ఎంసెట్‌లో అర్హులు 91 వేల మంది
62,777 మంది వరకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సీట్లు 80 వేల నుంచి 90 వేల మధ్యలోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మంగళవారంతో ముగిసింది. 62,777 మందికిపైగా విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 91,556 మంది విద్యార్థులు అర్హత సాధించగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 62,777 మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ జేఎన్‌టీయూ తాము నోటీసులు జారీ చేసిన 237 కాలేజీల నుంచి ఈనెల 20 వరకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు, వారి వాదనలను స్వీకరించింది. వాటిపై మళ్లీ తనిఖీలు చేస్తోంది. వీటిని ఈనెల 28 వరకు పూర్తి చేసి, అనుబంధ గుర్తింపు లభించే కాలేజీల జాబితాలను, వాటిల్లోని సీట్ల వివరాలను ప్రకటించనుంది. అయితే గతంలో లాగే ఈసారి 60 నుంచి 70 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమది టాప్ కాలేజీ అని చెప్పుకున్న వాటిల్లోనూ చాలా లోపాలు బయట పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చాలా కాలేజీల్లో పలు బ్రాంచీలకు, వేలల్లో సీట్లకు కోత పడే పరిస్థితి ఉండొచ్చని ఉన్నత విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తంగా ఈసారి తెలంగాణలో సీట్లు 80 వేల నుంచి 90 వేల మధ్యలోనే ఉండొచ్చని వాదనల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల సంఖ్యను కూడా 150 నుంచి 170 వరకు పరిమితం చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు ప్రభుత్వం, అటు జేఎన్‌టీయూ(హెచ్) నాణ్యత ప్రమాణాలకే పెద్దపీట వేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. అందుకే నిబంధనలు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ తదితర విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీలకే వాటిల్లో సదుపాయాలు, వసతులను బట్టి బ్రాంచీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది. ఈ గుర్తింపు ప్రక్రియపై ఈనెల 28 లేదా 29 తేదీల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఆ తరువాత అనుబంధ గుర్తింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ తరువాత ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది. ఈ ప్రక్రియ మొత్తం అయ్యే సరికి 10 రోజులు పడుతుంది. మరోవైపు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 6 నుంచి మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున , అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది.
ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్‌లో
మొత్తంగా ఎంసెట్‌లో అర్హులు-79,043
ఓయూ రీజియన్‌లో మొత్తంగా వెరిఫికేషన్‌కు హాజరైంది- 58,906
గత ఏడాది కంటే ఈసారి వెరిఫికేషన్‌కు హాజరైన వారి సంఖ్య పెరిగింది. గత ఏడాది 60 శాతం వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా ఈసారి 69 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.