సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తులో తొలి అంకం ముగిసింది. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమీక్షలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలపై టీపీసీసీ నేతలు సమీక్ష జరిపారు. దీంతో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల సమీక్షలు పూర్తయ్యాయి.ఈ సమీక్షల్లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, బోసురాజులతో పాటు సీఎల్పీనేత భట్టి విక్రమార్క, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కొత్త జిల్లాల అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌బేరర్లు పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే పార్టీ సమన్వయ కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీల సమావేశాలు కూడా జరిగాయి. పార్టీ ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై వీటిలో చర్చించారు.
ఏం చేద్దాం..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి పార్టీ కోలుకోవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో గౌరవ ప్రదమయిన స్థాయిలో సీట్లు గెలుపొందాలనే ఎజెండాతో ఈ సమీక్షలు జరిగాయని టీపీసీసీ నేతలు చెపుతున్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహం, దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించడం, ప్రచార వ్యూహం తదితరాలపై చర్చించారు. ఏ లోక్‌సభ స్థానానికి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందనే దానిపై క్షేత్రస్థాయి నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. నేతల అభిప్రాయాలు తీసుకునే విషయంలో మరికొంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం జరపడంతో పాటు గత ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలను రానున్న ఎన్నికల్లో ఎలా పునరావృతం కాకుండా చూడాలనే దానిపై దిశానిర్దేశం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కొందరి నేతల్లో వ్యక్తమయింది.
చివరి రోజు... ఆ ఐదు నియోజకవర్గాలు
ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మెదక్ జిల్లా పరిధిలోని ఐదు లోక్‌సభ స్థానాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో కుంతియా, ఉత్తమ్, భట్టి, బోసురాజు, వంశీచందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పైలట్‌రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనేక కారణాలతో ఓటమి పాలయ్యామని, అధికార పార్టీ విచ్చలవిడిగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుపొందిం దని ఆరోపించారు. కానీ, లోక్‌సభ ఎన్నికలు మాత్రం రాహుల్, మోదీ మధ్య జరుగుతాయని, జాతీయ అంశాలతో ముడిపడిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణలో బీజేపీ బలంగా లేనందున కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదని, సీఎం కేసీఆర్ బీజేపీతో లాలూచీ పడి రాష్ట్ర అభివృద్ధి సాధించలేకపోయారని విమర్శించారు. బీజేపీ ముసుగులో ఉన్న టీఆర్‌ఎస్‌కు కాకుండా కాంగ్రెస్‌కు ఓట్లేయాలని ఆయన ప్రజలను కోరారు.
ఎంఆర్‌జీ వాకౌట్
సమీక్ష సమావేశాలు జరుగుతున్న తీరుకు నిరసనగా సికింద్రాబాద్ సమీక్ష నుంచి తాను వాకౌట్ చేసినట్టు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ. వినోద్‌రెడ్డి చెప్పారు. సమావేశంతో సంబంధం లేని వారంతా హాజరయ్యారని, ఓ పద్ధతి ప్రకా రం నిర్వహించలేదని, తమ నాయకుడే పార్లమెంటు అభ్యర్థి కావాలనే ప్రసంగాలు పార్టీకి మంచి చేయవనే కారణంతోనే తాను బయటకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment