ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై స్పష్టం చేసిన ఉపముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వెబ్‌ఆప్షన్లు సరిగా ఇవ్వకపోవడంతో సీట్లు రాని విద్యార్థులకు నిరాశ ఎదురైంది. మరోసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్న న్యాయనిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోసారి కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి అని, అయితే కోర్టు అనుమతి ఇస్తుందో లేదోనన్న అనుమానంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పేర్కొన్నాయి.
దీంతో దాదాపు 5 వేల మంది విద్యార్థులు మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కోల్పోయారు. కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లను ఆగస్టు 15లోగా భర్తీ చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ సీట్లను కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకుంటాయని, ప్రభుత్వం నిర్వహిస్తే అది కౌన్సెలింగ్ కిందకే వస్తుందని దీంతో న్యాయపరమైన సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని శుక్రవారం వివరణ కోరగా.. మరో కౌన్సెలింగ్ నిర్వహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లలో కాలేజీల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లలో చేరితే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎంతమంది కాలేజీల్లో చేరుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరో కౌన్సెలింగ్ లేనట్లే
Published Sat, Aug 8 2015 2:04 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement