
ముగిసిన ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
10 జిల్లాల నుంచి కేవలం 33 మందికి అర్హత
కరీంనగర్ సిటీ: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ బుధవారంతో ముగిసిం ది. ఈ నెల 1న హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం కొత్త జిల్లా పరిధి నుంచి 500 మంది నిరుద్యోగ అభ్యర్థులు రాగా రాత పరీక్షతోపాటు మిగిలిన అర్హత పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు మాత్రమే మెడికల్ పరీక్షకు అర్హత సాధించారు. బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలోని 1,200 మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు తరలివచ్చారు.
అందులో అర్హత సర్టిఫికెట్లు, స్థానికత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి 900 మందిని రాత పరీక్షకు అనుమతించారు. మిగిలిన 300కి పైగా అభ్యర్థులను సర్టిఫికెట్లు లేవని వెనక్కి పంపించారు. ఇంగ్లిష్, రీజనింగ్‌లో నిర్వహించిన రాత పరీక్షలో కేవలం 57 మంది మాత్రమే పాసయ్యారు. ఫిజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కర్షన్‌లో 27 మంది క్వాలిఫైతో మెడికల్‌కు అర్హత సాధించారు. ఆ పరీక్షను హైదరాబాద్‌లో నిర్వహించిన అనంతరం అక్టోబర్‌లో ఆల్ ఇండియా లెవల్‌లో ఎయిర్‌ఫోర్స్ ఢిల్లీ ప్రతినిధులు మెరిట్ జాబితాను వెలువరించనున్నారు. ఎంపికైన వారికి ఖాళీలను బట్టి కాల్‌లెటర్లు అందించనున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారి తెలిపారు.