engineering web options
-
మరో కౌన్సెలింగ్ లేనట్లే
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై స్పష్టం చేసిన ఉపముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వెబ్ఆప్షన్లు సరిగా ఇవ్వకపోవడంతో సీట్లు రాని విద్యార్థులకు నిరాశ ఎదురైంది. మరోసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్న న్యాయనిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోసారి కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి అని, అయితే కోర్టు అనుమతి ఇస్తుందో లేదోనన్న అనుమానంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పేర్కొన్నాయి. దీంతో దాదాపు 5 వేల మంది విద్యార్థులు మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కోల్పోయారు. కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లను ఆగస్టు 15లోగా భర్తీ చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ సీట్లను కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకుంటాయని, ప్రభుత్వం నిర్వహిస్తే అది కౌన్సెలింగ్ కిందకే వస్తుందని దీంతో న్యాయపరమైన సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని శుక్రవారం వివరణ కోరగా.. మరో కౌన్సెలింగ్ నిర్వహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లలో కాలేజీల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లలో చేరితే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎంతమంది కాలేజీల్లో చేరుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ఆప్షన్లు.. ఆగమాగం
పెద్ద సంఖ్యలో సీట్లు కోల్పోయిన విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ఆప్షన్ల ప్రక్రియ ఆగమాగంగా మారింది.. విద్యార్థుల తప్పిదాలు, సరిగా అవగాహన కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వేలాది మందికి ఆవేదనను మిగిల్చింది. మొదటి దశలో మంచి కాలేజీలో సీటు రాకపోవడానికి తోడు... ఆ ఉన్న సీటూ రెండో దశలో రద్దుకావడంతో లబోదిబోమనేట్లు చేసింది. ఇలా దాదాపు రెండు వేల మందికి పైగానే విద్యార్థులు తమ సీట్లు కోల్పోయి.. ఆందోళనలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లలో ముందు ఓ సాధారణ కాలేజీని ఎంచుకుని, తర్వాత తనకు ఇష్టమైన కాలేజీకి ఆప్షన్ ఇచ్చాడు. ప్రాధాన్య క్రమంలో ఆ సాధారణ కాలేజీయే ముందుగా ఉండటంతో అందులోనే అతనికి సీటు వచ్చింది. అయితే తర్వాతి దశలో తనకు ఇష్టమైన కాలేజీని ఎంచుకోవడం కోసం... ఈ కాలేజీలో చేరేందుకు ఫీజు చెల్లించలేదు. కానీ రెండో దశలో సీటు రాకపోగా... మొదటి దశలో వచ్చిన సీటునూ కోల్పోయాడు. తాను కోరుకున్న కాలేజీలో తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న విద్యార్థికి సీటు వచ్చింది. ఇలా మంచి ర్యాంకు ఉన్నా ప్రాధాన్య క్రమాన్ని సరిగ్గా ఇవ్వకపోవడం ఇంజనీరింగ్ ప్రవేశాల్లో విద్యార్థుల కొంప ముంచింది. సీట్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇవ్వని కారణంగానూ నష్టపోయారు. దీనిపై అధికారులు ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చారు. ఫీజు చెల్లింపు కేటగిరీలో ఉండి, చివరిదశ వెబ్ ఆప్షన్లకు వెళ్లే విద్యార్థులు మొదటి దశలో వచ్చిన సీటు కోసం ఫీజు చెల్లించాలని సూచించారు. చివరిదశలో అంతకంటే మంచి కాలేజీలో సీటు వస్తే మొదట చెల్లించిన ఫీజును ఆ కాలేజీకి బదిలీ చేస్తామని, ప్రవేశం రద్దు చేసుకుంటే తిరిగి ఇచ్చేస్తామనీ ప్రకటించారు కూడా. వేల మంది విద్యార్థులకు నష్టం ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోని కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు నష్టపోయారు. వెబ్ ఆప్షన్ల ప్రాధాన్య క్రమం సరిగా లేకపోవడం, తక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం, టాప్ కాలేజీల్లోని సీట్ల కోసమే ఎక్కువ మంది ఆప్షన్లు ఇవ్వడం, కాలేజీల ప్రాధాన్యాన్ని విస్మరించి ఆప్షన్లు ఇవ్వడం వంటివాటికి తోడు మొదటి దశలో సీట్లు వచ్చినా ఫీజు చెల్లించకుండా చివరి దశకోసం చూడటంతో ఇలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అంతేగాకుండా సాధారణ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఎక్కువగా డిమాండ్ ఉండే సీఎస్ఈ, ఐటీ వంటి కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో సీట్లు రాలేదు. ఇలాంటివారంతా శనివారం ఉదయం జరిగిన కేటాయింపులో తమకు సీటు రాలేదన్న విషయాన్ని తెలుసుకొని ఆందోళ నకు గురయ్యారు. తమకు అన్యాయం జరిగిందేమోనన్న భావనతో ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు తరలివచ్చారు. సీటు ఎందుకు రాలేదన ్న విషయాన్ని అధికారులు వివరించడంతో.. ఆవేదనగా వెనుదిరిగారు. మరో దశ చేపట్టాలి: ఇంజనీరింగ్‌లో సీట్లు లభించక, వచ్చిన సీట్లు కోల్పోయిన విద్యార్థులకు కారణాలతో సంబంధం లేకుండా న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకోసం మూడో దశ కౌన్సెలింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లలో చేరితే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని, తాము ఫీజులు చెల్లించలేమని కొందరు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఇంటర్విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధి సునీల్ కోరారు. 30 వేల సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్ రెండో దశ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంకా 30,788 సీట్లు మిగిలిపోయాయి. మొత్తంగా కన్వీనర్ కోటాలో 86,805 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి, చివరిదశ కలిపి 56,017 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. మొదటి దశలో 53,347 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా.. 42,418 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో చివరిదశలో కౌన్సెలింగ్‌లో 44,487 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. చివరిదశ అనంతరం 56,017 మంది విద్యార్థులకు సీట్లు వచ్చాయి. ఇక మిగిలిపోయిన సీట్లలో ఇంజనీరింగ్ సీట్లు 26,695కాగా.. ఫార్మసీ, ఫార్మ్-డి సీట్లు 4,093 ఉన్నాయి. మరోవైపు మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 62,668 మందిలో 9,321 మందికి సీట్లు లభించకపోగా.. చివరిదశ కౌన్సెలింగ్‌లో కొత్తగా 7,675 మందికి సీట్లు కేటాయించారు. ఈ లెక్కన దాదాపు 2 వేల మందికి సీట్లు రాలేదు. 7 కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరకపోగా.. 91 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 3 లోగా ఫీజులు చెల్లించండి.. విద్యార్థులు ఈనెల 3వ తేదీ నాటికి ఫీజును చలానా రూపంలో చెల్లించాలి ఆ తరువాత వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజీల్లో 4వ తేదీలోగా చేరాలి 7వ తేదీన ప్రవేశాలను రద్దు చేసుకోవచ్చు. మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యా భవన్లో సంప్రదించాలి కొత్త ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఈనెల 3 లోగా సాంకేతిక విద్యా భవన్‌కు వచ్చి అప్డేట్ చేయించుకోవాలి? ప్రవేశాల వివరాలు ఎంసెట్‌లో అర్హులు 98,643 కన్వీనర్ కోటా సీట్లు 86,805 మొదటి దశలో సీట్లు వచ్చినవారు 53,347 కాలేజీల్లో చేరినది 42,418 చివరిదశతో సహా మొత్తం కేటాయింపు 56,017 చివరి దశలో కొత్తగా సీట్లు పొందిన వారు 7,675 ఆప్షన్లు, కాలేజీలు, బ్రాంచీలు మార్చుకున్నది.. 16,170 మొత్తంగా మిగిలిన సీట్లు.. 30,788 -
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం శుక్రవారం (ఈనెల 17) నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సాయంత్రం 5 గం.ల నుంచి తెలంగాణ ఎంసెట్ ప్రవేశాలపై వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21 వరకూ వెబ్ ఆప్షన్లు కొనసాగుతుండగా, 22 వ తేదీన ఆప్షన్స్ మార్చుకునే వెసులు బాటు కల్పించారు. ఆ తదుపరి రెండు రోజులకు అంటే 24 వ తేదీన సీటు అలాట్ మెంట్ ఉండగా, 25 వ తేదీన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఫేజ్ లో పాల్గొనని విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ 29 వ తేదీగా నిర్ణయించారు. వీరికి 29, 30 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుండగా, 31 వ తేదీన అలాట్ మెంట్, ఆగస్టు 1 వ తేదీన కాలేజీ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కాలేజీలకు అఫిలియేషన్ల వ్యవహారంపై బుధవారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో సుదీర్ఘమైన చర్చల అనంతరం వెబ్ ఆప్షన్లపై తుది నిర్ణయం తీసుకున్నారు. -
జూలై 6 నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు!
