ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కృషి: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమానికి, ఎర్రగడ్డలోని విక్టరీ గార్డెన్స్‌లో జరిగిన ఎఫ్‌సీఐ శ్రామిక్ యూనియ న్ ఆవిర్భావ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన లో పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. ఈ సంస్థలను పటిష్టం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
అలాగే, పౌర సరఫరాల శాఖలో పనిచేసే హమాలీల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ పబ్లిక్‌సెక్టార్ భాగస్వామ్యంతో బంగారు తెలంగాణను నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ ,బి.నర్సింహారెడ్డి, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సి.విఠల్ తదితరులు పాల్గొన్నారు.