఉన్న బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాన్స్‌కో ఏడీఈ రాంసింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడి కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి రూ. లక్ష నష్టపరిహారంగా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఏడీఈ హామీ ఇచ్చారు. తండాలోని విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం పోలీసులు స్థానిక క్లష్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.