ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టీవీ, టీసాట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో పాఠాలు బోధించారు. ఎక్కువ శాతం మంది విద్యావేత్తలు ఈ విద్యాసంవత్సరంలో మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
– విద్యారణ్యపురి
వార్షిక సిలబస్ అంతా ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించే పరిస్థితులు ఉండనందున, కొంత సిలబస్ తరగతి గదిలో, మరికొంత ఆన్‌లైన్ ద్వారా బోధించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే భవిష్యత్‌లో తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు కనుమ రుగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. గతంలో డాక్టర్ డీ.ఎస్.కొఠారి చెప్పినట్లుగా దేశ భవిష్యత్ తరగతి గదిలో కాకుండా సాంకేతిక పరికరాల ద్వారా నిర్మించే ప్రయత్నాలు జరుగుతాయి.
విజయవంతంపై అనుమానాలు
కోవిడ్ కారణంగా విద్యారంగంలో మార్పుల పేరుతో చేపడుతున్న ఆన్‌లైన్ బోధన ఏ మేరకు విజయవంతమవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పట్టణ ప్రాంత విద్యార్థులకు కొంతమేరకు ఉపయోగపడుతాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య అందని ద్రాక్ష గానే మారనుందని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకే కాకుండా ఇతర కళాశాలల, హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు.
తాజాగా పదో తరగతి విద్యార్థుల పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసినా కొత్త విద్యాసంవత్సరం ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. కానీ పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో విద్యనందిస్తామంటూ తల్లిదండ్రులకు మెస్సేజ్ పంపుతున్నాయి. దీంతో విద్యాసంవత్సరంపై బెంగ ఉన్న తల్లిదండ్రులు కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను ఆన్‌లైన్ విద్య వైపు అడుగులు వేయించాల్సి వస్తోంది.
ఆత్మన్యూనతా భావం పెరిగే అవకాశం
ఆన్‌లైన్ విద్య ఎప్పటికీ ప్రత్యక్ష బోధనకు ప్రత్నామాయం కాదనే అభిప్రాయం ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు కలిగించే ప్రభావం, స్ఫూర్తి ఏ సాంకేతికత కలిగించదని చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో తేడాలు, విద్యలో అసమానతలు , అంతరాలు మరింతగా వ్యవïస్తీకృతం చేస్తాయి. పలు కారణాలతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య అందక వారు ఆత్మనూన్యతభావంతో చదువులో వెనుకబడడమో లేదంటే విద్యకు దూరం కావడమో జరగొచ్చనే ఆందోళన కూడా వెల్లువెత్తుతోంది. అంతేకాకుండా ఆన్‌లైన్ విద్యావిధానం కామన్‌స్కూల్ విద్యావిధానానికి విరుద్ధగా ఉంటుంది. సాంకేతిక పరికరాలైన ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్, ఆండ్రాయిడ్ ఫోన్లు కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తిచాలని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోగా.. ఒకవేళ ఉన్నా సిగ్నల్ సమస్యలు ఆన్‌లైన్ బోధనను దూరం చేస్తాయి. కుటుంబమంతా ఒకే గదిలో నివసించే పరిస్థితులు కూడా ఆన్‌లైన్ బోధనను ఎంత మేరకు విజయవంతం చేస్తాయో ఆలోచించాలి. ఆన్‌లైన్ విద్యాబోధన రెగ్యులర్ బోధనకు అనుబంధంగా ఉంటేనే ఫలితం ఉంటుందని పలువురు నిపుణులను చెబుతున్నారు. ఇక ఈ విధానం ఉన్నత విద్యలో ఉపయోగపడినా ప్రాధమిక స్థాయిలో విజయవంతం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, ఈ విధానంలో విద్యార్థులు అప్పటికప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకునే పరిస్థితి ఉండదు.
పరిష్కారం కానే కాదు...
ఆన్‌లైన్ విద్య గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరిపోదు, ఉపయోగపడదు. భౌతిక పరిస్థితులను పర్యవేక్షించకుండా ఆన్‌లైన్ విద్యను ప్రవేశపెడితే అణగారిన వర్గాలు విద్యకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్ విద్య పొందాలంటే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి పరికరాలు ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇవి అంతగా అందుబాటులో ఉండవు. ఆన్‌లైన్ విద్యపై దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో సర్వే చేస్తే మెజార్టీ విద్యార్థులు వద్దనే చెప్పారు. ఆన్‌లైన్ విద్య ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కానే కాదు. విద్యలో సాంకేతికత అవసరమే అయినా దానిపైనే పూర్తిగా ఆధారపడకూడదు.
కోవిడ్‌తో సరైన సమయానికి విద్యాసంవత్సరం ప్రారంభించే పరిస్థితులు లేవు. కానీ తర్వాత అయినా కొన్ని నిబంధనలను పాటిస్తూ తరగతులు జరిగేలా చూడాలి. తొలుత 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు జూలైలో తరగతులను ప్రారంభించాలి. అకాడమిక్ క్యాలెండర్ తయారీలో ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరించాలి. ఆ తర్వాతే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలి.
– ఎం.శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment