మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఒకేసారి ఎన్నికలు రావడం, అదే సమయంలో పదో తరగతి పరీక్షలు ఉండటంతో ఉపాధ్యాయులు ఎన్నికల విధులతోపాటు, పరీక్షల విధులు నిర్వహించాల్సి వస్తుంది. పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లాలో 178 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 178 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 178 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 2,194 మంది ఇన్విజిలేటర్లను పరీక్షల నిర్వహణకు నియమించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు వీరంతా పరీక్షల విధుల్లో ఉండాలి. ఈ నెల 6న మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్‌లో నిర్వహించే మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్ట్‌మెంటల్ అధికార్లు(డీవో) కూడా ఎన్నికల విధులు నిర్వహించాల్సి రావడం వివాదాస్పదమవుతోంది.
ప్రైవేటు విద్యార్థులు పరీక్ష రాస్తుంటే రోజు పరీక్ష గదిలో పరీక్షకు ముందు రోజు హాల్‌టిక్కెట్ నంబర్లు సీఎస్‌లు, డీవోలు వేయాలి. ఇక రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు రోజు నిర్వహించే పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు పరీక్షకు గంట ముందే స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి పరీక్షా కేంద్రానికి సీఎస్, డీవోలు తీసుకెళ్లాలి. ఇలాంటి తరుణంలో ఈ నెల 6వ తేదీన నిర్వహించే ఎన్నికల విధులకు ఎలా హాజరుకావాలనే అంశం వారిని గందరగోళానికి గురిచేస్తుంది. ఈ నెల 7వ తేదీన ఫిజికల్ సైన్స్ పరీక్ష ఉంది, ఆ రోజు ఉదయం 9:30 గంటలకు జరగాల్సిన పరీక్షను ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా విశాలం పరంగా చాలా పెద్దగా ఉండడం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ నెల 6వ తేదీన నిర్వహించే ఎన్నికల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నికల విధుల్లో పాల్గొన్న డీవోలు, సీఎస్‌లు అదే రోజు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. 7వ తేదీ ఉదయం బయలుదేరి వచ్చినా, పరీక్షా సమయానికి చేరుకుంటారన్న నమ్మకం లేదు.
ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండడంతో మూరుమూల ప్రాంతాలకు ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్లిన వారు అక్కడే రెండు రోజులు ఉండాల్సిన పరిస్థితి. ఏదైనా అనారోగ్యం సంభవించినా, రావడంలో ఆలస్యమైనా మరుసటి రోజు 7వ తేదీన జరగబోయే పరీక్షపై ప్రభావం చూపుతుంది. ఉదయం 11 గంటలకు పరీక్ష సమయాన్ని మార్చినా, ఉదయం డీవోలు, సీఎస్‌లు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నంబర్లు వేయడం, ప్రశ్నాపత్రాలు తీసుకురావడం వారే చేయాల్సి ఉంటుంది. వారు రావడం ఆలస్యమైతే పరీక్ష నిర్వహణ చేపట్టడంలో ఇబ్బందులు తప్పవు. దీంతో ఒకేసారి రెండు విధులను ఎలా నిర్వహించాలని ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. తమకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇస్తే, పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఇవేం డ్యూటీలు!
Published Thu, Apr 3 2014 2:05 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Advertisement