ఆప్షన్లు.. ఆగమాగం
పెద్ద సంఖ్యలో సీట్లు కోల్పోయిన విద్యార్థులు
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగమాగంగా మారింది.. విద్యార్థుల తప్పిదాలు, సరిగా అవగాహన కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వేలాది మందికి ఆవేదనను మిగిల్చింది. మొదటి దశలో మంచి కాలేజీలో సీటు రాకపోవడానికి తోడు... ఆ ఉన్న సీటూ రెండో దశలో రద్దుకావడంతో లబోదిబోమనేట్లు చేసింది. ఇలా దాదాపు రెండు వేల మందికి పైగానే విద్యార్థులు తమ సీట్లు కోల్పోయి.. ఆందోళనలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లలో ముందు ఓ సాధారణ కాలేజీని ఎంచుకుని, తర్వాత తనకు ఇష్టమైన కాలేజీకి ఆప్షన్ ఇచ్చాడు. ప్రాధాన్య క్రమంలో ఆ సాధారణ కాలేజీయే ముందుగా ఉండటంతో అందులోనే అతనికి సీటు వచ్చింది. అయితే తర్వాతి దశలో తనకు ఇష్టమైన కాలేజీని ఎంచుకోవడం కోసం... ఈ కాలేజీలో చేరేందుకు ఫీజు చెల్లించలేదు. కానీ రెండో దశలో సీటు రాకపోగా... మొదటి దశలో వచ్చిన సీటునూ కోల్పోయాడు. తాను కోరుకున్న కాలేజీలో తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న విద్యార్థికి సీటు వచ్చింది. ఇలా మంచి ర్యాంకు ఉన్నా ప్రాధాన్య క్రమాన్ని సరిగ్గా ఇవ్వకపోవడం ఇంజనీరింగ్ ప్రవేశాల్లో విద్యార్థుల కొంప ముంచింది. సీట్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇవ్వని కారణంగానూ నష్టపోయారు. దీనిపై అధికారులు ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చారు. ఫీజు చెల్లింపు కేటగిరీలో ఉండి, చివరిదశ వెబ్ ఆప్షన్లకు వెళ్లే విద్యార్థులు మొదటి దశలో వచ్చిన సీటు కోసం ఫీజు చెల్లించాలని సూచించారు. చివరిదశలో అంతకంటే మంచి కాలేజీలో సీటు వస్తే మొదట చెల్లించిన ఫీజును ఆ కాలేజీకి బదిలీ చేస్తామని, ప్రవేశం రద్దు చేసుకుంటే తిరిగి ఇచ్చేస్తామనీ ప్రకటించారు కూడా.
వేల మంది విద్యార్థులకు నష్టం
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోని కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు నష్టపోయారు. వెబ్ ఆప్షన్ల ప్రాధాన్య క్రమం సరిగా లేకపోవడం, తక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం, టాప్ కాలేజీల్లోని సీట్ల కోసమే ఎక్కువ మంది ఆప్షన్లు ఇవ్వడం, కాలేజీల ప్రాధాన్యాన్ని విస్మరించి ఆప్షన్లు ఇవ్వడం వంటివాటికి తోడు మొదటి దశలో సీట్లు వచ్చినా ఫీజు చెల్లించకుండా చివరి దశకోసం చూడటంతో ఇలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అంతేగాకుండా సాధారణ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఎక్కువగా డిమాండ్ ఉండే సీఎస్‌ఈ, ఐటీ వంటి కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో సీట్లు రాలేదు. ఇలాంటివారంతా శనివారం ఉదయం జరిగిన కేటాయింపులో తమకు సీటు రాలేదన్న విషయాన్ని తెలుసుకొని ఆందోళ నకు గురయ్యారు. తమకు అన్యాయం జరిగిందేమోనన్న భావనతో ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు తరలివచ్చారు. సీటు ఎందుకు రాలేదన ్న విషయాన్ని అధికారులు వివరించడంతో.. ఆవేదనగా వెనుదిరిగారు.
మరో దశ చేపట్టాలి: ఇంజనీరింగ్‌లో సీట్లు లభించక, వచ్చిన సీట్లు కోల్పోయిన విద్యార్థులకు కారణాలతో సంబంధం లేకుండా న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకోసం మూడో దశ కౌన్సెలింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లలో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని, తాము ఫీజులు చెల్లించలేమని కొందరు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఇంటర్‌విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధి సునీల్ కోరారు.
30 వేల సీట్లు ఖాళీ..
ఇంజనీరింగ్ రెండో దశ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంకా 30,788 సీట్లు మిగిలిపోయాయి. మొత్తంగా కన్వీనర్ కోటాలో 86,805 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి, చివరిదశ కలిపి 56,017 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. మొదటి దశలో 53,347 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా.. 42,418 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో చివరిదశలో కౌన్సెలింగ్‌లో 44,487 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. చివరిదశ అనంతరం 56,017 మంది విద్యార్థులకు సీట్లు వచ్చాయి. ఇక మిగిలిపోయిన సీట్లలో ఇంజనీరింగ్ సీట్లు 26,695కాగా.. ఫార్మసీ, ఫార్మ్-డి సీట్లు 4,093 ఉన్నాయి. మరోవైపు మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 62,668 మందిలో 9,321 మందికి సీట్లు లభించకపోగా.. చివరిదశ కౌన్సెలింగ్‌లో కొత్తగా 7,675 మందికి సీట్లు కేటాయించారు. ఈ లెక్కన దాదాపు 2 వేల మందికి సీట్లు రాలేదు. 7 కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరకపోగా.. 91 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
3 లోగా ఫీజులు చెల్లించండి..
విద్యార్థులు ఈనెల 3వ తేదీ నాటికి ఫీజును చలానా రూపంలో చెల్లించాలి
ఆ తరువాత వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
కాలేజీల్లో 4వ తేదీలోగా చేరాలి
7వ తేదీన ప్రవేశాలను రద్దు చేసుకోవచ్చు. మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో సంప్రదించాలి
కొత్త ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఈనెల 3 లోగా సాంకేతిక విద్యా భవన్‌కు వచ్చి అప్‌డేట్ చేయించుకోవాలి?
ప్రవేశాల వివరాలు
ఎంసెట్‌లో అర్హులు 98,643
కన్వీనర్ కోటా సీట్లు 86,805
మొదటి దశలో
సీట్లు వచ్చినవారు 53,347
కాలేజీల్లో చేరినది 42,418
చివరిదశతో సహా
మొత్తం కేటాయింపు 56,017
చివరి దశలో కొత్తగా
సీట్లు పొందిన వారు 7,675
ఆప్షన్లు, కాలేజీలు,
బ్రాంచీలు మార్చుకున్నది.. 16,170
మొత్తంగా మిగిలిన సీట్లు.. 30,788