ఎంసెట్‌లో అర్హులు 91 వేల మంది 62,777 మంది వరకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సీట్లు 80 వేల నుంచి 90 వేల మధ్యలోనే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మంగళవారంతో ముగిసింది. 62,777 మందికిపైగా విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 91,556 మంది విద్యార్థులు అర్హత సాధించగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 62,777 మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ జేఎన్టీయూ తాము నోటీసులు జారీ చేసిన 237 కాలేజీల నుంచి ఈనెల 20 వరకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు, వారి వాదనలను స్వీకరించింది. వాటిపై మళ్లీ తనిఖీలు చేస్తోంది. వీటిని ఈనెల 28 వరకు పూర్తి చేసి, అనుబంధ గుర్తింపు లభించే కాలేజీల జాబితాలను, వాటిల్లోని సీట్ల వివరాలను ప్రకటించనుంది. అయితే గతంలో లాగే ఈసారి 60 నుంచి 70 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమది టాప్ కాలేజీ అని చెప్పుకున్న వాటిల్లోనూ చాలా లోపాలు బయట పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చాలా కాలేజీల్లో పలు బ్రాంచీలకు, వేలల్లో సీట్లకు కోత పడే పరిస్థితి ఉండొచ్చని ఉన్నత విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా ఈసారి తెలంగాణలో సీట్లు 80 వేల నుంచి 90 వేల మధ్యలోనే ఉండొచ్చని వాదనల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల సంఖ్యను కూడా 150 నుంచి 170 వరకు పరిమితం చేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు ప్రభుత్వం, అటు జేఎన్టీయూ(హెచ్) నాణ్యత ప్రమాణాలకే పెద్దపీట వేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. అందుకే నిబంధనలు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ తదితర విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీలకే వాటిల్లో సదుపాయాలు, వసతులను బట్టి బ్రాంచీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది. ఈ గుర్తింపు ప్రక్రియపై ఈనెల 28 లేదా 29 తేదీల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఆ తరువాత అనుబంధ గుర్తింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ తరువాత ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది. ఈ ప్రక్రియ మొత్తం అయ్యే సరికి 10 రోజులు పడుతుంది. మరోవైపు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 6 నుంచి మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున , అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్‌లో మొత్తంగా ఎంసెట్‌లో అర్హులు-79,043 ఓయూ రీజియన్‌లో మొత్తంగా వెరిఫికేషన్‌కు హాజరైంది- 58,906 గత ఏడాది కంటే ఈసారి వెరిఫికేషన్‌కు హాజరైన వారి సంఖ్య పెరిగింది. గత ఏడాది 60 శాతం వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా ఈసారి 69 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు.. వన్‌టైమ్ పాస్వర్డ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించి మోసాలను అరికట్టేందుకు వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ఇంజనీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. వెబ్సైట్లో ఆప్షన్లు ఇచ్చే పేజీలోకి వెళ్లి విద్యార్థి తన వివరాలను నమోదు చేయగానే ఆ విద్యార్థి మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకున్నారు. ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ 15 నిమిషాల పాటు పనిచేసేలా చర్యలు చేపట్టాలని.. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో రూపొందించాలని నిర్ణయించారు. దీంతోపాటు హెల్ప్‌లైన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల వారు విద్యార్థి స్క్రాచ్ కార్డులోని పాస్‌వర్డ్‌ను దొంగిలించడం.. విద్యార్థులకు తెలియకుండానే, వారు ఇవ్వకపోయినా కొన్ని కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వడం వంటి మోసాల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఉన్నత స్థాయి కమిటీ పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ఇంటర్నెట్ కేంద్రాలు, ఇళ్లలోంచి కాకుండా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే ఆలోచనచేసింది. కానీ, అందులోని ఇబ్బందుల నేపథ్యంలో వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదీ వన్ టైం పాస్వర్డ్ విధానం: విద్యార్థి దరఖాస్తు చేసుకున్నప్పుడే మొబైల్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఆ మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ సహాయంతో వెబ్సైట్లో ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ పాస్వర్డ్ 15 నిమిషాల పాటు మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలోగా విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు వాటంతట అవే సేవ్ అయి, విద్యార్థి లాగ్ అవుట్ అవుతాడు. మళ్లీ లాగిన్ అయితే మరో పాస్వర్డ్ వస్తుంది. దానితో మళ్లీ పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, దళారీలు మోసం చేసినా, ప్రలోభాలకు గురిచేసినా... ఆ తరువాత విద్యార్థి మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. 14 రోజుల పాటు ఈ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. చివరి రోజున విద్యార్థి మరోసారి ఆప్షన్లను సరిచూసుకొని మార్పు చేసుకొని సబ్మిట్ చేయవచ్చు.